పెంకితనం వదిలిన టింకూ!

టింకు ప్రతీ విషయంలోనూ మొండిగా పేచీ పెట్టి, తాను అనుకున్నది సాధిస్తుంటాడు. దాంతో అతడి ప్రవర్తన చూసి వాళ్ల అమ్మ సుధ, నాన్న తేజకు దిగులు పట్టుకుంది. వారిద్దరూ ఎంతో ఓపికగా టింకును దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లలు క్రమశిక్షణగా ఉండటం గురించి, పెద్దలతో ఎలా వినయంగా ఉండాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు.

Updated : 01 Aug 2023 05:19 IST

టింకు ప్రతీ విషయంలోనూ మొండిగా పేచీ పెట్టి, తాను అనుకున్నది సాధిస్తుంటాడు. దాంతో అతడి ప్రవర్తన చూసి వాళ్ల అమ్మ సుధ, నాన్న తేజకు దిగులు పట్టుకుంది. వారిద్దరూ ఎంతో ఓపికగా టింకును దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లలు క్రమశిక్షణగా ఉండటం గురించి, పెద్దలతో ఎలా వినయంగా ఉండాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ టింకు వినడానికి అసలు ఇష్టపడడు.

‘టింకూ! నువ్వు త్వరగా నిద్రపోతే తొందరగా నిద్రలేవగలవు. అప్పుడు నీ పనులు త్వరగా ముగించుకుని బడికి సమయానికి వెళ్లగలుగుతావు’ అని ప్రతిరోజు రాత్రివేళ నిద్రపోయే ముందు బుజ్జగించి చెబుతుంది సుధ.

‘సరే అమ్మా! ఇంకా కొంచెం సేపు... ఇంకా కొంచెం సేపు’ అంటూ అమ్మ మాటలు లెక్క చేయకుండా టీవీలో పిల్లల వీడియోలు చూస్తూ సమయం గడిపేస్తాడు. ఉదయం ఎంతసేపు లేపినా లేవకుండా పడుకుంటాడు. ఆలస్యంగా లేవటం వల్ల ప్రతీ రోజు స్కూలుకు వెళ్లడానికి సమయం సరిపోక హడావిడి అవుతుంది. సుధకు టింకును బడికి పంపడం అంటే దాదాపు యుద్ధం చేసినంత పనవుతుంది. ఒకరోజు ఆలస్యమైందన్న కంగారులో స్కూల్‌ కారిడార్లో వేగంగా పరుగులాంటి నడకతో వెళ్తున్నాడు. ఇంతలో చూసుకోకుండా ఒక అబ్బాయిని గుద్దేశాడు. ఆ అబ్బాయి చేతిలో ఉన్న లంచ్‌ బ్యాగ్‌ ఎగిరి దూరంగా పడింది. బాక్స్‌ మూత తెరుచుకుని అందులో పదార్థాలు అక్కడ పడి చెల్లాచెదురయ్యాయి. ఆ అబ్బాయి భుజానికి తగిలించుకున్న బ్యాగుతో సహా గోడకు కొట్టుకున్నాడు. నుదురుకు దెబ్బ తగిలి కొంచెం రక్తం వచ్చింది.

అదంతా చూసిన టింకు భయపడిపోయాడు. అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా గబగబా తన తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. క్లాసులో కూర్చున్న టింకు మనసులో నుంచి ఆ దెబ్బ తగిలిన అబ్బాయి ముఖం, అతడి నుదుటి మీద రక్తం చెదిరిపోవడం లేదు. టీచర్‌ చెబుతున్న పాఠం అర్థం కావడం లేదు. పాఠం వినకుండా ఆలోచిస్తూ, అదోలా చూస్తున్నాడు.

‘ఏం జరిగింది టింకు? ఎందుకు అదోలా ఉన్నావు? భయపడకుండా చెప్పు’ అని దగ్గరకు వెళ్లి చిన్నగా అడిగారు టీచర్‌. ‘మరేమో.. నేను క్లాసుకు ఆలస్యం అవుతుందని పరుగెత్తుకుంటూ వస్తుంటే ఒక అబ్బాయి అడ్డంగా వచ్చాడు. నేను కంగారులో గుద్దేశాను. అతను గోడకు కొట్టుకోవడం వల్ల రక్తం వచ్చింది మేడం. భయం వేసి, నేను క్లాసులోకి వేగంగా వచ్చేశాను’ అన్నాడు టింకు.

‘టింకూ! కారిడార్‌లో నిదానంగా నడవాలని మీ అందరికీ చాలా సార్లు చెప్పాను కదా?! అయినా వేగంగా నడవడం మొదటి తప్పు. నీ వల్ల దెబ్బ తగిలిన అబ్బాయికి సహాయం చేయకుండా వచ్చేయడం రెండో తప్పు. క్షమాపణ కోరకపోవడం మూడో తప్పు. అన్నింటికన్నా పెద్ద తప్పు ఏమిటంటే నువ్వు ఆలస్యంగా బడికి రావడం. అవునా?’ అని నిదానంగా అన్నారు టీచర్‌.

‘అవును’ అన్నట్లు తల ఆడించాడు టింకు. ‘ఇన్ని తప్పులు చేసిన నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను. నాతో రా’ అంటూ టింకు చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్లారు టీచర్‌.

ఇద్దరూ వరసగా అన్ని తరగతి గదులు చూసుకుంటూ వెళ్లారు. ఒకటో తరగతి గదిలో నుదుటి మీద బ్యాండేజ్‌తో ఉన్న ఒక పిల్లాడిని చూపించి.. ‘ఈ అబ్బాయినే నేను గుద్దేశాను మేడం...’ బెదురుగా అన్నాడు టింకు. ‘మేడం! ఈ అబ్బాయి పేరు బబ్లూ. ఉదయం ఎవరో కింద పడేశారంట. కొద్దిగా నుదురు చిట్లి రక్తం వచ్చింది, వెంటనే ప్రథమ చికిత్స చేసి బ్యాండేజ్‌ వేశాను’ అని ఆ క్లాస్‌ టీచర్‌ చెప్పారు.

టింకు వైపు చూశారు టీచర్‌. ఆ చూపులకు అర్థం గ్రహించిన టింకు ‘బబ్లూ! నా వల్లే నీకు దెబ్బ తగిలింది. రక్తం వచ్చింది. నీ లంచ్‌ బాక్స్‌ పడిపోయింది. అయినా నీకు సహాయం చేయకుండా వెళ్లిపోయాను. సారీ బబ్లూ’ అన్నాడు టింకు.

‘సారీ ఎందుకు?... నువ్వు కావాలని చేయలేదు కదా..’ నవ్వుతూ అన్నాడు బబ్లూ. ‘అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్‌ అవుదాం. నా లంచ్‌ బాక్స్‌ ఇద్దరం కలిసి తిందాం. వస్తావా?’ అన్నాడు టింకు. బబ్లూ ఆనందంగా ఒప్పుకొన్నాడు. టింకు మనసులో దిగులంతా మాయమైపోయింది.

‘టీచర్‌! ఇక నుంచి నేను తొందరగా పడుకుంటాను, తొందరగా లేస్తాను. అమ్మను విసిగించకుండా చెప్పిన మాట వింటాను. బబ్లూ నా కంటే చిన్నవాడు. కానీ, నా వల్ల దెబ్బ తగిలినా నాపై కోపంగా లేడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నేను అది నేర్చుకుంటాను’ అన్నాడు టింకు.

టీచర్‌ ఆనందంగా టింకును అభినందించారు. సాయంత్రం ఇంటికి వెళ్లాక జరిగిందంతా టింకు వాళ్ల అమ్మనాన్నలకు చెప్పాడు. అతడి మాటల్లోని మార్పు గమనించిన వాళ్లు ఆనందపడ్డారు.

‘చేసిన తప్పులకు క్షమాపణ చెప్పడం అలవాటు చేసుకుంటే స్నేహభావం పెరుగుతుంది టింకూ! అలాగే క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే సమయం విలువ తెలుస్తుంది. సమయపాలన తెలిస్తే విజయం లభిస్తుంది’ అంది సుధ.

‘ఇక నుంచి నువ్వు చెప్పిన మంచి విషయాలు అన్నీ వింటానమ్మా!..’ వినయంగా అన్నాడు టింకు. కొడుకులోని పెంకితనం దూరమవడంతో అమ్మ మురిసిపోయింది.

కేవీ. సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని