ఏం పేరు పెట్టాలబ్బా?

మృగరాజు తన బిడ్డకు పేరు పెట్టాలని అనుకుంది. విషయం కోతికి చెప్పింది. రాజు సూచన మేరకు.. ‘అడవిలో నివసిస్తున్న జీవులేవైనా సింహం బిడ్డకు మంచి పేరు సూచిస్తే, వాటికి బహుమతి ఉంటుంది.

Updated : 23 Sep 2023 06:29 IST

మృగరాజు తన బిడ్డకు పేరు పెట్టాలని అనుకుంది. విషయం కోతికి చెప్పింది. రాజు సూచన మేరకు.. ‘అడవిలో నివసిస్తున్న జీవులేవైనా సింహం బిడ్డకు మంచి పేరు సూచిస్తే, వాటికి బహుమతి ఉంటుంది. పేరు పెట్టండి.. బహుమతి సంపాదించండి’ అని దండోరా వేయించిందా కోతి. ‘సింహం బిడ్డకు ఏం పేరు పెడితే బాగుంటుందా?’ అని ఏనుగు ఆలోచనలో పడింది. కానీ, ఎంతకూ తట్టలేదు. ఇక దాని వల్ల కాదనుకొని, చుక్కల లేడి వద్దకు వెళ్లింది. అప్పటికే నక్క, తోడేలు, ఎలుగుబంటి, చిలుక, పావురం తదితర జీవులన్నీ అక్కడికి చేరుకున్నాయి.
వాటిని చూసి ఆశ్చర్యపోయిన ఏనుగు.. ‘ఎప్పుడూ లేనిది.. అంతా ఒక్కటిగా బాగానే వచ్చారే..!!’ అంది. ‘సరే.. సింహం బిడ్డకు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించండి’ అని నవ్వుతూ అంది లేడి. ‘పేరు తడితే ఇక్కడికెందుకు రావడం.. నేరుగా మృగరాజు దగ్గరకే వెళ్లి చెప్పేయమా.. బహుమతి పట్టేయమా?’ అంది నక్క. ‘నువ్వసలే జిత్తులమారివి. మా ఆలోచన కూడా నీదేనని చెప్పేయగలవు’ అంటూ చమత్కరించింది తోడేలు. ‘భలేగా చెప్పావు తోడేలు మామా.. నక్క అంత పనీ చేయగలదు’ అని దానికి వంత పాడింది చిలుక. ‘ఆవేశాలకు పోతే గొడవలు వస్తాయి. అదే ఆలోచనలను పంచుకుంటే ఆవిష్కరణలు సాకారమవుతాయి. పేరు ఎవరు సూచించినా, అది అందరి ఆలోచనగా చెబుదాం. బహుమతిని సమానంగా పంచుకుందాం. ఏమంటారు?’ అని అన్నింటివైపు చూస్తూ అడిగిందా చుక్కల లేడి. దాని అభిప్రాయంతో మిగతా జీవులన్నీ ఏకీభవించాయి.

అవన్నీ కలిసికట్టుగా పేరు ఆలోచించడం మొదలు పెట్టాయి. కొంతసేపు గడచిన తర్వాత.. ‘‘సింహం బిడ్డ చిన్నగా ఉంది కాబట్టి ‘చిన్నా’ అనే పేరు బాగుంటుంది’’ అంది చిలుక. ‘‘బాగుంది కానీ, అది ఈరోజు చిన్నదే కావచ్చు. కొన్నాళ్లకు పెద్దదవుతుంది కదా.. అప్పుడు ‘పెద్ద’ అని పేరు మారుద్దామా.!’’ అని వ్యంగ్యంగా అంది తోడేలు. ‘అయితే చిన్నా పేరు వద్దులే..’ అంటూ చిన్నబుచ్చుకుంది చిలుక. ‘‘మృగరాజు బిడ్డ కాబట్టి ‘యువరాజు’ అనే పేరు పెడితే బాగుంటుందేమో..’’ అంది తోడేలు. ‘యువరాజు అనేది పేరు కాదు.. పదవి’ అని నవ్వుతూ చెప్పింది చిలుక. నిజమేనంది తోడేలు.

‘ఆ.. సింహం బిడ్డకు సరైన పేరు దొరికింది’ అని చుక్కల లేడి గట్టిగా అరిచింది. వెంటనే ‘ఏమిటో అది?’ ఆసక్తిగా అడిగింది నక్క. ‘నేరుగా మృగరాజుకే చెబుతాను కానీ, ఆలోచన మాత్రం అందరిదనే అంటాను. అప్పుడు బహుమతిని సమంగా పంచుకుందాం.. సరేనా?’ అని అడిగిందది. ‘అలాగే కానివ్వు..’ అంది ఏనుగు. అప్పుడే మృగరాజు తన బిడ్డతో కలిసి అక్కడకు రావడంతో జంతువులు, పక్షులూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ‘మృగరాజా.. మీ బిడ్డకు ఒక పేరు ఆలోచించాం. అది మీకూ నచ్చితే పెట్టేయొచ్చు. మేమే మీ వద్దకు రావాలనుకుంటున్నాం. ఇంతలో మీరే ఇటొచ్చారు’ అంది లేడి.

అక్కడే అందరి మధ్యలో ఉన్న రాతి బండ మీద కూర్చుంది మృగరాజు. పేరు చెప్పమంటూ.. లేడి వైపు చూసింది. ‘కేసరి.. అని పెడితే బాగుంటుంది. ఇది మా అందరి అభిప్రాయం’ అని వివరించిందది. ఆ పేరు భలేగా ఉందంటూ అక్కడి జీవులన్నీ సంతోషంతో చప్పట్లు కొట్టాయి. అందుకు బదులుగా మృగరాజు.. ‘‘కేసరి.. అనే పేరు చాలా బాగుంది. అయితే ‘చిన్నా’, ‘యువరాజు’.. ఇలా ఏ పేరుతో పిలిచినా నా బిడ్డ పలుకుతుంది’’ అంది. ‘మేమనుకున్న పేర్లు మీకెలా తెలుసు ప్రభూ?’ అని ఆశ్చర్యంతో అడిగింది ఏనుగు. అప్పుడు మృగరాజు నవ్వుతూ.. ‘నేను ముందు నుంచీ ఇక్కడే ఉన్నాను. మీకు కనిపించకుండా మీ మాటలన్నీ విన్నాను’ అంది. ‘ఎందుకని మృగరాజా?’ కుతూహలంగా అడిగింది నక్క.

అందుకు సింహం.. ‘రోజూ నిద్రలేవడం, ఆహారం కోసం తిరగడం, కడుపు నిండాక నిద్రపోవడం.. చాలా రోజులుగా ఇదే మన దినచర్యగా మారిపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం దాదాపు మరిచిపోయాం. కష్టసుఖాలను పంచుకొనే అవకాశమే లేకుండా పోయింది. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే హాయిగా జీవించగలం. విడివిడిగా ఉంటే శత్రువుల దృష్టిలో పడతాం. చుక్కల లేడి సలహా మేరకు, కోతితో దండోరా వేయించాను. నా బిడ్డకు పేరును ఆలోచించే క్రమంలో మీరందరూ ఒకచోటికి చేరారు. అడవికి సందడి తీసుకొచ్చారు. ఒక్కరి నిర్ణయం అందరిదని చెప్పడం ఇంకా బాగుంది. ఇదే నేను మీకిచ్చే బహుమతి. వారానికొకసారైనా అందరం ఇలా కలుసుకుందాం. ఆనందాలను పంచుకుందాం. ఏమంటారు?’ అంటూ అన్నింటి వైపూ చూసింది సింహం. ‘ప్రభూ.. మీ మాటే.. మా బాట’ అని నినదించాయవి. అప్పుడే సింహం బిడ్డ పకపకా నవ్వింది. ‘కేసరి నవ్వింది..’ అని కోతి అనడంతో మృగరాజుతోసహా అన్ని జీవులూ సంబరపడ్డాయి.  

 కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని