నవంబరులో సానుకూలం

రాజధాని పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నవంబరు నెలలో నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లలో స్వల్ప వృద్ధి నమోదైంది.

Updated : 16 Dec 2023 06:35 IST

పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

ఈనాడు,హైదరాబాద్‌: రాజధాని పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నవంబరు నెలలో నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లలో స్వల్ప వృద్ధి నమోదైంది. వార్షిక వృద్ధి 2శాతం ఉండగా.. నెలవారీగా పెరుగుదల 8 శాతం నమోదైనట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎన్నికల ప్రభావం భూములు, స్థలాల విక్రయాలపైనే తప్ప నివాసాలపై కాదని వీరి నివేదిక స్పష్టం చేస్తోంది.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కొన్నాళ్లుగా నిలకడగా ముందుకెళుతోంది. రిజిస్ట్రేషన్ల గణాంకాలు దీన్ని మరోమారు ధృవీకరించాయి. నవంబరు నెలలో 6268 నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతకుముందు ఏడాది 6162తో పోలిస్తే 2శాతం అధికం.  అక్టోబరు నెలలోని 5799 యూనిట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైంది.
విలువల్లో 29 శాతం వృద్ధి... : 2022 నవంబరులో రూ. 2903 కోట్ల విలువైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ జరిగితే.. ఈ ఏడాది నవంబరులో జరిగిన లావాదేవీల విలువ రూ.3741 కోట్లుగా ఉంది. ఏకంగా 29 శాతం పెరిగింది. అక్టోబరు నెలతో పోలిస్తే 18 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఇళ్ల ధరలు పెరగడమే దీనికి కారణం.
13.8 శాతం ధరలు పెరిగాయ్‌... :  నివాస గృహాల ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఏడాదికాలంలో సగటు ధరలు 13.8 శాతం పెరిగాయి. హైదరాబాద్‌ జిల్లాలో 8 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 8 శాతం, రంగారెడ్డి జిల్లాలో 17 శాతం ధరలు పెరిగాయి. రూ.2 కోట్ల పైన విలువైన ఇళ్ల వాటా 2022లో 1 శాతం ఉండగా.. ఈసారి 3 శాతానికి పెరిగింది.
71 శాతం విక్రయాలు వాటిలోనే.. : కొనుగోలుదారులు అత్యధిక మంది 1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణం లోపల ఉండే ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. మొత్తం విక్రయాల్లో వీటి వాటానే 71 శాతంగా ఉంది. గత ఏడాది ఇది 65 శాతంగా ఉండేది. 3వేల చ.అ.పైన కొనుగోళ్లు 2 శాతం నుంచి 3 శాతానికి పెరిగాయి. 2వేల నుంచి 3వేల చ.అ.మధ్య విస్తీర్ణం కల్గిన ఇళ్లు 9 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది.


అత్యంత విలాసం

ఐదు కోట్ల కంటే ఎక్కువ విలువైన 5 నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇవన్నీ కూడా 3వేల చ.అడుగుల విస్తీర్ణంపైన కల్గినవే. బేగంపేటలో రూ.10.61 కోట్ల విలువైన గృహం ఒకటి.. మిగతా నాలుగు బంజారాహిల్స్‌లోనివే. వీటికోసం రూ.5.37 కోట్ల నుంచి రూ.7.78 కోట్ల వరకు కొనుగోలుదారులు వెచ్చించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని