దేశమంటే మట్టికాదోయ్‌!

ఆ రోజు తెలుగు టీచర్‌... ‘పిల్లలూ! స్వాతంత్య్ర దినోత్సవం వస్తోంది కదా! వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహిస్తున్నాం.

Published : 03 Aug 2023 00:12 IST

ఆ రోజు తెలుగు టీచర్‌... ‘పిల్లలూ! స్వాతంత్య్ర దినోత్సవం వస్తోంది కదా! వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహిస్తున్నాం. మీ ఆసక్తిని బట్టి ఎవరు ఎందులో పాల్గొంటారో, క్లాస్‌ లీడర్‌ తేజకు పేర్లు ఇవ్వండి’ అని పిల్లలకు చెప్పారు. ‘తేజా.. రేపటిలోగా పేర్ల జాబితా తయారు చేసి నాకు ఇవ్వాలి’ అన్నారు టీచర్‌.
‘ఓ.. అలాగే టీచర్‌ తప్పకుండా’ అన్నాడు తేజ. ఆ తర్వాత టీచర్‌ ‘దేశ భక్తులు’ పాఠం చెప్పడం మొదలుపెట్టారు. పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు. వాళ్లకు పాఠం చాలా బాగా నచ్చింది కూడా. ఇంతలో బెల్‌ కొట్టారు.
టీచర్‌ పాఠం ఆపేసి... ‘మిగతాది రేపు చెప్పుకుందాం’ అని వెళ్లిపోయారు. అయినా... తేజలో మాత్రం ఎన్నో ఆలోచనలు. ‘ఆనాడు ఎంతో మంది మహనీయులు చేసిన పోరాటం, త్యాగాల ఫలమే నేటి మన స్వాతంత్య్రం. కానీ దేశభక్తితో ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? కొంతమంది మాత్రమే సైన్యంలో ఉన్నారు. మిగతావారు దేశసేవ ఏం చేస్తున్నట్లు? అసలు దేశసేవ అంటే దేశం కోసం పోరాడడమేనా? మరి పిల్లలు దేశం కోసం ఏం చేయాలి?’ అని ఆలోచించసాగాడు. ఇంతలో సైన్స్‌ టీచర్‌ రావడంతో తేజ ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి.
బడి ముగిసి, తేజ ఇంటికి వెళ్లేసరికి బాబాయి పుస్తకం చదువుతూ కనిపించాడు. పక్కనే టేబుల్‌ మీద భారత జాతీయ జెండా. దాన్ని చూడగానే తేజకు టీచర్‌ చెప్పిన పాఠం, తన ఆలోచన గుర్తుకు వచ్చాయి. ‘బాబాయ్‌! నాకు ఒక సందేహం వచ్చింది. అది మీరే తీర్చాలి’ అన్నాడు. ‘ముందు కాళ్లు, చేతులు కడుక్కుని, స్కూల్‌ డ్రెస్‌ మార్చుకురా. అప్పుడు ఎన్ని సందేహాలైనా అడుగు.. తీరుస్తా’ అని నవ్వుతూ అన్నాడు బాబాయ్‌.
‘అలాగే బాబాయ్‌’ అంటూ లోపలికి పరిగెత్తిన తేజ అయిదు నిమిషాల్లో బాబాయ్‌ దగ్గరకు చేరాడు. ‘వచ్చావా! ఇప్పుడు అడుగు నీ సందేహం ఏంటో?’ అన్నాడు బాబాయ్‌ చిరునవ్వుతో. ‘ఈ రోజు మా టీచర్‌.. దేశభక్తులు అనే పాఠం చెప్పారు. అది విన్నాక నాకు ఏమనిపించిందంటే, వాళ్లందరి కృషి వల్ల మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఇప్పుడు మన దేశాన్ని, శత్రు దేశాల దాడుల నుంచి రక్షించేందుకు సైన్యం ఉంది. మరి మిగతా వాళ్లు దేశసేవ ఏం చేస్తున్నట్లు? అసలు దేశం కోసం పోరాడడం మాత్రమే కాకుండా దేశ సేవకు ఇంకేం చేయాలి? అందులోనూ పిల్లలు దేశం కోసం ఏం చేయాలి?’ అంటూ తన అనుమానాలన్నీ అడిగాడు.
‘‘తేజా! చాలా మంచి ప్రశ్న అడిగావు. దేశసేవ అంటే కేవలం శత్రువుల నుంచి దేశాన్ని రక్షించుకోవడం మాత్రమే కాదు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేందుకు ‘అందరి కోసం ఒక్కరు.. ఒక్కరి కోసం అందరూ..’ అన్నట్లు కృషి చేయాలి. దేశమంటే కేవలం భౌగోళిక స్వరూపం కాదు.. అందులో నివసించే సకల జనులు. అందుకే ఓ మహాకవి.. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అన్నాడు. పిల్లలు చిన్నప్పటి నుంచే సత్ప్రవర్తనతో, పరోపకార గుణంతో మంచి పౌరులుగా ఎదగాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదా.. అందరితో సమభావంతో ప్రేమ, దయ కలిగి ఉండి.. మానవత్వంతో ప్రవర్తించాలి. నీతి, నిజాయతీ, అంకితభావంతో తమ కర్తవ్యాన్ని నెరవేర్చేవారుగా మెలగాలి. అదే మీరు చేసే దేశ సేవ. అర్థమైందా?’’ అన్నాడు బాబాయ్‌. ‘ఓ.. బాగా అర్థమైంది బాబాయ్‌..’ అంటూ సమాధానమిచ్చాడు తేజ.
కొన్ని రోజుల తర్వాత స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీ కోసం... ‘బాలలు- దేశసేవ’ అనే అంశం ఇచ్చారు. తేజ తన బాబాయ్‌ చెప్పిందంతా గుర్తు తెచ్చుకుని వ్యాసం చక్కగా రాశాడు. తేజకు అందులో ప్రథమ బహుమతి వచ్చింది. బడిలో అంతా ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాదు, స్కూల్‌ మేగజైన్‌లో కూడా తేజ వ్యాసం ప్రచురితమైంది. తేజ ఇప్పుడు బాలలందరికీ ఒక ఆదర్శ బాలుడిగా నిలిచాడు.  

జె.శ్యామల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని