Ashada Masam: ఆషాఢం వచ్చేసింది.. ఈ ‘శూన్య మాసం’ ప్రత్యేకతలివే..!

ఆషాఢ మాసం (Ashada Masam).. కొత్తగా పెళ్లైయిన వధువు పుట్టింటికి వెళ్లే మాసం. ఈ నెలలో అత్తాకోడళ్లు ఒకేచోట ఉండకూడదని, భర్త కూడా అత్తారింట్లో......

Updated : 14 Mar 2023 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆషాఢ మాసం (Ashada Masam).. కొత్తగా పెళ్లైయిన వధువు పుట్టింటికి వెళ్లే మాసం. ఈ నెలలో అత్తాకోడళ్లు ఒకేచోట ఉండకూడదని, భర్త కూడా అత్తారింట్లో అడుగు పెట్టకూడదన్నది అనాదిగా వస్తోన్న ఆచారం. ఈ మాసంలో పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు.. ఇలా ఎలాంటి శుభకార్యాలేవీ చేయరు. అందుకే ఈ మాసాన్ని 'శూన్య మాసం' అని కూడా పిలుస్తారు.

ఆషాఢం విశిష్టత

జ్యోతిషశాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం. పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢమని పేరు. వర్షాల ప్రారంభానికి ఇది సంకేతం.  శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శయన ఏకాదశి, తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది. ఆషాఢం నుంచి మహా విష్ణువు యోగ నిద్రలో ఉండటంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చాతుర్మాస దీక్షలు.. ఆహార నియమాలు

ఆషాఢంలో విష్ణుభక్తులు చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు.  శుక్లపక్ష ఏకాదశి ప్రారంభం నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో శ్రీమహా విష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. కావున విష్ణుభక్తులు ఈ నాలుగు నెలల్లో చాతుర్మాస వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించేటప్పుడు ప్రతిఒక్కరూ ఆహార వ్యవహారాల్లో కొన్ని నియమాల్ని అనుసరిస్తారు. ఈ దీక్షలో ఒక్కో నెలలో ఒక్కో పదార్థాన్ని తినడం మానేస్తారు. ఆషాఢంలో ఆకుకూరలు, శ్రావణంలో పెరుగు, భాద్రపదంలో పాలు, ఆశ్వయుజం నుంచి కార్తీకం వరకు పప్పు దినుసులను ఆహారంలో తీసుకోరు. ఈ మాసం వానలు పడే కాలం కావడంతో ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా చేరతాయి గనక ఈ మాసంలో వాటిని తినడం ద్వారా విరేచనాలు వాంతులకు అవకాశం ఉంటుంది. ఇక శ్రావణ మాసంలో ఎక్కువగా పండుగలు, వ్రతాలు ఉండటం అనేక రుచుల మిళితమైన భోజనం ఉంటుంది గనక ఎసిడిటీని కలుగజేసే పెరుగును ఈ మాసంలో తీసుకోరు. ఇకపోతే, భాద్రపద మాసంలో పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో పాలకు దూరంగా ఉండటం ద్వారా ఆహార నియమాల విషయంలో పెద్దలు ఆరోగ్య సూత్రాన్ని మిళితం చేసి ఆధ్యాత్మికతను జోడించారు.

కొత్త జంటలు.. అందుకే దూరంగా..!

కొత్తగా పెళ్త్లెన జంటలు ఆషాఢంలో దూరంగా ఉండాలన్న సంప్రదాయం ఉంది. ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే.. 9 నెలల తర్వాత అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో (వేసవి కాలంలో) ప్రసవం జరుగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఈ వేడి ప్రభావం తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యం మీదా పడుతుంది. అందుకే భార్యాభర్తలను విడివిడిగా ఉంచేవారు. కొత్త కోడలిని పుట్టింటికి పంపించేవారు. అలాగే కొత్త అల్లుడు కూడా అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

గోరింట పండుతుంది..

ఆషాఢం  రాగానే చాలా మంది మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగునాట ఆచారం. గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గౌరి ఇంటి ఆకునే గోరింటాకుగా మన పురాణ కథలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలో అధిక వర్షాలతో నీటిలో మార్పులు చోటుచేసుకుంటాయి. క్రిములు, రోగాలు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారినపడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తోంది. గోరింటాకును మహిళలు పెట్టుకోవడం వల్ల గర్భాశయం, చర్మ సంబంధమైన సమస్యలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు, ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి. 

ముఖ్యమైన పండుగలివే..

  • ఈ మాసంలో వారాహి మాతను పూజించడం చాలా విశేషం. పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ సమయంలోనే జరుగుతుంది. ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు నవ దినోత్సవాలుగా రథయాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఈ కాలంలో వివిధ అలంకారాలతో మూర్తులను ఊరేగిస్తారు. పూరీ జగన్నాథుడిని ఆషాఢంలో దర్శించుకోవడం చాలా విశేషంగా భావిస్తారు.
  • ఆషాఢ శుద్ధ షష్ఠి/కంద షష్ఠి: ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తారు. ఉపవాసం ఉండి సుబ్రమణ్యుడిని ఆరాధించిన వారికి కుజ, కాల సర్పదోషాలు తొలగి దాంపత్య సౌఖ్యం కలుగుతుంది.
  • ఆషాఢ శుక్ల ఏకాదశి/శయన ఏకాదశి: మహా విష్ణువును పూజిస్తారు.
  • ఆషాఢ పౌర్ణమి/గురు పౌర్ణమి: ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు వేదవ్యాసుడు, శంకరాచార్యులతో పాటు మంత్రోపదేశం పొందిన గురువును పూజించి వారికి సత్కారం చేయవలెను. మనకు జ్ఞానం అందించిన వ్యాస మహర్షి, రుషులను తలచుకోవడం, పూజించడం, వారికి అర్జ్యములను వదిలిపెట్టడం వల్ల రుషి రుణం తీరుతుందని విశ్వసిస్తారు. గురువు అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు దక్షిణామూర్తిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు