దీర్ఘకాలానికి మార్కెట్‌ బాగుంటుంది

భవిష్యత్తు హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ ఎటువైపు విస్తరణకు అవకాశం ఉంది? నెమ్మదించిన మార్కెట్‌ కొత్త సంవత్సరంలో ఊపందుకునేనా? కొత్త సర్కారు నిర్ణయాల ప్రభావం రియాల్టీపై ఏ మేరకు ఉంటుంది? గృహ, కార్యాలయాల నిర్మాణాలపై స్వల్ప, దీర్ఘకాలానికి ఉన్న అంచనాలేంటి? ఇత్యాది అంశాలపై స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా టెనెంట్‌ రిప్రజెంటేషన్‌ ఎండీ వీరబాబుతో ‘ఈనాడు’ ముఖాముఖి.

Published : 30 Dec 2023 00:59 IST

‘ఈనాడు’తో కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌
ఇండియా టెనెంట్‌ రిప్రజెంటేషన్‌ ఎండీ వీరబాబు

భవిష్యత్తు హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ ఎటువైపు విస్తరణకు అవకాశం ఉంది? నెమ్మదించిన మార్కెట్‌ కొత్త సంవత్సరంలో ఊపందుకునేనా? కొత్త సర్కారు నిర్ణయాల ప్రభావం రియాల్టీపై ఏ మేరకు ఉంటుంది? గృహ, కార్యాలయాల నిర్మాణాలపై స్వల్ప, దీర్ఘకాలానికి ఉన్న అంచనాలేంటి? ఇత్యాది అంశాలపై స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా టెనెంట్‌ రిప్రజెంటేషన్‌ ఎండీ వీరబాబుతో ‘ఈనాడు’ ముఖాముఖి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిస్థితి ఏంటి? 2024లో మీ అంచనాలు?
స్వల్పకాలానికి ప్రస్తుతం మార్కెట్‌ నెమ్మదించింది. సాధారణంగా డిసెంబరు నుంచి సంక్రాంతి వరకు మార్కెట్‌ మందకొడిగానే ఉంటుంది. ప్రభుత్వ మార్పుతో సంబంధం లేకుండానే పై కారణాలతో మార్కెట్లో పెద్ద ఊపు లేదు. విక్రయ లావాదేవీలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. దీర్ఘకాలానికి చూస్తే హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ బాగుంటుంది.

ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండటం.. యూఎస్‌లో ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో.. వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో మున్ముందు ఎలా ఉండబోతుంది?
రియల్‌ ఎస్టేట్‌ వృద్ధిలో వాణిజ్య భవనాల పరంగా చూస్తే.. 2023 జనవరి నుంచి డిసెంబరులో దేశవ్యాప్తంగా 70 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయాల భవనాలు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022తో పోలిస్తే గ్రాస్‌లో 2 మిలియన్‌ చదరపు అడుగులు పెరిగింది. నికరంగా పరిశీలిస్తే గతేడాది 34 మిలియన్‌ చ.అ. లావాదేవీలు జరిగితే ఈ ఏడాది 38 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది. హైదరాబాద్‌ కూడా గతేడాది కంటే ఈ ఏడాది ఆఫీస్‌ స్పేస్‌లో బాగా వృద్ధి కన్పించింది. ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచి పని చేస్తుండటంతో కార్యాలయాల్లో కొంత ఖాళీల భయాలు ఉన్నాయి. యూఎస్‌లో ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కూడా కొంత మనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఐటీలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే మీమాంసలో అక్కడి పెద్ద సంస్థలు ఉన్నాయి. కార్యాలయాల ఏర్పాటులో పునరాలోచనలో పడ్డాయి. ఇదివరకు కార్యాలయం ఏర్పాటు చేస్తే 70 నుంచి 80 శాతం మంది ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేవారు. కొవిడ్‌ తర్వాత 30 శాతానికి కూడా కంపెనీలు అనుమతి ఇస్తున్నాయి. ఈ ప్రభావం కార్యాలయాల భవనాలపై పడింది. ఇది లేకపోతే ఆఫీస్‌ స్పేస్‌ ఇంకా పెరిగేది. ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు ఇన్నోవేషన్‌ కోసం కార్యాలయానికి ఉద్యోగులను రప్పించే అవకాశం 2024లో ఉంటుందని భావిస్తున్నాం. భారతీయ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఎంఎన్‌సీల్లో 45 నుంచి 50 శాతం వరకే ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. మిగతా వారిని కూడా రప్పించే అవకాశాలు 2024లో కన్పిస్తున్నాయి. కాబట్టి కార్యాలయాల భవనాలకు డిమాండ్‌ పెరుగుతుంది అనేది మా అంచనా.

హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మార్కెట్లో అధిక సరఫరా వచ్చే అవకాశం ఉందా?
గృహ నిర్మాణపరంగా కొవిడ్‌ తర్వాత అన్ని మార్కెట్లలో డిమాండ్‌ పెరిగింది. ధరలూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇదే పోకడ కొనసాగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ స్పెక్యులేషన్‌ ఎక్కువైంది. కోకాపేట భూముల వేలం అనంతరం ఇది ఎక్కువగా కన్పించింది. పశ్చిమ హైదరాబాద్‌ మార్కెట్లో చదరపు అడుగు రూ.6500-7000 వరకు ఉన్న ధరలు రూ.9000-12000 వరకు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో మిగతా ప్రాంతాల్లోనూ 25 నుంచి 30 శాతం ధరలు పెరిగాయి. ఉత్తరం, దక్షిణం వైపు పెరిగాయి. కొంతవరకు తూర్పు వైపు ధరలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. సిటీలో ఎక్కడ చూసినా వ్యవస్థీకృత మార్కెట్లో గేటెడ్‌ కమ్యూనిటీల్లో చదరపు అడుగు తక్కువలో తక్కువ రూ.5వేలపైనే ఉంది. విక్రయాలు బాగానే ఉన్నాయి. అదే సమయంలో అధిక సరఫరా భయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదిన్నర అధిక సరఫరా ఉంది. సాధారణంగానే 12 నుంచి 15 నెలల పాటూ సరఫరా అధికంగా ఉండటం అనేది సాధారణ పరిణామమే.

భవిష్యత్తులో నగరం ఎటువైపు విస్తరించే అవకాశం ఉంది?
ఐటీ కారిడార్‌ కొనసాగింపుగా కొల్లూరు వైపు, విమానాశ్రయ మార్గం వైపు ఎక్కువగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. శంషాబాద్‌ వైపు పెద్ద సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతున్నాయి. మెట్రో అలైన్‌మెంట్‌ మార్పు నిర్ణయం పెద్దగా ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదు. అయితే అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) ఉండటంతో ఎక్కువ నిర్మాణాలు ఐటీ కారిడార్‌లోనే వచ్చాయి. ఈ ప్రాంతం నుంచి విమానాశ్రయం వరకు రద్దీ పెరిగింది. ఎంత విశాలంగా రహదారులు ఉన్నా, విస్తరించినా పెరిగే కార్లతో సరిపోదు. నానక్‌రాంగూడ నుంచి శంషాబాద్‌ వెళ్లేందుకు వాహన సాంద్రత పెరిగిపోయింది. మెట్రో ఉంటే ఈ ప్రాంతానికి మరింత సానుకూలం. మిగతా ప్రాంతాల్లోనూ అభివృద్ధి విస్తరణ ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని