ఉద్గారాలు తగ్గించి.. ఉత్పాదకత పెంచేలా

వాతావరణంలో కలిసే కర్బన ఉద్గారాల ప్రధాన మూలాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒకటి.

Updated : 18 Nov 2023 06:03 IST

సుస్థిర హరిత భవనాలతోనే భవిష్యత్తు
ఈనాడు, హైదరాబాద్‌

వాతావరణంలో కలిసే కర్బన ఉద్గారాల ప్రధాన మూలాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒకటి. మొత్తం ఉద్గారాలలో దాదాపు 40 శాతం వాటా ఈ రంగం కలిగి ఉండటం ఆందోళన కలిగించే విషయం. 2040 నాటికి ప్రస్తుతం ఉన్న భవనాల్లో దాదాపు మూడింట రెండువంతులు కార్బన్‌ డై యాక్సైడ్‌ ఉద్గారాలు పెరగడానికి దోహదపడతాయని అంచనా వేశారు. దీన్ని తగ్గించడంపైనే అందరి దృష్టి ఉంది. హరిత భవనాలు దీనికి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

మేల్కొలుపు

  • ప్రపంచ ఉద్గారాల్లో 7.3 శాతానికి భారత్‌ కారణం అవుతోంది. అందులో అతిపెద్ద కారకుల్లో ఒకటి రియల్‌ ఎస్టేట్‌.
  • 2021లో 2.88 గిగా టన్నుల నుంచి 2030 నాటికి 4.48 గిగా టన్నులకు కర్బన ఉద్గారాలు చేరుకోవచ్చని అంచనా.
  • 22 శాతం ఉద్గారాలను తగ్గించడంతో 2030 నాటికి 3.48 గిగా టన్నులకు నిరోధించవచ్చు
  • సౌర ఫలకలు, ఆటోమేటెడ్‌ హెచ్‌వీఏసీ వ్యవస్థలు, గ్రీన్‌రూఫ్‌లు, హరిత భవనాలతో 70 శాతం వరకు విద్యుత్తు ఆదా చేయవచ్చు.

ధృవీకరణతో

  • విద్యుత్తు, నీటి ఆదా చేసే గ్రీన్‌ బిల్డింగ్‌ రేటింగ్‌ ఉండేలా ఆయా భవనాలను సర్టిఫైడ్‌ చేయిస్తున్నారు. అద్దెకు, లీజుకు తీసుకునే సంస్థలు ఈ తరహా రేటింగ్‌ కలిగిన భవనాలవైపే మొగ్గు చూపుతున్నాయి.
  • భారత్‌ 2070 నాటికి కాలుష్య ఉద్గారాల్లో నికర సున్నాకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 40 శాతం విద్యుత్తు అవసరాలను పొందాలనేది సుస్థిర లక్ష్యాల్లో ఒకటి. ఇందులో భాగంగా భవనాల్లో సౌర విద్యుత్తు వినియోగం పెరిగింది. కరెంట్‌ అవసరం తక్కువగా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. అవసరమైన కరెంట్‌ను సైతం పూర్తిగా సౌర, పవన విద్యుత్తుతో వినియోగించుకునేలా భవనాలను రూపకల్పన చేస్తున్నారు. నగరంలో టీఎస్‌ రెడ్కో నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనం నెట్‌జీరో ఎనర్జీగా నిర్మిస్తున్నారు. పలు ఐటీ కార్యాలయాలను హరిత భవనాలుగా తీర్చిదిద్దుతున్నారు.

16-26 శాతం వరకు పాత భవనాల్లో

కొత్త భవనాలు చాలావరకు హరితంగా నిర్మిస్తున్నారు. పాత భవనాల్లో చాలావరకు కూలిపోయేందుకు సిద్ధంగా ఉండగా.. మరో 16 నుంచి 25 శాతం వరకు మార్పులు చేర్పులతో హరిత భవనాలుగా మార్చుకోవచ్చు.

 

ఐదేళ్లలో వెనక్కి

సాధారణ భవనాలతో పోలిస్తే హరిత ప్రాజెక్టుల వ్యయం 5 నుంచి 15 శాతం అధికంగా ఉన్నా అది క్రమంగా తగ్గతూ వస్తోంది. అయితే నిర్వహణ వ్యయం తగ్గడం, కరెంట్‌, నీటి ఆదా వంటివి పరిగణనలోకి  తీసుకుంటే మూడు నుంచి ఐదేళ్లలోనే అధికంగా చెల్లించిన మొత్తం వెనక్కి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


దిల్లీలాంటి నగరాల్లో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వాహన, పారిశ్రామిక, వ్యవసాయ ఉద్గారాలు ఇలా ఒక్కోటి కాలుష్యానికి తోడవుతున్నాయి. భవనాల నుంచి వెలువడే కాలుష్యం తక్కువేం కాదు. నివాస యోగ్య నగరాలుగా మారాలంటే మిగతా అన్ని కాలుష్యాలతో పాటూ... భవనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించాల్సి ఉంది. హరిత భవనాలతో 35 శాతం ఉద్గారాలతో పాటు 20 శాతం నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయని కేపీఎంజీ, కొలియర్స్‌ సంయుక్తంగా రూపొందించిన సుస్థిర రియల్‌ ఎస్టేట్‌ నివేదికలో పేర్కొన్నాయి.


దేశంలో ప్రస్తుతం ఇలా

  • హరిత కార్యాలయాల నిర్మాణాల్లో 2016తో పోలిస్తే 2023 నాటికి 83 శాతం వృద్ధి నమోదైంది.
  • ఇప్పుడు అందుబాటులో ఉన్న దాంట్లో హరిత కార్యాలయాల వాటానే 61 శాతంగా ఉంది. ఇది పెరుగుతున్న పోకడలను ప్రతిబింబిస్తుంది.
  • హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ముంబయి, చెన్నై, పుణె నగరాల్లో గ్రేడ్‌-ఏ రకం హరిత భవనాలు 421 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులో ఉన్నాయి.

ఇరువురికీ ప్రయోజనం

  • హరిత భవనాలతో యజమానులకు అధిక అద్దెలు, ఆస్తుల విలువ పెరుగుదల ఉంటుంది.
  • లీజుకు తీసుకున్న సంస్థల ఉత్పాదకత పెరగడం, అక్కడ పనిచేసే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
  • కార్యాలయాలు, వాణిజ్య భవనాలే కాదు గృహ నిర్మాణాల్లోనూ పెద్ద ఎత్తున హరిత ప్రాజెక్టులు వస్తున్నాయి. రేటింగ్‌ చూసి మరీ కొనుగోలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని