వర్చువల్‌ బాటలో...

ఇల్లు, స్థలం.. స్థిరాస్తి ఏదైనా ఒకటికి నాలుగైదుసార్లు ప్రత్యక్షంగా చూస్తే కాని చాలామంది నిర్ణయాలు తీసుకోలేరు. ఉన్నట్టుండి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో చాలామంది

Updated : 29 Feb 2024 17:22 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇల్లు, స్థలం.. స్థిరాస్తి ఏదైనా ఒకటికి నాలుగైదుసార్లు ప్రత్యక్షంగా చూస్తే కాని చాలామంది నిర్ణయాలు తీసుకోలేరు. ఉన్నట్టుండి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో చాలామంది స్థిరాస్తి ప్రాజెక్ట్‌లను వర్చువల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో చూస్తున్నారు. కొన్ని బడా నిర్మాణరంగ సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకుని ‘వర్చువల్‌ టూర్లు’ ఏర్పాటు చేస్తున్నాయి. నిర్మాణం పూర్తైతే ఇంటి లోపల ఎలా ఉంటుంది? ఏ గది ఎక్కడ వస్తుంది? ప్రాజెక్ట్‌లో కల్పించే సదుపాయాలు.. ఇలా ప్రతిదీ ఉన్నచోటనే వర్చువల్‌ రియాల్టీతో పలు సంస్థలు కళ్లకు కడుతున్నాయి. ఇళ్లు కడుతున్న చోటే చూసిన అనుభూతి కలుగుతుంది. కొన్నేళ్లుగా ఈ సాంకేతికత ఉన్నా.. ఒకటి, రెండేళ్ల నుంచి స్థిరాస్తి సంస్థలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.

సవాళ్లను అధిగమించేందుకు...

నిర్మాణ రంగం కొవిడ్‌ అనంతరం డిజిటల్‌ బాట పట్టింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇన్నాళ్లూ పెద్దగా ఆసక్తి చూపకున్నా.. పోటీ నేపథ్యంలో సవాళ్లను అధిగమించేందుకు పలు సంస్థలు కొత్త పంథాలో వెళుతున్నాయి. నిర్మాణపరంగానే కాదు కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌ డిజైన్స్‌, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల ప్రస్తుత స్థితి, గతంలో పూర్తిచేసిన వాటి అల్బమ్స్‌, నిర్మాణంలో ఉపయోగించే లిఫ్ట్‌, కమోడ్స్‌ బ్రాండ్ల వరకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. కేవలం ఇందుకోసం ల్యాప్‌టాప్‌ మాత్రమే అవసరం. మరికొన్ని సంస్థలు  కార్యాలయం నుంచి గూగుల్‌ మీట్‌, జూమ్‌ వంటి వాటితో కొనుగోలుదారులతో సమావేశమవుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ దగ్గర్నుంచి, సేల్స్‌ మేనేజర్‌ వరకు అందరూ ఒకేసారి జూమ్‌లోకి వచ్చి కావాల్సిన సమాచారం ఇస్తున్నారు. కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయికి వెళ్లేవారు ఇబ్బందులు పడడం లేదా.. కొనేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వర్చువల్‌ పద్ధతిలో అన్ని అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. త్రీడీ పరిజ్ఞానంతో ప్రాజెక్ట్‌ను చూపిస్తుండటంతో కొనుగోలుదారులు నిర్మాణం పూర్తయ్యాక ఇల్లు ఎలా ఉండబోతుంది అనేది పూర్తి స్పష్టతతో నిర్ణయించుకునే అవకాశం ఉంది.

నిర్ణయం మనదే...

‘నిర్మాణరంగంలో సాంకేతికతతో చాలా మార్పులు వస్తున్నాయి. తొమ్మిది, పదినెలల నుంచి చాలా సంస్థలు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. విస్తృత ప్రచారం ద్వారా వినియోగదారులను చేరుకుంటున్నాయి. గూగుల్‌, జూమ్‌ మీటింగ్స్‌, వీఆర్‌లో ప్రజెంటేషన్లతో కొనుగోలుదారులకు ప్రాజెక్ట్‌ల గురించి వివరిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో చూసి నిర్ణయం తీసుకున్నా... ప్రాజెక్ట్‌ను ఒకటి, రెండుసార్లు చూశాకే కొనుగోలు చేస్తేనే మంచిది. బిల్డర్ల విషయానికి వస్తే.. ఇదివరకు నిర్మాణ సమయంలో కిటికీ అనుకున్న ప్రదేశంలో వస్తుందో లేదో, పైపులైన్లు అడ్డుపడతాయేమోననే సందేహాలు బిల్డర్లకు ఉండేవి. వీఆర్‌లో 360 డిగ్రీల కోణంలో ముందే చూసే అవకాశం ఉండటంతో డిజైన్‌ ప్రకారం నిర్మాణం ఉంటుంది.

అనుకూలతలు.. జాగ్రత్తలు

* సైట్‌ వివరాలు వెంటనే తెలుస్తాయి. న్యాయపరమైన చిక్కులు, వివాదాలు లేని స్థిరాస్తిని ఎంపిక చేసుకునేందుకు అవసరమైన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేవో తెలుసుకునే అవకాశాలున్నాయి.
* కొనేటప్పుడు నమ్మకమైన బిల్డర్లు,  మెరుగైన గత చరిత్ర కల్గిన సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లతోనే లావాదేవీలు కొనసాగించాలి. ఈ రంగంలో అక్కడక్కడా మోసాలు జరుగుతుండటంతో ఆన్‌లైన్‌లో కొన్నా, ఆఫ్‌లైన్‌లో కొంటున్నా ట్రాక్‌ రికార్డు పరిశీలించాలి.కొనుగోలుదారులను బురిడీ కొట్టించేందుకు పలు పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్నారు. అర్థం అయ్యేలోపే బోర్డు తిప్పేస్తున్నారు.
* కొనేముందు ఆయా ప్రాజెక్ట్‌లకు అనుమతులు సక్రమంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. అనుమతులు లేకుండా కూడా కొందరు విక్రయాలు చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకున్నారో లేదో వాకబు చేయాలి. నిబంధనల ప్రకారం వెంచర్లు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 7331185149 నంబరుకు సంక్షిప్త సందేశం పంపించి సమాచారం తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని