సగటు అడుగు ధర పదివేలు దాటింది

ప్రస్తుతం అందరూ పెద్ద ఇళ్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మూడు పడక గదులు.. బడ్జెట్‌ సహకరిస్తే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండేలా చూసుకుంటున్నారు.

Updated : 17 Jun 2023 08:52 IST

కార్పెట్‌ ఏరియాపైన అంటోన్న స్థిరాస్తి సంఘాలు
ఇతర నగరాల్లో దీనిపైనే విక్రయం
మన దగ్గర ఇప్పటికీ బిల్టప్‌ ఏరియాపైనే అమ్మకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం అందరూ పెద్ద ఇళ్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మూడు పడక గదులు.. బడ్జెట్‌ సహకరిస్తే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండేలా చూసుకుంటున్నారు. రెండువేల చదరపు అడుగుల (బిల్టప్‌) ఏరియాను కొంటున్నా... ఇంట్లో వచ్చే (కార్పెట్‌ ఏరియా) విస్తీర్ణం దాదాపు 1400 చదరపు అడుగుల వరకే ఉంటుంది. కమ్యూనిటీలో సౌకర్యాలు పెరిగేకొద్దీ ఇంట్లో విస్తీర్ణం తగ్గుతుంది. వాస్తవంగా మన ఇంట్లో ఉండే కార్పెట్‌ ఏరియా మీదనే దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా బిల్టప్‌ ఏరియా మీద విక్రయిస్తుంటారు. ఇక్కడ కూడా కార్పెట్‌ ఏరియానే లెక్కలోకి తీసుకుంటే సగటు చదరపు అడుగు పదివేల రూపాయలు దాటింది. క్రెడాయ్‌-కొలియర్స్‌ ఇండియా 2023 తొలి త్రైమాసిక నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కార్పెట్‌ ఏరియా సగటు చ.అ. ధర రూ.10,140 ఉందని పేర్కొన్నారు. ముంబయిలో చ.అ.రూ.19,219తో అత్యంత ఖరీదుగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. మిగతా నగరాల్లో కార్పెట్‌ ఏరియా ధరలు మన నగరం కంటే తక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో స్థిరాస్తి కన్సల్టెంట్ల గణాంకాల ప్రకారం 80 శాతం గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల పశ్చిమ నగరంలోనే కడుతున్నారు.  ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్‌, బాచుపల్లి, అమీన్‌పూర్‌ వరకు నిర్మాణాలు విస్తరించాయి. ఇక్కడ చదరపు అడుగు రూ.4వేల నుంచి రూ.9వేల వరకు చెబుతున్నారు. కార్పెట్‌ ఏరియా అయితే సగటు రూ.12వేల వరకు అవుతోంది. తూర్పు, ఉత్తర హైదరాబాద్‌ నగరంలో రూ.3వేల నుంచి రూ.6వేల మధ్యన చదరపు అడుగు ధరలు ఉన్నాయి. కార్పెట్‌ ఏరియా తీసుకుంటే సగటు రూ.8వేలు అవుతోంది. కాకపోతే ఇక్కడ వచ్చే నిర్మాణాల శాతం 20 శాతం లోపే ఉంటుంది. అందునా పేరున్న సంస్థల గణాంకాలనే స్థిరాస్తి కన్సల్టెంట్లు సేకరిస్తున్నారు. అప్పుడు సిటీ సగటు చూసినప్పుడు రూ.10వేలు దాటుతోంది. ఈ కారణంగానే ఇతర నగరాల కంటే ఎక్కువ కనబడుతోందని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. వాస్తవంగా దేశంలోని ఏ ఇతర నగరాలతో పోల్చినా మన దగ్గరే ధరలు ఇప్పటికీ తక్కువగా అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.

ఇప్పుడిప్పుడే

దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో సిటీకి అన్నివైపులా నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ముంబయి, చెన్నైలలో కొన్ని ప్రతికూలతలు ఉన్నా.. ఇక్కడ సైతం అన్ని ప్రాంతాల్లో బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. మన దగ్గర ఎక్కువ యూనిట్లు కట్టే ప్రాజెక్టులు ఐటీ కారిడార్‌లోనే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విస్తరించడం మొదలెట్టారు. హైదరాబాద్‌ దక్షిణం శంషాబాద్‌ వైపు నాలుగు పెద్ద సంస్థల ప్రాజెక్టులు వస్తున్నాయి. 48 అంతస్తుల టవర్లు ఇక్కడ రాబోతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ వేర్వేరు దశలో ఉన్నాయి. తూర్పు హైదరాబాద్‌లో ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ చుట్టుపక్కల ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్‌ బొల్లారం, కొంపల్లి దాటి అవుటర్‌ దిశగా నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన సోషల్‌ ఇన్‌ఫ్రా కారణంగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే సమతుల్యం లేదు. బెంగళూరులో ఐటీ కార్యాలయాలు అన్నివైపులా ఉన్నాయని.. మన దగ్గర ఒక వైపే ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అన్ని వైపులా అభివృద్ధి సమానంగా విస్తరిస్తే ఇంటి ధరల్లోనూ పెద్దగా వ్యత్యాసాలు ఉండవని అంటున్నారు. బెంగళూరులో అన్ని వైపులా ఐటీ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో గృహ నిర్మాణం ఒకచోట కాకుండా అన్నివైపులా విస్తరించింది. అందుకే అక్కడ కార్పెట్‌ ఏరియా చదరపు అడుగు సగటు ధర మనకంటే తక్కువగా రూ.8748గా ఉందని విశ్లేషించారు.


కార్పెట్‌ ఏరియాపైనే విక్రయించాలని రెరాలో లేదు
- జి.రాంరెడ్డి, జాతీయ కార్యదర్శి, క్రెడాయ్‌

రెరాలో కార్పెట్‌ ఏరియాను ప్రస్తావించాలని నిబంధన ఉంది తప్ప దానిపైనే విక్రయించాలని లేదు. అందుకే మన దగ్గర డాక్యుమెంట్లో వీటిని ప్రస్తావిస్తూ.. బిల్టప్‌ ఏరియాపైనే విక్రయిస్తున్నారు. ఇంట్లో బాల్కనీ, వాష్‌ ఏరియా, గోడలు, కారిడార్‌, మెట్ల స్థలం మినహాయించగా వచ్చేది కార్పెట్‌ ఏరియా. ప్రాజెక్ట్‌ను బట్టి సాధారణంగా బిల్టప్‌ ఏరియాలో 30 నుంచి 40 శాతం మినహాయించగా కార్పెట్‌ ఏరియా వస్తుంది. సగటు ధర రూ.10వేలు దాటడానికి ఐటీ కారిడార్‌ ఉన్న పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ నిర్మాణాలు ఉండటం.. వాటి డేటానే తీసుకోవడంతో మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఇతర నగరాల్లో అన్నివైపులా గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఉండటంతో ధర తక్కువగా కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని