గృహ రుణం టాపప్‌ తీసుకుంటున్నారా?

ఐదేళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నారా? అప్పటితో పోలిస్తే ఇప్పుడు మీ ఇంటి విలువ, మీ నికర వేతనం రెండూ పెరిగి ఉంటాయి.

Updated : 08 Apr 2023 01:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐదేళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నారా? అప్పటితో పోలిస్తే ఇప్పుడు మీ ఇంటి విలువ, మీ నికర వేతనం రెండూ పెరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో మరోసారి రుణం ఇస్తామంటూ ఇటీవల బ్యాంకులు, గృహరుణ సంస్థలూ రుణగ్రహీతలను సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే మీరు తీసుకున్న రుణాన్ని ‘టాపప్‌’ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాయి. మరి, దీనిని అంగీకరించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దామా...

గృహరుణంపై వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 9 శాతానికి చేరుకున్నాయి. కొత్తగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు పోటీ పడుతూనే, ఇప్పటివరకూ క్రమశిక్షణతో వాయిదాలను చెల్లించే వారికి తిరిగి అప్పు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. గృహరుణానికి చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 ప్రకారం రూ.2లక్షల వరకూ, అసలుకు సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. టాపప్‌కి ఇలాంటి వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇంటిని విస్తరించడంలాంటి వాటికి వాడినప్పుడే మినహాయింపు వర్తిస్తుంది.  

* డబ్బు అవసరం ఉన్నప్పుడు వ్యక్తిగత రుణం, బంగారంపై అప్పులాంటివి కాకుండా గృహరుణ టాపప్‌ను ఎంచుకోవచ్చు. గృహరుణ వ్యవధిని బట్టి, టాపప్‌ రుణ కాల పరిమితి నిర్ణయిస్తారు.  మిగతా అప్పులకు ఇంత వ్యవధి ఉండదు.  

* ఒకేసారి డబ్బుతో అవసరం లేదు అనుకుంటే.. టాపప్‌ రుణంలోనే ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దీనికి గృహరుణంతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ ఉంటుంది. దీర్ఘకాలం వరకూ అవసరమైనప్పుడే డబ్బు తీసుకునే వీలుంటుంది. ఉపయోగించుకున్న మొత్తానికే వడ్డీ విధిస్తారు. కాబట్టి పెద్దగా భారం ఉండదు.

*  ఇప్పటికే రుణగ్రహీతకు సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు దగర ఉంటాయి. రుణగ్రహీత వాయిదాలన్నీ సరిగా చెల్లించిన వివరాలు, ఆదాయ ధ్రువీకరణ, ఇతర కొన్ని పత్రాలు అందిస్తే చాలు. టాపప్‌ రుణం ఎంతివ్వాలన్నది ఆదాయం, గృహరుణం మొత్తం, తనఖా పెట్టిన ఆస్తి మార్కెట్‌ విలువ తదితరాలను బట్టి ఆధారపడి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని