టీఎస్‌బీపాస్‌లో మరిన్ని అనుమతులు చేర్చండి

రాష్ట్రంలో స్థిరాస్తి రంగ అభివృద్ధిని కొనసాగించేందుకు.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఒకేసారి 20కి పైగా విభాగాల అధిపతులతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని క్రెడాయ్‌, నరెడ్కో తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రశంసించాయి.

Published : 08 Jul 2023 01:00 IST

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్థిరాస్తి రంగ అభివృద్ధిని కొనసాగించేందుకు.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఒకేసారి 20కి పైగా విభాగాల అధిపతులతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని క్రెడాయ్‌, నరెడ్కో తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రశంసించాయి. క్రెడాయ్‌ చొరవతో రియల్‌ ఏస్టేట్‌ పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. డెవలపర్ల బాధలను అర్థం చేసుకోవడం, సమస్యలకు తగిన పరిష్కారాలను అన్వేషించడం, రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి టీఎస్‌బీపాస్‌లో అవసరమైన అనుమతులను ఏకీకృతం చేయడం వరకు సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

* మాస్టర్‌ప్లాన్‌, ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను సీఎస్‌ వద్ద ప్రస్తావించాం. టీఎస్‌బీపాస్‌ ఫ్లాట్‌ఫాంను టీఎస్‌ రెరాతో పూర్తిగా అనుసంధానించాలని కోరాం. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారు.

 పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

* మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌ నిర్మాణాలకు సంబంధించి పోలీసు ఎన్‌వోసీ తప్పనిసరి. ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ముందు దాదాపు 11 అనుమతులు అవసరం. దీన్ని పునఃపరిశీలించి క్రమబద్ధీకరణకు ప్రక్రియను అభివృద్ధి చేయాలని కోరాం.

 సునీల్‌చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ

* కొత్తగా అభివృద్ధి చెందుతున్న చాలా ప్రాంతాల్లో మురుగు, వరదనీటి కాలువల వ్యవస్థ లేదు. దీంతో భారీ వర్షం పడితే కొన్ని ప్రాజెక్టులు ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో రీసైక్లింగ్‌ చేసిన నీరు ఫ్లషింగ్‌, గార్డెనింగ్‌కు ఉపయోగించిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మిగులుతోంది. ఈ నీటిని ఎలా వినియోగించుకోవాలనేది పెద్ద సమస్యగా ఉంది. దీనికి పరిష్కారం సూచించాలి.  

జి.వి.రావు, అధ్యక్షుడు, టీడీఏ

* భవనం అనుమతితో పాటూ బోర్‌వెల్‌లు, తాత్కాలిక విద్యుత్తు కనెక్షన్ల వంటి వాటికి అవసరమైన అనుమతులను టీఎస్‌ బీపాస్‌లోనే ఇచ్చేలా చూడాలి. రెరా వచ్చినందున 10 శాతం తనఖా నిబంధనను తొలగించాలి. ఈ నిబంధన కారణంగా భాగస్వామ్యులందరూ ఆదాయాన్ని కోల్పోతున్నారు. బిల్డర్‌కు అమ్ముకోడానికి వీల్లేదు. తర్వాత అమ్మడం కష్టం అవుతోంది. ఓసీ తర్వాత విక్రయిస్తున్నందున ప్రభుత్వం జీఎస్‌టీ కోల్పోతోంది.

సి.ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, టీబీఎఫ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని