మార్కెట్‌లో వారాంతపు హుషారు

నగరంలోని రణగొణధ్వనులు, కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో సేద తీరాలి.. వారాంతంలో కుటుంబంతో సరదాగా గడపాలి.. పిల్లలను ప్రకృతికి దగ్గర చేయాలి.. ఇందుకోసం ఇదివరకు విహారయాత్రలకు వెళ్లేవారు.. కొవిడ్‌ అనంతరం ఆలోచనలు మారిపోయాయి. వైరస్‌ భయంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో సొంతంగా వారాంతపు ఇళ్ల కొనుగోలువైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. సెలవులు వస్తే అక్కడ వాలిపోవడమే కాదు కుదిరితే కొన్నాళ్లపాటూ అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Published : 03 Apr 2021 02:22 IST

నగరం చుట్టుపక్కల వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోలు
గోవా, ఊటీ, కొడైకెనాల్‌ వైపు పెట్టుబడిదారుల చూపు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలోని రణగొణధ్వనులు, కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో సేద తీరాలి.. వారాంతంలో కుటుంబంతో సరదాగా గడపాలి.. పిల్లలను ప్రకృతికి దగ్గర చేయాలి.. ఇందుకోసం ఇదివరకు విహారయాత్రలకు వెళ్లేవారు.. కొవిడ్‌ అనంతరం ఆలోచనలు మారిపోయాయి. వైరస్‌ భయంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో సొంతంగా వారాంతపు ఇళ్ల కొనుగోలువైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. సెలవులు వస్తే అక్కడ వాలిపోవడమే కాదు కుదిరితే కొన్నాళ్లపాటూ అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం నగరం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వేసవి విడుదులైన ఊటీ, కొడైకెనాల్‌, ఇటీవల గోవాలోనూ మనవాళ్లు వారాంతపు ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
గోవా పర్యాటకుల స్వర్గథామం. సెలవులు వస్తే చాలు హైదరాబాద్‌ నుంచి ప్రతివారం పెద్ద సంఖ్యలో అక్కడ వాలిపోతుంటారు. సరదాగా కొన్నిరోజులు గడిపి వస్తుంటారు. ఇన్నాళ్లు పర్యాటక కేంద్రంగానే చూసినా కొవిడ్‌ అనంతరం గోవాను చాలామంది స్థిరాస్తి పెట్టుబడులకు అనువైనదిగా భావిస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడి ప్రాజెక్టుల్లో పదిశాతం బుకింగ్స్‌ హైదరాబాద్‌ నుంచి ఉంటున్నాయని గోవా బిల్డర్లు అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో సొంతిల్లు, ఇతర స్థిరాస్తులు ఉన్నవారు కొత్త ప్రదేశాల్లో పెట్టుబడులు అనగానే గోవా ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా కన్పిస్తోంది. విల్లాలు, బంగ్లాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే బహళ అంతస్తుల అపార్ట్‌మెంట్ల నిర్మాణం పెరిగింది. విమానాశ్రయంలో దిగగానే రూ.40 లక్షల ధరల్లోనే ఫ్లాట్‌ అంటూ ప్రకటనలు ఎక్కువమంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గోవాలో ఒకసారి గడిపిన వారు తరచూ వెళ్లడానికి ఇష్టపడతారు. హైదరాబాద్‌ నుంచి ప్రతినెలా వెళ్లేవారు ఎందరో ఉన్నారు. వీరిలో కొందరు వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. స్టూడియో అపార్ట్‌మెంట్లు మొదలు విల్లాల వరకు రూ.40 లక్షల నుంచి రూ.4కోట్ల వరకు ఇక్కడ ధరలు ఉన్నాయి.

* ఇటీవల మనవాళ్లు ఎక్కువగా వీకెండ్‌ హోమ్స్‌, స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్న ప్రాంతాల్లో ఊటీ, కొడైకెనాల్‌ సైతం ఉన్నాయి. ఒకప్పుడు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఇక్కడే వేసవిలో విడిది చేసేవారు. విశాలమైన బంగ్లాలు ఉండేవి. ఆ తర్వాత ఎక్కువగా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపలేదు. కొవిడ్‌ తర్వాత మనవాళ్లు ఊటీ, కొడైకెనాల్‌ వైపు చూస్తున్నారు. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు వారి పిల్లల కోసం ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేశారని స్థిరాస్తి వర్గాలు తెలిపాయి. ఇక్కడ ధరలు కాస్త ఎక్కువే. అందుకే ఎక్కువగా సంపన్నులు మొగ్గు చూపుతున్నారు.
* హైదరాబాద్‌ చుట్టుపక్కల వికారాబాద్‌, నవాబ్‌పేట, శంకర్‌పల్లి, మేడ్చల్‌, శామీర్‌పేట, తూఫ్రాన్‌, యాదగిరిగుట్ట, షాద్‌నగర్‌, భూత్పూరుతో పాటు 50 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కువగా వీకెండ్‌హోమ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు వీటి ధరలు చెబుతున్నారు. ఒక్కో ప్రాజెక్టు ఒక్కో థీమ్‌తో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ పల్లె ఆటల థీమ్‌తో ఒక ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తే హాట్‌కేకుల్లా వీకెండ్‌హోమ్స్‌ అమ్ముడయ్యాయి. గోల్ఫ్‌ కోర్టుల థీమ్‌తో వచ్చిన మరో ప్రాజెక్టు స్వల్ప వ్యవధిలో యాభై శాతం బుకింగ్స్‌ను పూర్తిచేసింది.

సౌకర్యాలే ఆకర్షణ..

వారాంతపు ఇళ్లలో తక్కువ విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది. ఎక్కువగా ఖాళీ ప్రదేశం, చుట్టూ పచ్చని చెట్లు, గార్డెనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి నివాసంలో ఈతకొలను ఉంటుంది.  క్లబ్‌హౌస్‌, గోల్ఫ్‌కోర్టులు,  జాగింగ్‌ ట్రాక్‌లు, ఇండోర్‌ ఆటలు అందుబాటులో ఉంటాయి. ఇళ్లే కాదు ఇలాంటి చోట ప్లాట్లు విక్రయిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అనేది మరికొందరి ఆలోచన.

ఇలాగే ఎందుకు..

* ప్రముఖులు ఏటా విదేశాల్లో విహారానికి రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసేవారు. ఇంట్లో పుట్టినరోజు, ఇతర వేడుకలకు భారీగా ఖర్చు అయ్యేది. ఈ వ్యయం తగ్గడం.. కొవిడ్‌తో విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వీకెండ్‌ హోమ్స్‌పై పెట్టుబడి పెడుతున్నారు.
* ఉన్నత స్థాయుల్లోని ఉద్యోగులు చాలామంది ప్రస్తుతం వర్చువల్‌గా పనిచేస్తున్నారు. ఏడాదిగా ఇంటి నుంచే విధుల్లో ఉండడంతో రవాణా వ్యయం గణనీయంగా తగ్గింది. ఇక్కడ ఆదా అవుతున్న సొమ్ముతో కొందరు వీటిల్లో మదుపు చేస్తున్నారని ఒక బిల్డరు చెప్పారు. విదేశీ యాత్రల బుకింగ్స్‌ బంద్‌ కావడంతో పలు ట్రావెల్‌ ఏజెన్సీలు నగరం నుంచి ఊటీ, కొడైకెనాల్‌, గోవా లాంటి చోట్లకు ఇన్వెస్టర్లను తీసుకెళుతున్నారని తెలిపారు. విమానంలో వెళ్లి స్థిరాస్తులను చూసి వస్తున్నారని చెప్పారు.  
* ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఆశాజనకంగా లేకపోవడం, గృహరుణ వడ్డీరేట్లు అత్యల్పంగా ఉండటంతో వీకెండ్స్‌ హోమ్స్‌ వైపు చూస్తున్నారు.

ఆదాయం వస్తుండటంతో..

వీకెండ్‌ హోమ్స్‌ కొనడం ఒక ఎత్తైతే నిర్వహణ మరో ఎత్తు. కాపలాదారుకు జీతభత్యాలు, ఇంటి నిర్వహణకు భారీగా వ్యయం అయ్యేది. ఇప్పుడు ఇలాంటి ఇళ్లను నిర్వహించే సంస్థలు చాలా వచ్చాయి. వాటికి లీజుకిస్తున్నారు. యజమాని లేని రోజుల్లో ఆ ఇంటిని ఇతరులకు అద్దెకిస్తారు. గోవా లాంటిచోట్ల నెలకు రూ.పాతికవేల వరకు ఆదాయం పొందుతున్నారు వీటి యజమానులు.

ఇప్పుడే మొదలైంది..

- ఇంద్రసేన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

వారాంతపు ఇళ్ల సంస్కృతి బెంగళూరులో పది ఏళ్ల క్రితం నుంచే ఉంది. మన దగ్గర ఇప్పుడే మొదలైంది. కొవిడ్‌ తర్వాత బాగా పెరిగింది. ప్రస్తుతం పొలాలు, వారాంతపు ఇళ్లపైన ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఒక ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పుడు పది మంది సందర్శిస్తే ఒకరు కొనుగోలు చేస్తుంటారు. వారాంతపు ఇళ్ల ప్రాజెక్టుల్లో ఇద్దరు సందర్శిస్తే ఒక్కరు కొనుగోలు చేస్తున్నారంటే వీటికున్న డిమాండ్‌ అలాంటిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు