చిట్టి.. చిలుకమ్మా..!

అప్పుడే నిద్ర లేచిన చిట్టి అనే పిల్లి.. కళ్లు నులుముకుంది. చుట్టూ చూసింది. చీకటి పోయి వెలుగు వచ్చేసిందనుకుంది. ఆకలి వేయడంతో తన అలవాటులో భాగంగానే పేదరాశి పెద్దమ్మ ఇంటికి పాలు తాగడం కోసం బయలు దేరింది.

Published : 25 Oct 2021 00:31 IST

ప్పుడే నిద్ర లేచిన చిట్టి అనే పిల్లి.. కళ్లు నులుముకుంది. చుట్టూ చూసింది. చీకటి పోయి వెలుగు వచ్చేసిందనుకుంది. ఆకలి వేయడంతో తన అలవాటులో భాగంగానే పేదరాశి పెద్దమ్మ ఇంటికి పాలు తాగడం కోసం బయలు దేరింది. అలా ముందుకు వెళుతూ ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ఒక్కసారిగా ఆగింది. ‘చాలా రోజులుగా పెద్దమ్మ ఇంటికి వెళుతున్నాను. ఆ దారంతా నాకు బాగా అలవాటైపోయింది. ఈ రోజు సరదాగా కళ్లు మూసుకుని వెళితే బాగుంటుంది కదా!’ అని మనసులో అనుకుంది. అనుకుందే తడవుగా కళ్లు మూసుకుని ముందుకు నడిచింది.

అంతా చీకటిగా అనిపించింది. ముందు భయం వేసింది. కానీ అంతలోనే ‘భయపడితే సరదా తీరదుగా’ అని అనుకుని, కళ్లు మూసుకునే ముందుకు నడుస్తూ వెళుతోంది. కానీ రోజూ ఆ దారిలో కనిపించే ఉడుతను చిట్టి పలకరించక పోవడంతో, ఉడుత ఆశ్చర్య పోతూ.. ‘చిట్టీ! నాకు శుభోదయం చెప్పలేదే?’ అని అడిగింది. అప్పుడు చిట్టి ‘ఈ రోజు సరదాగా కళ్లు మూసుకుని నడుస్తున్నాను. అందుకే నిన్ను చూడలేక పోయాను. ఏమీ అనుకోకు’ అని కళ్లు మూసుకునే ఉడుతతో అంది. ‘జాగ్రత్తగా వెళ్లు. పడిపోగలవు!’ అని జాగ్రత్త చెప్పింది ఉడుత.

‘ఫర్వాలేదు మిత్రమా!’ అంటూ ముందుకు నడిచింది చిట్టి. మరికొంత దూరం వెళ్లాక  ‘చిట్టీ! రోజూ నాకు శుభోదయం చెబుతావు కదా! ఈ రోజు చెప్పలేదే?’ అని చెట్టు మీద ఉన్న కోతి కిందకు దిగుతూ అడిగింది. అప్పుడు చిట్టి.. ఉడుతకు చెప్పినట్టే కోతికీ చెప్పింది. ‘అవునా! కళ్లు మూసుకుని నడిస్తే పడిపోతావు కదా!’ అని కోతి ఆశ్చర్యపోతూ అడిగింది. ‘మరికొంత దూరం నడిచానంటే పెద్దమ్మ ఇల్లు వచ్చేస్తుంది. పెద్దమ్మ నన్ను చూడగానే ఆప్యాయంగా గిన్నెలో పాలు పోసి తాగమంటుంది. గబగబా తాగేసి నా ఆకలి తీర్చేసుకుంటాను!’ అని చెప్పింది చిట్టి. ‘అది సరే! కళ్లు మూసుకుని ఉంటావు కదా! మరి పెద్దమ్మ ఇంటిని ఎలా గుర్తు పడతావ్‌’ అని అడిగింది కోతి. ‘‘అక్కడ నా కంటే ముందుగానే నా మిత్రుడు రామచిలుక ఉంటుంది. నన్ను చూడగానే ‘చిట్టీ’ అని అభిమానంగా పిలుస్తుంది. చిలుక పిలుపు విని పెద్దమ్మ ఇంటికి ఎంచక్కా వెళ్లి పోతాను!’’ అని ధీమాగా చెప్పింది చిట్టి. ‘సరే! జాగ్రత్తగా వెళ్లు’ అని చెప్పింది కోతి. అలాగేనంటూ చిట్టి ముందుకు కదిలింది.

‘ఉడుతకు పది అడుగుల దూరంలో కోతి ఉంటుంది. కోతికి సరిగ్గా పది అడుగుల దూరంలో పెద్దమ్మ ఇల్లు ఉంటుంది. ఇంకెంత.. పది అడుగులు కళ్లు మూసుకుని నడిస్తే రామచిలుక పిలుపుతో పెద్దమ్మ ఇంటికి సులువుగా చేరుకోవచ్చు’ అనుకుంటూ అడుగులు లెక్క పెట్టుకుంటూ ముందుకు కదిలింది చిట్టి. అలా పది అడుగులు వేసిందో లేదో ‘చిట్టీ’ అంటూ చిలుక పిలుపు వినిపించింది. ‘హమ్మయ్య! పెద్దమ్మ ఇంటికి కళ్లు మూసుకుని నడుచుకుంటూ వచ్చేశాను. విజయం సాధించాను’ అని మనసులో అనుకుని ఆనందంతో గంతులు వేసింది చిట్టి. చిలుకకు దగ్గరగా వచ్చి కళ్లు తెరిచింది. కానీ ఆ ఇల్లు పెద్దమ్మ పక్కింటి వాళ్లదని గ్రహించి అయ్యో అనుకుంటూ.. ‘ఈ రోజు పెద్దమ్మ పక్కింటి గోడ మీద ఉన్నావే? నీ వల్ల నేను ఓడిపోయాను తెలుసా.. ఎందుకిలా చేశావ్‌?’ అని దిగులుగా చిలుకను అడిగింది చిట్టి.

అప్పుడు రామచిలుక నవ్వుతూ ‘చిట్టీ! నువ్వు కోతితో చెప్పిన మాటలు అక్కడ చెట్టు మీదే ఉన్న నేను విన్నాను. కావాలనే నీ కంటే ముందుగా వచ్చి నిన్ను ఓడించాలనే పెద్దమ్మ పక్కింటి గోడ మీద వాలాను!’ అని చెప్పింది. ‘నీ మిత్రుడు ఓడి పోవడం నీకిష్టమా?’ అంది చిట్టి. ‘బాధ పడకు చిట్టీ! అన్ని అవయవాల్లో కళ్లు ప్రధానమైనవి. కళ్లు లేనివారికి మన కళ్లు దారి దీపాలుగా ఉపయోగపడాలి. అంతేగానీ కళ్లుండి కూడా మూసుకుని నడిస్తే అది మనకే ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు నువ్వు గెలిస్తే.. ‘కళ్లు మూసుకుని నడవడం నీకు అలవాటై పోయింది అనుకుంటావు. అది నీకే మంచిది కాదు. ఏ కుక్కైనా నీ మీద దాడి చేస్తే.. అందుకే నిన్ను ఓడేలా చేశాను. తప్పా!’ అని అడిగింది చిలుక.

చిలుక మాటలతో చిట్టి తన తప్పు తెలుసుకుంది. ‘నా కళ్లు తెరిపించావు. ఇంకెప్పుడూ సరదా కోసమంటూ ఇలా చేయను!’ అని చిట్టి బుద్ధిగా అంది. ‘సంతోషం! నడిచి, నడిచి అలిసిపోయావు. పెద్దమ్మ ఇంటికి వెళదామా?’ అని అడిగింది చిలుక. అలాగే మిత్రమా! ఆకలి వేస్తోంది. పాలు తాగాలి! అనుకుంటూ కళ్లు మూసుకోకుండానే పెద్దమ్మ ఇంటికి చిలుకతో వెళ్లింది చిట్టి.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని