కొత్త ప్రాజెక్టుల్లో దూకుడు

నూతన సంవత్సర ఆరంభంలో ఇళ్ల విక్రయాలు బాగుండటంతో స్థిరాస్తి సంస్థలు కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రారంభించాయి. హైదరాబాద్‌లో జనవరి-మార్చి మూడునెలల వ్యవధిలో 12,620 యూనిట్ల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి.

Published : 17 Apr 2021 02:08 IST

ఈనాడు, హైదరాబాద్‌

నూతన సంవత్సర ఆరంభంలో ఇళ్ల విక్రయాలు బాగుండటంతో స్థిరాస్తి సంస్థలు కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రారంభించాయి. హైదరాబాద్‌లో జనవరి-మార్చి మూడునెలల వ్యవధిలో 12,620 యూనిట్ల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 2020లో ఇదే కాలంలో కేవలం 3,380 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభం అయ్యాయి.
నగర వ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు రావడం వరకు సంతోషమే అయినా.. ఇళ్ల ధరలు సామాన్య, మధ్య తరగతుల వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. తొలి త్రైమాసికంలో ప్రారంభించిన నిర్మాణాలన్నీ రూ.40 లక్షలు-రూ.80 లక్షలు మిడ్‌ ఎండ్‌,  రూ.80 లక్షలు- రూ.1.5 కోట్ల హై ఎండ్‌ గృహాలే 89 శాతం ఉన్నాయని అనరాక్‌ సంస్థ తొలి త్రైమాసిక నివేదికలో వెల్లడించింది.

* రూ.40లక్షల నుంచి రూ.80 లక్షల లోపు ఇళ్లు ఎక్కువగా ప్రారంభం అయ్యాయి. వీటి వాటా అత్యధికంగా 61 శాతంగా ఉంది.
* రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు ఇళ్ల వాటా 28 శాతంగా ఉంది.  
*అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాలు రూ.40 లక్షల లోపు కేవలం 5 శాతం మాత్రమే మొదలెట్టారు. వాస్తవానికి ఈ ధరల శ్రేణిలో ఎక్కువ డిమాండ్‌ ఉంది. పేరున్న బిల్డర్లు ఎవరూ అందుబాటు ఇళ్లు కట్టడం లేదు.
*ఇళ్ల కొనుగోళ్ల పరంగా చూస్తే  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4,400 యూనిట్లు విక్రయించారు.  క్రితం సంవత్సరం ఇదే కాలంలో కేవలం 2,680 ఇళ్లు మాత్రమే అమ్మగలిగారు. పెరుగుదల దాదాపు 64 శాతంగా ఉంది.

కీలక అంశాలివే..
* గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇళ్ల డిమాండ్‌ మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది.
* అందుబాటు ధర ఇళ్లు, మిడ్‌ ఎండ్‌ విభాగంలో ఇళ్ల నిర్మాణాలపై బిల్డర్లు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇంటి ధరలే ఇక్కడ కీలకం.

అవునా.. నిజమేనా?

అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు(ఇన్వెంటరీ) సైతం పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మిగిలిన ఇళ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సారి త్రైమాసికంలో ఇన్వెంటరీ పెరగడం పరిశ్రమ వర్గాలను కొంత కలవర పెడుతోంది. తొలి త్రైమాసికంలో 44,980 ఇళ్లు మిగిలిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 24,910 మాత్రమే. వీటిలో సగటు చదరపు అడుగు ధర రూ.4,240గా ఉంది.
* బడ్జెట్‌ల వారీగా చూస్తే.. రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధరల శ్రేణిలో అత్యధికంగా 40 శాతం ఇళ్లు ఉన్నాయి. రూ.40లక్షలు-రూ.80 లక్షల ధరల శ్రేణిలోని ఇళ్లు 37 శాతం ఉన్నాయి. అందుబాటు ధరల్లో ఇళ్లు కేవలం 11 శాతం మాత్రమే అమ్ముడు పోకుండా ఉన్నాయి.
* క్రితం త్రైమాసికంతో పాటూ ప్రస్తుత త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టులు భారీగా ప్రారంభించడంతో అమ్మకం కాని ఇళ్ల వాటా 22 శాతానికి చేరింది. వీటిని సైతం ఇన్వెంటరీలో ఎలా చేరుస్తారంటూ బిల్డర్లు అభ్యంతరం చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని