గది లోపలిగోడ

శీతాకాలపు సాయంత్రం.. వర్షం ఉండుండీ కురుస్తోంది. చలి విపరీతంగా ఉండటంతో స్వెట్టర్‌ వేసుకుని, అరచేతుల్ని కలిపి రుద్దుకుంటూ గడియారంవైపు చూశాను. నాలాగే గడియారం కూడా అలసిపోయినట్లుంది- నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది.

Published : 09 Apr 2020 17:18 IST

కె.యన్‌.బాలాజి


శీతాకాలపు సాయంత్రం.. వర్షం ఉండుండీ కురుస్తోంది. చలి విపరీతంగా ఉండటంతో స్వెట్టర్‌ వేసుకుని, అరచేతుల్ని కలిపి రుద్దుకుంటూ గడియారంవైపు చూశాను. నాలాగే గడియారం కూడా అలసిపోయినట్లుంది- నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది. అసలీ బెంగుళూరు వాతావరణమే అంత. పగలూ రాత్రీ చలి చంపేస్తూ ఉంటుంది. దానికితోడు ఈరోజు వర్షం కూడా తోడైంది. మావారు ఆఫీసు నుండి రావటానికి ఎంతలేదన్నా ఇంకో గంటపైనే పడుతుంది.

అత్తా మామయ్యలు బంధువులింట్లో  పెళ్ళికని తిరుపతి వెశ్ళారు. పిల్లలకి వరుసగా మూడురోజులు సెలవులు రావటంతో వాళ్ళని కూడా పెళ్ళికి పంపించేశాను. మావారికి ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా సెలవు 

దొరక్కపోవడంతో ఆయన, ఆయనతోబాటు నేనుపెళ్ళికి పోకుండా ఆగిపోయాం.

మొన్నటిదాకా ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. బెంగుళూరుకి బంధువులు ఎవరు వచ్చినా ఇంటికి రాకుండా పోరు. వచ్చినవారికి అతిథి మర్యాదలు చేసేసరికి ప్రాణం అలసిపోతుంది. రెండుగదుల ఇల్లు బెంగుళూర్లో దొరకటం అంటే మాటలుకాదు. ఈ ఊర్లో ఉద్యోగాలు దొరకటం చాలా సులభం కానీ ఇళ్ళు దొరకటమే మహాకష్టం.

ఇల్లు చిన్నది కావటం మూలాన మేం ఏం మాట్లాడుకుంటున్నా, చిన్నగా అరచినా నవ్వినా సరే... పక్కగదిలోని వాళ్ళకు స్పష్టంగా విన్పిస్తూ ఉంటుంది. అందుకని పడగ్గదిలో లేదా గదిలో నేను మావారితో మనస్ఫూర్తిగా మాట్లాడటమే మానేశాను. అయినా ఆయనంత మొద్దవతారం ఈ లోకంలో ఇంకెవరూ ఉండరేమో అన్పిస్తుంది. లేకలేక ఇంట్లో ఏకాంతం దొరుకుతూ ఉంటే త్వరగా ఇంటికి రావచ్చు కదా. అయినా, ఆయన సంగతి నాకు మా మొదటిరాత్రే తెలిసిపోయింది. సినిమాల్లో, టీవీల్లో చూసీ, పుస్తకాల్లో చదివీ మొదటిరాత్రిని గొప్పగా ఊహించేసుకున్నాను.

అదే పెద్ద పొరపాటైపోయిందని నాకు ఆ తర్వాత తెలిసింది.

మొదటిరాత్రి సిగ్గుతో, భయంతో, ఏవేవో కోరికలతో, సందేహాలతో బెరుగ్గా శోభనం గదిలోకి అడుగుపెట్టాను. నా భయాన్నీ బిడియాన్నీ మావారు పోగొట్టి, నన్ను లాలించి దగ్గరకు తీసుకుంటారని అనుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి.

నా గురించీ నా బాల్యం గురించీ నా స్నేహితులూ అమ్మా నాన్నల గురించీ నా అభిరుచులూ ఆలోచనల గురించీ ఏమిటేమిటో కబుర్లు చెప్పాలనుకున్నాను. అట్లాగే మావారూ తన గురించిన వివరాల్ని నాకు చెప్పే ప్రయత్నం చేస్తారనుకున్నాను. 

మా ఆయన తన గురించీ చెప్పలేదు.. నా గురించీ అడగలేదు. ఇద్దరం ముభావంగా ఉండిపోయాం. నా దురదృష్టానికితోడు కరెంటు పోయింది. చీకట్లో దిక్కుతోచకుండాపోయింది. నాకైతే ఏమిటో ఒకటే భయం ఆవరించింది. శోభనం గదిలో క్యాండిల్స్‌ లేవు. ఎమర్జెన్సీ లైటూ లేదు. బయటనుంచి క్యాండిల్స్‌ తెప్పించుకుందామంటే ఎడతెగని సిగ్గు ముంచుకొచ్చేసింది నాకు. మావారేమిటో ఒకటి, రెండు మాటలైనా మాట్లాడారు కానీ నాకు అసలే నోరు పెగల్లేదు. నా ఇష్టాయిష్టాలతో సహకారంతో స్పందనతో ప్రమేయం లేకుండానే మా మొదటిరాత్రి గడిచిపోయింది. నాకైతే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. ఆ రాత్రంతా శబ్దం రాకుండా ఏడుస్తూనే ఉండిపోయాను. మొదటిరాత్రి సరే, రెండు, మూడవ రాత్రులయినా మేం ఒకరికొకరం దగ్గరవుతామని అనుకుంటే అదసలు సాధ్యమేకాదని అర్థమైపోయింది. ఏ రాత్రీ మా ఆయన నా శరీరానికి దగ్గరవటానికి ప్రయత్నించారే తప్ప, నాకూ నా మనసుకూ దగ్గరకావటానికి అస్సలు ప్రయత్నించలేదు.

పెళ్ళయి దశాబ్దం దాటింది. అయినా నాలో ఎడతెగని అసంతృప్తి. నాకింకా శోభనం జరగనట్లే అనిపిస్తుందని చెబితే... మావారూ ఈ లోకమూ నన్నో వెర్రిదానిలా చూస్తారని తెలుసు. అయినా అది నిజం.

ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది- ఇప్పటికైనా మించిపోయిందిలేదనీ ఈరోజో రేపో అయినా నాకు మళ్ళీ మొదటిరాత్రి ముచ్చట్లు అనుభవంలోకి వస్తాయని. 

ఎప్పుడూ మావారు నన్ను గుర్తించనట్లే ఉంటారు. నన్నసలు పట్టించుకుంటున్నట్లే కనిపించరు. అయినా ఆయనతో గొడవపడ్డానికి ఎంత వెదికినా నాకు కారణాలు కనిపించవు. నేను ఏ కాస్త మూడీగా ఉన్నా ఆయన అడుగుతూనే ఉంటారు. ‘ఏం భావనా, ఆరోగ్యం సరిగ్గా లేదా?’ అని. మనిషికి శరీరంతోబాటూ మనసు కూడా ఉంటుందనీ దానిక్కూడా గాయాలవుతూ ఉంటాయనీ మావారికి తెలిసినట్లు లేదు.

పగలంతా పనులతో హడావిడిగా తీరికలేకుండా గడిచిపోతుంది కానీ, సాయంత్రం అయితే చాలు దిగులు మొదలవుతుంది. ఏమిటో ఒంటరితనం నన్ను వేధిస్తూనే ఉంది. రాత్రంతా ఒంటరితనంతో బాధపడ్డా, 

పగలంతా పనులతో గడిచిపోతుంది. 

ప్రతిరాత్రీ నేను మావారికి దగ్గరవటానికే ప్రయత్నిస్తుంటాను కానీ మావారు దాన్నసలు పట్టించుకోరు. అప్పటికీ తనేమన్నా అనుకోనీ అని, నా అసంతృప్తినీ నా ఆలోచనల్నీ మావారికి వివరించే ప్రయత్నం చేశాను. కానీ ఆ కారణంగా మావారు నాపైన జాలి చూపించటం ప్రారంభించటంతో త్వరలోనే నేను నోరు మూసుకోక తప్పలేదు. 

ప్రేమించటం ఎంత ముఖ్యమో, ఆ ప్రేమను వ్యక్తంచేయటం అంతకన్నా ముఖ్యం అని మావారికి అర్థమయ్యేరోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. అప్రయత్నంగా అద్దంలో మొహం చూసుకున్నాను. అక్కడక్కడా నాలుగైదు తెల్లవెంట్రుకలు, కళ తప్పిన మొహం, అలసిపోయిన కళ్ళు. చిరాకేసింది. ఒకప్పటి చలాకీతనం, ఉత్సాహం ఎక్కడికి వెశ్ళాయో, ఏ దొంగ వాటిని నానుండి పట్టుకెళ్ళిపోయాడో తెలియటంలేదు.

దిగులుతో మొదలై, కలతనిద్రతో ముగిసే రాత్రులు... ఎప్పుడూ వెంటాడే ఒంటరితనం... ఇదీ జీవితం!

వేడివేడి టీ తాగాలనిపించింది. మళ్ళీ అంతలోనే, మావారు వచ్చేంతవరకూ ఆగి తనతోపాటు టీ తాగాలనిపించింది.

కిటికీలోంచి చూశాను. వర్షానికి తడిచిన రోడ్డు అందంగా ఉంది. గొడుగులచాటున మనుషులు పరుగులు తీస్తున్నారు. వర్షాన్ని లెక్కచెయ్యకుండా దూరాల్ని జయించాలని వాహనాలు వేగంగా పరుగులు తీస్తున్నాయి. అంతటా వేగం... జీవితం నిండా వేగమే! దూరాల్ని జయించాలని కాలంచేసే ప్రయత్నమే జీవితం!

కాలేజీ రోజులనాటి కవిత్వం ఇప్పుడేమైందో తెలీదు. ఇప్పుడంతా లెక్కలే లెక్కలు. ఆదాయాలు, వ్యయాలు, చేయాల్సిన ఆదాలు. మొదట్లో జీవితంలో ఏదో మిస్సయిన ఫీలింగ్‌ ఉండేది. ఇప్పుడేమిటో అసలు జీవితమే మిస్సయినట్లుంది!

ఎక్కడో ఏవో గోడలు... గదినిండా మామధ్యా... ఏవేవో గోడలు.

‘ఏవండీ, మనం అలా సరదాగా వర్షంలో నడుద్దాం రండి’ అని నేను అడిగితే మావారి మొహం ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేస్తుంటే నవ్వాగలేదు నాకు.

ముందు నావైపు అయోమయంగా చూస్తారేమో! ‘అంత అర్జెంటు పనైతే ఆటోలో వెళ్లొద్దాం భావనా’ అనంటారేమో!

నేను అలా నవ్వుతూ ఉండగానే మావారి స్కూటర్‌ హారన్‌ వినిపించింది. చప్పున లేచి తలుపు తెరిచాను. టవల్‌ అందించాను. అందుకుని తల తుడుచుకున్నారు. మావారు డ్రస్‌ మార్చుకుని వచ్చేలోగా కిచెన్‌లోకి వెళ్ళి టీ చేసుకొచ్చాను. కిటికీ దగ్గరగా టీపాయ్‌నీ రెండు కుర్చీల్నీ జరిపాను.

టేప్‌ ఆన్‌ చేశాను. నాకు చాలా ఇష్టమైన క్యాసెట్‌ ఇళయరాజా సింఫనీ... బయట పలుచని వర్షం... శీతాకాలపు చలిగాలి... వెచ్చటి టీ. ఒక కుర్చీలో కూర్చున్నాను.

‘ఎదురుగా మావారు, ఎదురెదురుగా మేము’ అనుకుంటుంటే మళ్ళీ నవ్వొచ్చింది.

మా వారు వచ్చీరాగానే నా మూడ్‌తో సంబంధం లేకుండా టీ కప్పును ఒక చేత్తో డైలీ న్యూస్‌పేపర్ని మరోచేత్తో పట్టుకుని బెడ్‌రూంలోకి వెళ్ళిపోయారు.

మనస్సు చివుక్కుమంది.

అయినా నాకు ఇదేం కొత్తకాదు కదా అనుకున్నాను. నాకు నేనే సర్దిచెప్పుకుని బెడ్‌రూంలోకి నడిచి, మంచంపైన, మావారికి ఎదురుగా కూర్చున్నాను.

ఆయన అప్పటికీ పేపర్లోంచి తలపైకెత్తి నన్ను చూడనేలేదు.

ఒకే ఇంట్లో ఒకే గదిలోనే ఉన్నా మామధ్య అదృశ్యంగా దూరం ఉందనిపించింది. చిన్నప్పటి ఆట ఒకటి గుర్తొచ్చింది. ఎంతెంత దూరం... చాలాచాలా దూరం.

ఎంతకాలం ఇలా అనిపించింది.

ఆ క్షణమే నేనో నిర్ణయానికి వచ్చేశాను. ఏమైతే అదవుతుందనుకుని నాకు నేను ధైర్యం తెచ్చుకుని పేపర్‌ లాగి అవతల పడేశాను. మావారు తల పైకెత్తి నావైపే ఆశ్చర్యంగా చూస్తూ- ‘‘ఏం భావనా, ఏమైంది?’’ అని 

అడిగారు. నేను సమాధానం చెప్పే ప్రయత్నమే చెయ్యలేదు.

‘‘ఏం భావనా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి...’’ కొంచెం ఆదుర్దాగా అడిగిన మావారివైపు చురుగ్గా చూశాను.

నాకా క్షణం నా మనసులో అనిపించినదాన్నే స్పష్టంగా మావారికి చెప్పెయ్యాలనిపించింది. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది లేదా తనకు అర్థంకాకున్నా కొత్తగా వచ్చే నష్టమేం లేదనిపించింది. అర్థంచేసుకోవాలన్న ఆలోచనే అతడికి లేకపోతే నేనెప్పటికీ అసలర్థంకాలేనని నాకూ తెలుసు. నాకా క్షణం అనిపించిందేమిటో మా వారికి చెప్పేశాను.

‘‘నీకు దగ్గరయ్యేటప్పుడు పెదాలు ఎర్రబడతాయి. నీవు దూరమవుతుంటే కళ్ళు ఎర్రబడతాయి’’.

మా వారికి ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదుకానీ మావారు టీకప్పును దూరంగా పెట్టేసి నన్ను తన చేతుల్లోకి తీసుకున్నారు.

‘‘మళ్ళీ చెప్పు’’ అని అడిగారు చిలిపిగా నవ్వుతూ. ఆ నవ్వులో ఏదో సిగ్గు దాగుందనిపించింది.

ఈసారెందుకో నాక్కూడా సిగ్గేసింది.

అయినా చెప్పాను మళ్ళీ!

‘‘ఏం భావనా, చిన్నప్పుడు కవిత్వం రాసేదానివా’’ అడిగిన మావారివైపు చూసి చిన్నగా నవ్వాను.

ఎప్పుడైనా నేను చెప్పేది మనసుపెట్టి వింటే కదా, నా గురించి మావారికి తెలిసేందుకు?అసలు మేమిద్దరం మాట్లాడుకోవటానికి మాకు ఏకాంతం ఏది? గది లోపల గోడలు. ఇప్పటికైనా బద్దలవ్వాల్సిందే! లేకలేక దొరికిన ఈ ఏకాంతాన్ని మిస్సవదలచుకోలేదు.

మాటల ప్రవాహానికి ఎక్కడో గట్లు తెగాయి. బాల్యం, యవ్వనం, దాంపత్య జీవితం, నేను, మావారు, పిల్లలు, నా కోరికలు, ఆలోచనలు, అభిప్రాయాలు... ఏమిటేమిటో కబుర్లు ఆగకుండా దొర్లిపోతూనే ఉన్నాయి.

మాట్లాడి మాట్లాడి అలసిపోయాను. మావారు విభ్రాంతిగా నావైపే కశ్ళార్పకుండా చూస్తూండిపోయారు.

‘ఈవిడేమిటి, పెళ్ళయిన ఇంతకాలానికిలా మాట్లాడుతుందేమిటా’ అనుకున్నారేమో. మధ్యలో మావారే లేచి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చారు. నీళ్ళు తాగాక ఎందుకో నాకు ఉన్నట్టుండి సిగ్గు ముంచుకొచ్చింది.

కబుర్లతోనే కడుపులు నిండిపోయాయి.

‘ఇక మీ కథేమిటీ’ అన్నట్లు మావారి వైపు చూసి కళ్ళెగరేశాను.

నా అంత వేగంగా కాదుకానీ అక్కడక్కడా ఆగుతూ మావారు కూడా ఆయన జ్ఞాపకాల్ని చెప్పసాగారు. తను మాట్లాడుతూ ఉంటే చప్పున కరెంటు పోయింది.

‘‘అరె, కరెంటుపోయిందే’’ అన్నాను 

అనాలోచితంగా.

‘‘ఇప్పుడేమైంది. నువ్వున్నావు కదా... 

ఈ వెన్నెల చాల్లే మనకి’’.

ఒక్క క్షణం ఒళ్ళు పులకరించింది.

ఇంత ప్రేమగా, చనువుగా మాట్లాడుతోంది మావారేనా అని అనుమానం కలిగింది కూడా.

నాలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన ఒంటరితనం క్షణంలో మటుమాయమైపోయింది.

నా దిగులంతా ఎటో ఎగిరిపోతున్నట్లయి... మెదడులోని నిరాశాపూరిత ఆలోచనలన్నీ ఎటో మాయమైపోయి... నేనేమిటో ఖాళీ అవుతున్నట్లయి... ఈ శీతాకాలపు చలిరాత్రే మా మొదటిరాత్రి అయినట్లు... మామధ్య దూరాలు నిశ్శబ్దంగా అదృశ్యమైపోయినట్లు... ఒకరికొకరం దగ్గరవుతూ మామధ్య దూరాల్ని తొలగించుకుంటూ... ఇద్దరం ఒకటవుతూ... ఒకరికి ఒకరయి... ఇద్దరం ఒకరయి.. ఒకరే అయి... గది లోపలి గోడలేవో కూలిపోతున్నట్లయి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని