ఏటా కోటి అడుగులపైనే

హైదరాబాద్‌లో రాబోయే నాలుగేళ్లలో ఏటా కోటి చదరపు అడుగులపైనే కార్యాలయ భవనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే ఏడాదిలో రికార్డు స్థాయిలో 15.8 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత ఉండనుంది.

Published : 23 Dec 2023 01:29 IST

కార్యాలయ భవనాలపై 2027 వరకు అంచనాలు
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌లో రాబోయే నాలుగేళ్లలో ఏటా కోటి చదరపు అడుగులపైనే కార్యాలయ భవనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే ఏడాదిలో రికార్డు స్థాయిలో 15.8 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత ఉండనుంది. 2024 నుంచి 2027 వరకు 54.1 మి.చ.అ. అందుబాటులోకి రాబోతుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ కుష్‌మన్‌ వేక్‌ఫిల్డ్‌ నివేదిక వెల్లడించింది. నగరంలో పెద్ద ఎత్తున గ్రేడ్‌ ‘ఏ’ కార్యాలయాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తై ఖాళీగా ఉన్న భవనాలు దర్శనమిస్తున్నా.. కొత్త నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది.

గచ్చిబౌలి చుట్టుపక్కలనే అధికం..

ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఫ్లెక్సీబుల్‌ వర్క్‌స్పేస్‌ ఆపరేటర్ల నుంచి డిమాండ్‌ ఉండటంతో లీజింగ్‌ ఆశాజనకంగా ఉంది. కంపెనీలు గచ్చిబౌలి చుట్టుపక్కలనే తమ కార్యాలయాల ఏర్పాటుకు మొగ్గు చూపుతుండటంతో కొత్త భవనాలు ఇక్కడే ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం సరఫరాలో ఈ ప్రాంతం వాటానే 66 శాతం ఉంది.

లీజింగ్‌ పరంగా...

ఈ ఏడాది ఇప్పటివరకు 7.2 మి.చ.అ. లీజింగ్‌ జరగ్గా.. 24.8 శాతం ఇంకా ఖాళీలు ఉన్నాయి. 2027 వరకు సరఫరా పెరగడంతో పాటూ ఖాళీలు సైతం పెరుగుతున్నాయని అంచనా. నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024, 2025లో లీజింగ్‌ 8.5-9.2 మి.చ.అ. మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సరఫరా పెరగడంతో ఖాళీల్లోనూ పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.

అద్దెల వృద్ధిపై ప్రభావం..

2023 ఆఖరు నాటికి కార్యాలయాల భవనాల్లో అద్దెల వార్షిక వృద్ధి 2.6 శాతంగా ఉంటుంది. అధిక సరఫరా కారణంగా 2024, 2025లో అద్దెల వృద్ధి 0.7-08 శాతం మధ్యలో ఉండొచ్చని అంచనా.  చదరపు అడుగుకు వార్షిక అద్దె 2023 నాటికి రూ.858 ఉంటే.. 2025 చివరి నాటికి రూ.871 ఉండొచ్చని అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు