సొంతింటికి వెలుగులు

సొంతిల్లు కొనేందుకు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారా? దీపావళి పండగ రోజుల్లో గృహ కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలతో పాటూ బ్యాంకులు వడ్డీరేట్లలో రాయితీలు అందిస్తున్నాయి.

Updated : 11 Nov 2023 08:36 IST

పండగ పూట నిర్మాణ సంస్థలు, బ్యాంకుల రాయితీలు

ఈనాడు, హైదరాబాద్‌ : సొంతిల్లు కొనేందుకు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారా? దీపావళి పండగ రోజుల్లో గృహ కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలతో పాటూ బ్యాంకులు వడ్డీరేట్లలో రాయితీలు అందిస్తున్నాయి. సొంతింటి కోసం చూస్తున్న వారికి ఇది అనువైన సమయమని బిల్డర్లు చెబుతున్నారు.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ఎన్నికల ప్రభావం కనిపిస్తోందని కొందరు నిర్మాణదారులు అంటున్నారు. ఎన్నికల కోడ్‌తో నగదు లావాదేవీలపై ఆంక్షలు ఉండటంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడింది. ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందా? కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా? ఎవరొస్తే స్థిరాస్తి రంగం ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఫలితాలు వచ్చేవరకు వేచిచూసే ధోరణిలో పెట్టుబడిదారులు ఉన్నారు.

కొత్తవాటిలోనూ..

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులే కాదు.. పలు కొత్త నిర్మాణాలు పండగ రోజుల్లో ప్రారంభం అవుతున్నాయి. బుద్వేల్‌లో భారీ టౌన్‌షిప్‌ను బెంగళూరు నిర్మాణ సంస్థ ప్రారంభించింది. భవిష్యత్తు అభివృద్ధిపై విశ్వాసంతోనే కొత్తవి వస్తున్నాయి. స్థానిక బిల్డర్లతో పాటూ దేశంలో పేరున్న సంస్థలు ఇక్కడ ప్రాజెక్టులు చేపడుతున్నాయి.

వడ్డీరేట్ల రాయితీతో..

గృహరుణ వడ్డీరేట్లు ఏడాదిన్నరగా అత్యధిక స్థాయికి చేరాయి.దీంతో కొనుగోలుదారుల రుణ లభ్యత తగ్గింది. మరోవైపు కొవిడ్‌ తర్వాత స్థిరాస్తుల ధరలు పెరిగాయి. భూముల ధరలు, కూలీ రేట్లు, పలు నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో అందుకోలేని స్థాయికి చేరాయి. వడ్డీరేట్లు తగ్గితే గృహ కొనుగోలుదారులకు  ఊరట ఉంటుంది. కొత్త రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లలో రాయితీలను అందిస్తున్నాయి.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో గృహ రుణ వడ్డీరేట్లు సాధారణంగా 8.75 శాతంతో మొదలవుతున్నాయి. పండగ వేళల్లో 8.35 నుంచి అందిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ప్రాసెసింగ్‌ ఫీజులోనూ 50 శాతం తగ్గింపు ఇస్తోంది. సిబిల్‌ స్కోరు ఆధారంగా వడ్డీరేట్లలో రాయితీలు వర్తిస్తాయి.
  • పండగ సందర్భంగా ఎస్‌బీఐ 8.4 శాతం వడ్డీకే గృహరుణాలను అందిస్తోంది. 65 బేసిక్‌ పాయింట్లు తగ్గించింది. సాధారణంగా వడ్డీరేట్లు 9.15 శాతంగా ఉన్నాయి.
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 8.4 శాతం వడ్డీరేట్లను ఈ నెలాఖరుకు వరకు అందిస్తోంది.
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 8.4 శాతం వడ్డీకే  అందిస్తోంది. ఈ ఏడాది ఆఖరు వరకు వినియోగించుకోవచ్చు అని చెబుతోంది.
  • కెనరా బ్యాంక్‌లోనూ 8.4 శాతానికి గృహరుణాలు పొందవచ్చు. డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలను తొలగించారు.
  • ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వడ్డీరేట్లు 8.4 నుంచి ప్రారంభం అవుతాయి. సిబిల్‌ స్కోరు 750 పాయింట్లపైన, రూ.2 కోట్ల వరకు రుణంపైన ఇది వర్తిస్తుంది.
  • పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇంటి విలువలో 90 శాతం రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. వడ్డీరేట్లు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతాయి.

నిర్మాణ సంస్థలిలా...

పూర్తైన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లోనూ దీపావళి పండగ వేళ నిర్మాణ సంస్థలు రాయితీలు ప్రకటించాయి.

  • ఒక సంస్థ చదరపు అడుగు రూ.200 తక్కువకు ఇస్తామంటోంది.
  • స్థలాల స్పాట్‌ రిజిస్ట్రేషనైతే చదరపు గజం రూ.100 తక్కువ అంటోంది మరో సంస్థ. విల్లాలపై రూ.400-500 వరకు తగ్గింపు ఇస్తున్నాయి. రూ.5 లక్షల నుంచి 8 లక్షల విలువ చేసే సౌకర్యాలను ఉచితంగా ఇవ్వనున్నట్లు మరికొన్ని విల్లా ప్రాజెక్టులు ఆఫర్‌ చేస్తున్నాయి.  
  • ఇప్పుడు బుక్‌ చేసి.. నిర్మాణం పూర్తైయ్యే వరకు ప్రీ ఈఎంఐ ఆఫర్‌ను పలు సంస్థలు ఇస్తున్నాయి.  
  • దీపావళి ధమాకా ఆఫర్‌ కింద రూ.4 లక్షలు తక్కువ చేస్తున్న సంస్థలు ఉన్నాయి.

ఇల్లు అవసరం ఉన్నవారు

సొంతింటి కోసం ఎంతోకాలంగా అన్వేషిస్తున్న వారికి ఇది సరైన సమయం అంటున్నారు నిర్మాణదారులు. మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌తో సహా సిటీకి నలువైపులా సాధారణ, గేటెడ్‌ కమ్యూనిటీ, విల్లా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ ధరల్లో ఇళ్లు మొదలు విలాసవంతమైన ప్రీమియం ప్రాజెక్టుల వరకు నిర్మాణంలో ఉన్నాయి. అనువైన ప్రాంతంలో తమ బడ్జెట్‌లో వచ్చే ఇంటిని చూసుకోవచ్చు. పటాన్‌చెరు, కొల్లూరు, కొంపల్లి, మేడ్చల్‌, శామీర్‌పేట, ఉప్పల్‌, పోచారం, ఘట్‌కేసర్‌, ఆదిభట్ల, తుక్కుగూడ, శంషాబాద్‌, శంకర్‌పల్లి వరకు గృహ నిర్మాణ ప్రాజెక్టులు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని