ఒక్కో నగరంలో ఒక్కోలా..

గోదాముల లీజింగ్‌లో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో చెప్పుకోతగ్గ వృద్ధి నమోదైంది. 15.4 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ జరిగింది. గత ఏడాది 13.3 మిలియన్‌ చ.అ. మాత్రమే.

Published : 23 Sep 2023 00:51 IST

గోదాముల లీజింగ్‌లో వృద్ధి నమోదైనా కొన్ని నగరాలకే పరిమితం

ఈనాడు, హైదరాబాద్‌ : గోదాముల లీజింగ్‌లో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో చెప్పుకోతగ్గ వృద్ధి నమోదైంది. 15.4 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ జరిగింది. గత ఏడాది 13.3 మిలియన్‌ చ.అ. మాత్రమే. ఈ-కామర్స్‌, రహదారుల అభివృద్ధి వంటి మౌలిక వసతులు పెరుగుతుండటంతో రవాణా రంగం విస్తరించి గోడౌన్లకు డిమాండ్‌ పెరిగింది. అయితే ఇది కొన్ని నగరాలకు పరిమితమైంది.

ఇక్కడ భారీగా వచ్చాయ్‌ : దిల్లీ, నోయిడా, గుర్‌గావ్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఇక్కడ 4.7 మిలియన్‌ చ.అ. లీజింగ్‌ జరిగింది. గత ఏడాది కంటే ఇది 68 శాతం అధికం. దేశంలోని మొత్తం గోడౌన్ల లీజింగ్‌లో దిల్లీ వాటానే 31 శాతంగా ఉంది.

  • ముంబయి, పుణె నగరాలు రెండూ కలిసి 42 శాతం కల్గి ఉన్నాయి. ఇక్కడ కూడా అధిక డిమాండ్‌ను సూచిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ముంబయిలో 75 శాతం, పుణెలో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయని వెస్టియన్‌ నివేదికలో పేర్కొంది.  

హైదరాబాద్‌లో చూస్తే... : దిల్లీ, ముంబయి, పుణెతో పోలిస్తే గోడౌన్ల లీజింగ్‌లో హైదరాబాద్‌ చాలా వెనకబడి ఉంది. పైగా గత ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే.. ఈసారి తగ్గింది. 2022 జనవరి-జూన్‌ కాలంలో 1.4 మిలియన్‌ చదరపు అడుగుల గోడౌన్ల లీజింగ్‌ జరిగితే.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 1.3 మిలియన్‌ చ.అ.లకే పరిమితమైంది. 7 శాతం తగ్గింది. మన దగ్గర ఎక్కువగా మేడ్చల్‌, శంషాబాద్‌ చుట్టుపక్కల గోడౌన్లు ఉన్నాయి.

మిగతా నగరాల్లోనూ.. : బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లోనూ ప్రతికూల వృద్ధి నమోదైంది. బెంగళూరులో గత ఏడాది 1.8 మిలియన్‌ చ.అ. గోడౌన్ల లీజింగ్‌ జరిగితే.. 1.7 మిలియన్‌ చ.అ. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో జరిగాయి.

అద్దెలు స్థిరంగా.. : గోడౌన్ల అద్దెలు దిల్లీ చుట్టుపక్కల, ముంబయిలో తప్ప మిగతా చోట్ల నిలకడగా ఉన్నాయి. దిల్లీలో చదరపు అడుగుకు ప్రతినెలా రూ.22.5 వసూలు చేస్తున్నారు. బెంగళూరులో రూ.22గా ఉంది. పుణెలో రూ.20.9 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.20.5గా ఉంది. చెన్నై, ముంబయి, కోల్‌కతాలో అద్దెలు రూ.20 లోపే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని