ఇది నిజమైతే ఎంత బాగుండు!

కోతులు సంతోషంతో గ్రామాల నుంచి అడవికి పరుగులు తీస్తున్నాయి. అప్పుడు వాటిని దారిలో ఒక అడవి దున్న ఆపి ‘ఎందుకు అలా పరుగెడుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది.‘ఏమీ లేదు. అడవిలో పండ్ల చెట్లు నిండుగా ఉన్నాయట. కుందేలు మామ చెప్పింది. ఇన్ని రోజులు అక్కడ అడవుల్లో చెట్లు లేక ఆహారం దొరకక మానవులుండే గ్రామాలకు వలస వచ్చాం. ఇక మన కష్టాలు తీరిపోయాయని కుందేలు మామ

Published : 19 Apr 2021 00:14 IST

కోతులు సంతోషంతో గ్రామాల నుంచి అడవికి పరుగులు తీస్తున్నాయి. అప్పుడు వాటిని దారిలో ఒక అడవి దున్న ఆపి ‘ఎందుకు అలా పరుగెడుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది.
‘ఏమీ లేదు. అడవిలో పండ్ల చెట్లు నిండుగా ఉన్నాయట. కుందేలు మామ చెప్పింది. ఇన్ని రోజులు అక్కడ అడవుల్లో చెట్లు లేక ఆహారం దొరకక మానవులుండే గ్రామాలకు వలస వచ్చాం. ఇక మన కష్టాలు తీరిపోయాయని కుందేలు మామ చెబితే ఎంతో సంతోషం కలిగింది. అందుకే ఈ పరుగు’ అని అన్నాయి. ఆ మాటలు విన్న అడవి దున్న ‘అయితే నేనూ వస్తాను పదండి’ అని అది కూడా పరుగు లంకించుకుంది.
కాసేపటికి వాటికి అడవి పందులు ఎదురై ‘ఎందుకు పరుగు తీస్తున్నారు? ఏమైంది?’ అని ప్రశ్నించింది. కోతులు జవాబు ఇస్తూ.. ‘మన అడవులు మళ్లీ దట్టంగా పెరిగాయట. పండ్ల చెట్లు విపరీతంగా పెరిగి అనేక రకాల పండ్లు కనిపించాయట’ అని అన్నాయి. వెంటనే అడవి పందులు అన్నీ కూడా అడవులకు పరుగులు తీశాయి.
అవి అలా వెళ్లిపోతుంటే ఎలుగుబంటి ఎదురై వాటిని ఆపి ‘ఏమిటా పరుగు.. మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు’ అని ప్రశ్నించింది. అవి విషయం వివరించి చెప్పాయి. ‘ఎంత శుభవార్త చెప్పారు. నేనూ వస్తాను పదండి’ అని ఎలుగుబంటి అంది.
అవి అలా పరిగెడుతుంటే వాటికి ఏనుగులు ఎదురయ్యాయి. ‘ఎక్కడికి వెళుతున్నారు’ అని వాటిని ప్రశ్నించాయి. ‘ఓ ఏనుగు మామా! అడవులు చాలా పెరిగాయట. నువ్వు ఇంకా ఇక్కడ దేవాలయాల్లో, సర్కసుల్లో ఉండాల్సిన అవసరం లేదు. అడవుల్లో మీకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది పద! సింహం రాజుగా మనది మనమే చక్కగా పాలించుకుందాం’ అని అన్నాయి. అది విన్న ఏనుగులు కూడా వాటి వెనకే నెమ్మదిగా పరుగు తీశాయి.
ఇంతలో కుక్కలు, పశువులు కూడా గ్రామాల నుంచి పరుగు తీయడం ప్రారంభించాయి. అప్పుడు ఒక కోతి వెనకకు తిరిగి చూసి ‘అవునూ! మీరు ఎందుకు వస్తున్నారు? మీరు ఉండేది మనుషుల దగ్గరే కదా!’ అని అడిగింది.
అప్పుడు అవి ‘నీవన్నది నిజమే. మేము అడవిలో నివాసం ఉండటానికి పరుగు తీయడం లేదు. చూడటానికి వస్తున్నాం. ఎంతో సుందరంగా అడవులు పెరిగాయని మనుషులు కూడా అంటున్నారు. మేము చూస్తే తప్పేంటి?’ అని అన్నాయి. ‘సరే రండి. మానవులను మాత్రం వద్దని చెప్పండి. మా జంతువులను చూస్తే మళ్లీ వేటాడడం ప్రారంభిస్తారు’ అని అంది.
అప్పుడు అవి ‘అదేం లేదు. వారిలో చాలా మార్పు వచ్చింది. వారు రావడం లేదు. మేము చూసిన తర్వాత వారికి అడవి గొప్పతనాన్ని వివరిస్తాం. అయినా వారు మొక్కలు నాటితేనే కదా మీకు ఇప్పుడు అవి వృక్షాలుగా కనబడుతున్నాయి. అందరూ దుర్మార్గులు ఉండరు కదా!’ అని అన్నాయి.
‘ఎంతైనా మీరు మానవ పక్షపాతులు. సరే రండి’ అని అన్నాయి. వెంటనే అడవికి రాజైన సింహానికి ఈ సంగతి తెలిసి అది కూడా పరుగు పెట్టింది. తోవలో కనబడిన పెద్దపులి, చిరుతపులి, తోడేలు, జింకలకు కూడా ఈ సంగతి చెబుతూ.. ‘పదండి.. పదండి.. మన నివాసాలకు పోదాం. మనకు మంచి రోజులు వచ్చాయి’ అని అంది.
వెంటనే పక్కన ఉన్న నక్క ‘మహారాజా! మహారాజా! మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.. ఏమి ఆ కలవరింత.. ఎవరికి మంచిరోజులు వచ్చాయో చెప్పండి’ అని అంది. అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్న సింహం ‘అయ్యో ఇది కలా! ఎంత మంచి కల. ఇది నిజమైతే ఎంత బాగుండు’ అని నక్కతో అంది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని