కొనుగోలుదారుల రక్షణతోనే నిర్మాణ రంగం వృద్ధి

స్థిరాస్తి రంగ సమాచారం ఏజెంట్ల ద్వారానే కొనుగోలుదారులకు చేరుతుందని... సరైన వివరాలు అందించి కొనుగోలుదారులు మోసాలకు గురికాకుండా చూడాలని రెరా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ సూచించారు.

Published : 07 Oct 2023 00:15 IST

రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల శిక్షణ
కార్యక్రమంలో రెరా ఛైర్మన్‌ సత్యనారాయణ

రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న రెరా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ

ఈనాడు, హైదరాబాద్‌ : స్థిరాస్తి రంగ సమాచారం ఏజెంట్ల ద్వారానే కొనుగోలుదారులకు చేరుతుందని... సరైన వివరాలు అందించి కొనుగోలుదారులు మోసాలకు గురికాకుండా చూడాలని రెరా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్‌ రియల్టర్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఆర్‌ఏ), రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) సంయుక్త ఆధ్వర్యంలో మాసాబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రిజిస్టర్డ్‌ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా రెరాలో రిజిస్టర్‌ అయిన తర్వాతే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలన చేసి 48 గంటల్లోనే రిజిస్ట్రేషన్‌ పత్రం జారీ చేస్తున్నట్లు తెలిపారు. బిల్డర్లు, ప్రమోటర్లు త్రైమాసిక వార్షిక నివేదికలను సకాలంలో పంపేలా ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలని కోరారు. త్రైమాసిక, వార్షిక నివేదిక సమర్పించని ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. కొనుగోలుదారులకు రక్షణ ఉంటేనే నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని బిల్డర్లు, ఏజెంట్లు గుర్తించాలన్నారు.

అవగాహనతోనే విక్రయించాలి.. : తాము విక్రయించే ప్రాజెక్టులకు సంబంధించి ఏజెంట్లు సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని రెరా సభ్యులు కె.శ్రీనివాసరావు సూచించారు. కొనుగోలుదారులకు సక్రమమైన సమాచారమే అందించాలని అన్నారు. ఏజెంట్లను బలోపేతం చేయడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌రంగంలో పారదర్శకత సాధించగలమని సభ్యులు లక్ష్మీనారాయణ అన్నారు. రిసోర్స్‌ పర్సన్లు బాలాజీ, హనుమంతరెడ్డి ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పరీక్ష నిర్వహించారు. సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ఏ ఉపాధ్యక్షుడు కృతిష్‌, కార్యదర్శి రాహుల్‌ రామరాజు, కరుణాకర్‌, రెరా ఈడీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని