నిర్మాణాలిక్కడ.. పనీ ఇక్కడే

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆకాశాన్ని తాకే నిర్మాణాలు చేపడుతున్నారు. 60 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టాలంటే నైపుణ్యమున్న కార్మికుల అవసరం. వీరి కొరత ఎక్కువగా ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  

Published : 01 Jul 2023 02:55 IST

స్థానిక కార్మికులకు నైపుణ్యాలు పెంపొందించేలా క్రెడాయ్‌ ప్రణాళిక

నిర్మాణ రంగంలో ఎక్కువమంది వలస కార్మికులే ఉన్నారు. బిహార్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, యూపీ వంటి ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడివాళ్లేమో దుబాయ్‌, ఇతర అరబ్‌ దేశాలకు వెళ్లి అక్కడ నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ సూచన మేరకు స్థానికులకు నైపుణ్యాలు పెంపొందించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రణాళికను క్రెడాయ్‌  తెలంగాణ రూపొందించింది.


ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆకాశాన్ని తాకే నిర్మాణాలు చేపడుతున్నారు. 60 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టాలంటే నైపుణ్యమున్న కార్మికుల అవసరం. వీరి కొరత ఎక్కువగా ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  ప్రధానంగా వలస కార్మికుల పైనే ఆధారపడుతున్నామని చెబుతున్నారు.


గుర్తించిన లోపాలు?  

  • ఇంజినీరింగ్‌ విద్యార్థులు అకడమిక్‌ పరంగా బాగున్నారు. ప్రాక్టికల్‌ పరిజ్ఞానంలో తగిన సామర్థ్యాలు లేవు.
  • పదో తరగతి లోపు చదువు మానేసిన వాళ్లు ఎంతోమంది నేరుగా పనిలో చేరుతున్నారు. సీనియర్‌ కార్మికుల వద్ద పని నేర్చుకుంటున్నారు. వీరికి నిర్మాణ రంగానికి సంబంధించి కనీస సాంకేతిక పరిజ్ఞానం ఉండటం లేదు.
  • ఇరువురికి నైపుణ్యాల అంతరం ఉందని నిర్మాణ సంఘాలు గుర్తించాయి.
  • ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలలతో పాటూ అర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లు, నిర్మాణ సంఘాలు, ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలన్నీ ఎవరికి వారు అన్నట్లుగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల మౌలిక వసతులు, ఆధ్యాపకుల్ని  ఉపయోగించుకుని పనివేళలు ముగిసిన తర్వాత వీరి సేవలను వినియోగించుకోవాలి. ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో అందర్నీ కలుపుకొని తగిన శిక్షణ అందేలా చూడాలి.
  • కార్మికులకు సంబంధించి ఏ గ్రేడ్‌ ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, టైల్‌ లేయర్‌, పెయింటర్‌, మాసన్‌, బార్‌బెండర్‌, కార్పెంటర్‌ నైపుణ్యాలను పెంపొందించేందుకు 180 రోజుల శిక్షణ అవసరమని తేల్చారు. 90 రోజులు తరగతి గదిలో..మరో 90 రోజులు సైట్‌లో సీనియర్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రత్యక్షంగా పనిచేస్తూ నేర్చుకునేలా శిక్షణ అవసరం.

    అవకాశాలు ఎలా ఉన్నాయి?

రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం నిర్మాణ రంగంలో ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. శిక్షణ పొందిన వారేమో లక్ష మంది మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిగతావాళ్లు పనిలో చేరాక నేర్చుకుంటున్నారు. ముందే శిక్షణతో పనిలో నాణ్యత పెరగడమే కాదు వేతనాలు అధికంగా పొందవచ్చు అని బిల్డర్లు చెబుతున్నారు.


ప్రభుత్వానికి ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నాం


నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్థానిక కార్మికులకు నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. క్రెడాయ్‌ ఛాప్టర్ల తరఫున ఆసక్తి కలిన కార్మికులను గ్రామీణ స్థాయి నుంచి ఎంపిక చేయడం... ఆన్‌సైట్‌ శిక్షణకు క్రెడాయ్‌ బిల్డర్‌, ఇతర బిల్డర్ల సైట్లను ఉపయోగించుకోవడం వరకు వేర్వేరు ప్రణాళికలు ఉన్నాయి. దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ గతంలో చేసిన సూచనకు అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. సమయం ఇస్తే దీని గురించి మంత్రికి, అధికారులకు ప్రజెంటేషన్‌  ఇవ్వనున్నాం.

సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, ఛైర్మన్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని