తినేటప్పుడు ఇబ్బంది?

సమస్య: నాకు 21 ఏళ్లు. భోజనం చేసేటప్పుడు ఛాతీ మంటగా అనిపిస్తుంది. ఆహారం లోపలికి వెళ్లే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో భోజనం చేయలేకపోతున్నాను. అలాగే అరికాలి మంటలూ వేధిస్తున్నాయి. దయచేసి వీటికి పరిష్కార మార్గం తెలియజేయండి.

Updated : 09 Nov 2021 00:58 IST

సమస్య: నాకు 21 ఏళ్లు. భోజనం చేసేటప్పుడు ఛాతీ మంటగా అనిపిస్తుంది. ఆహారం లోపలికి వెళ్లే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో భోజనం చేయలేకపోతున్నాను. అలాగే అరికాలి మంటలూ వేధిస్తున్నాయి. దయచేసి వీటికి పరిష్కార మార్గం తెలియజేయండి.

- పి.పరశురాములు (ఈమెయిల్‌)

సలహా: ఛాతీలో మంటకు అసిడిటీ కారణం కావొచ్చు. ఇందులో జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం వల్ల ఛాతీ మండినట్టు అనిపిస్తుంది. వేళకు భోజనం చేయకపోవటం, మసాలాలు, కారం ఎక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవటం, మద్యం అలవాటు, పొగ తాగటం, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణమవుతుంటాయి. ఇది మామూలు సమస్యే. కారం, మసాలాలు తగ్గించటం.. తగినంత వ్యాయాయం చేయటం, ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే మందులతో ఇది తగ్గుతుంది. అయితే మీరు ఆహారం లోపలికి వెళ్లే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటోందనీ అంటున్నారు. ఇది అంత తేలికైన సమస్య కాదు. అన్నవాహిక లోపలి మార్గం సన్నబడినప్పుడు ముద్ద కిందికి దిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎంతకాలంగా ఛాతీమంటతో బాధపడుతున్నారో తెలియజేయలేదు. దీర్ఘకాలంగా అసిడిటీ గలవారిలో జీర్ణరసాలు అన్నవాహికలోకి ఎగదన్నుకొని రావటం వల్ల కణజాలం దెబ్బతిని మార్గం సన్నబడే (ఈసోఫేగల్‌ పెప్టిక్‌ స్ట్రిక్చర్‌) అవకాశముంది. అలాగే అన్నవాహిక కింది భాగంలో నాడులు పనిచేయకపోవటం (అకలేషియా కార్డియా) మూలంగానూ ముద్ద సరిగా కిందికి దిగదు. అరుదుగా క్యాన్సర్‌తోనూ ఇలాంటి లక్షణాలు కనిపించొచ్చు. అందువల్ల సమస్య ఏంటన్నది కచ్చితంగా నిర్ధారణ అయితేనే చికిత్స సాధ్యమవుతుంది. మీరు గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేయించుకోవటం చాలా ముఖ్యం. ఇందులో సమస్య ఏంటన్నది బయటపడుతుంది. మీది చిన్నవయసే కాబట్టి క్యాన్సర్‌ కాకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జీర్ణకోశ నిపుణులను సంప్రదిస్తే పరీక్షించి, తగు చికిత్సలు సూచిస్తారు. ఇక అరికాళ్ల మంటలకు రక్తహీనత, విటమిన్‌ బి12 లోపం కారణం కావొచ్చని అనిపిస్తోంది. అసిడిటీతో సరిగా తినకపోవటంతోనూ ఇవి తలెత్తొచ్చు. రక్త పరీక్ష చేస్తే ఇలాంటి సమస్యలు బయటపడతాయి. మందులు వేసుకుంటే ఇవి తగ్గుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని