భూమి ఉంటే బూమ్‌బూమ్‌

రాబోయే రోజుల్లో భూమికి మరింత డిమాండ్‌ పెరగనుంది.. ఇది తెలిసిన విషయమే అయినా.. ఏ మేరకు డిమాండ్‌ ఉండబోతుందనేది ఎక్కువమందికి ఆసక్తి కల్గించే విషయం. కోకాపేటలో ఎకరం గరిష్ఠంగా వందకోట్లపైన పలికింది.

Updated : 02 Sep 2023 07:03 IST

భవిష్యత్తులో గృహ, పారిశ్రామిక అవసరాలకు పెద్ద ఎత్తున అవసరం అంటున్న అధ్యయనాలు
ఈనాడు, హైదరాబాద్‌

రాబోయే రోజుల్లో భూమికి మరింత డిమాండ్‌ పెరగనుంది.. ఇది తెలిసిన విషయమే అయినా.. ఏ మేరకు డిమాండ్‌ ఉండబోతుందనేది ఎక్కువమందికి ఆసక్తి కల్గించే విషయం. కోకాపేటలో ఎకరం గరిష్ఠంగా వందకోట్లపైన పలికింది. సగటు ఎకరం ధర సైతం రూ.70 కోట్ల దాకా ఉంది. బుద్వేల్‌, మోకిల.. ఇలా ఎక్కడ చూసినా భూముల ధరలు పెరగడం డిమాండ్‌ను సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...

ప్రస్తుతం సేవల రంగంలో అత్యధిక వాటా కల్గిఉన్న మన ఆర్థిక వ్యవస్థ.. మున్ముందు ఉత్పత్తి రంగంలో బలమైన ముద్ర వేయబోతుంది. తయారీ రంగం వాటా 2022లో 14.2 శాతం ఉండగా... 2030 నాటికి 18.8 శాతం, 2047 నాటికి 31.7 శాతానికి పెరుగుతుందని అంచనా.

  • వాటా పెరుగుతోంది అంటేనే పారిశ్రామిక కార్యకలాపాలు అదేస్థాయిలో ఉండబోతున్నాయి అని అర్థం. పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున భూమి అవసరం ఉంటుంది. ఇది డిమాండ్‌ను మరింత పెంచబోతుంది.
  • 2021లో దేశవ్యాప్తంగా పరిశ్రమల కోసం ఉపయోగిస్తున్న భూమి 5 లక్షల హెక్టార్లు ఉంటే.. 2030 నాటికి 14 లక్షలకు, 2047 నాటికి 102 లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా.
  • ఎక్కడ భూమి అందుబాటులో ఉంటే అక్కడ తయారీ రంగం ఊపందుకునే అవకాశం ఉంది. తెలంగాణలో అందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇళ్ల కోసం...  : తయారీ రంగంలో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. వలస వచ్చిన వారికి ఉపాధి దొరుకుతుంది. వీరందరికీ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 2047 నాటికి 23 కోట్ల ఇళ్లు కావాలని అంచనా. మన రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున హౌసింగ్‌కు డిమాండ్‌ పెరగనుంది. వీటన్నింటికీ భూమి కావాల్సిందే. 

100 కి.మీ. వరకు కొనేశారు...

  • హైదరాబాద్‌ నగరం ఇప్పటికే సిటీ నలువైపులా 20 నుంచి 25 కి.మీ. మేర విస్తరించింది. అవుటర్‌ లోపల ఇళ్ల కోసం ఒకటి రెండు ప్రాంతాలు మినహా సిటీలో భూముల లభ్యత పెద్దగా లేదు.
  • ప్రస్తుతం సిటీలో 25 నుంచి 35 కి.మీ. మధ్య పెద్ద ఎత్తున నిర్మాణాలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇదివరకే లేఅవుట్లు వేసి భూములు అమ్మేశారు. వ్యక్తిగత ఆవాసాలు, విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. తర్వాతి దశ ఇక అపార్ట్‌మెంట్లే.
  • నగరం 35 నుంచి 50 కి.మీ. దూరంలో ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల భూ లావాదేవీలు ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నాయి. ప్లాటింగ్‌ వెంచర్లు నడుస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాల వారు.. పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ తమ బడ్జెట్‌లో దొరికే స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకుంటున్నారు. వేర్‌ హౌసింగ్‌, డేటా సెంటర్లు, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో టౌన్‌షిప్పులు వచ్చే అవకాశం ఉంది.
  • సిటీ 50 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు జాతీయ రహదారుల వెంట ముందు చూపుతో ఇదివరకే పెద్ద ఎత్తున భూములు కొన్నారు. ఫామ్‌ ల్యాండ్స్‌ వెంచర్లు, పట్టణాలకు దగ్గరలో ఉంటే హౌసింగ్‌ చేపడుతున్నారు.  పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వినోద కేంద్రాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా భూములు అందుబాటులో ఉన్నాయి. ధరలే ఎక్కువ చెబుతున్నారు.
  • వంద నుంచి 150 కి.మీ. పరిధిలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అధిక శాతం వ్యవసాయ భూములుగా ఉన్నాయి. ఇక్కడ సైతం సిటీ నుంచి వచ్చి ముందుచూపుతో భూములు కొంటున్నవారు ఉన్నారు. ధర ఎక్కువ ఉన్న చోట ఒక ఎకరా భూమి అమ్మి.. తక్కువ ఉన్న చోట ఐదు నుంచి పది ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ తోటల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని