పరమ భక్తుడు పురందరుడు

సంసార భవబంధాలు అనే సముద్రాన్ని దాటడానికి విఠలుని శరణు వేడటమే మార్గం అనుకున్నాడు భక్తాగ్రేసరుడు పురందరుడు.

Updated : 08 Feb 2024 00:39 IST

ఫిబ్రవరి 9 పురందరదాసు ఆరాధనోత్సవం

సంసార భవబంధాలు అనే సముద్రాన్ని దాటడానికి విఠలుని శరణు వేడటమే మార్గం అనుకున్నాడు భక్తాగ్రేసరుడు పురందరుడు. తంబూర మీటుతూ ఎన్నో గేయాలను రచించిన వాగ్గేయకారుడాయన. స్వానుభవాలతో కూడిన ఆ కీర్తనలు వేదాంత ప్రబోధకాలై అలరించాయి.

పుణే సమీపంలో 1470లో జన్మించిన పురందర దాసు అసలు పేరు శ్రీనివాసుడు. తండ్రి వరదప్ప. ఆయన వజ్రాల వ్యాపారి. తల్లిదండ్రులు వేంకటేశ్వర స్వామి భక్తులు. పుత్రుణ్ణి గారాబంగా పెంచుకున్నారు. సంస్కృతం, సంగీతం నేర్చుకున్న పురందరుడికి యుక్తవయసులో సుగుణాల రాశి సరస్వతీబాయితో పెళ్లయ్యింది. పరమ భక్తుడు, సంగీతజ్ఞుడిగా అజరామరంగా నిలిచిపోయిన పురందరుడిలో స్వతహాగా ఆధ్యాత్మిక చింతన లేదు. తండ్రి తదనంతరం వ్యాపార బాధ్యతలు తీసుకుని లాభాలు గడించాడు.

విఠలుడే యాచకుడిగా..

సంపదలు పెరుగుతున్నకొద్దీ పురందరునిలో కాఠిన్యం పెరిగింది. ‘పరమ పిసినారి’ అనేవారంతా. ఒకరోజు పుత్రుడి ఉపనయనానికి సాయం చేయమంటూ శ్రీనివాసుని వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ‘రేపు రా’ అన్నాడు శ్రీనివాసుడు. అతడు మర్నాటి నుంచీ రోజూ వచ్చి అర్థించేవాడు. శ్రీనివాసుడు ‘రేపు రా.. మాపురా..’ అనేవాడు. ఇక లాభంలేదని ఆ వ్యక్తి శ్రీనివాసుడి భార్య సరస్వతిని కలిసి సంగతి చెప్పాడు. ఆమె తన వజ్రపు ముక్కెరను తీసి అతనికిచ్చింది. అతడు దాన్ని శ్రీనివాసుడి వద్దకే అమ్మడానికి తీసుకెళ్లాడు. అది తన భార్యదేనని గ్రహించాడు. సేవకుణ్ణి ఇంటికి పంపి భార్య ముక్కెరను తెమ్మని పంపాడు శ్రీనివాసుడు. భర్త కాఠిన్యం తెలిసిన సరస్వతి చనిపోవాలని తలచి విషాన్ని చేతిలోకి తీసుకుంది. విషం స్థానంలో తన ముక్కెర ప్రత్యక్షమైంది. భగవంతుడి అనుగ్రహంగా భావించి దాన్ని భర్తకు పంపింది. ఆశ్చర్యపోయిన శ్రీనివాసుడు తక్షణం ఇంటికెళ్లాడు. పశ్చాత్తాపం చెంది, వచ్చిన వ్యక్తి కోసం వెతికించాడు. అలాంటివాళ్లెవరూ రాలేదనడంతో శ్రీనివాసునికి జ్ఞానోదయమైంది. వచ్చింది పుండరీక విఠలుడే అని గ్రహించాడు. అతడిలో అంతులేని మార్పు వచ్చింది. సర్వ సంపదలనూ దానధర్మాలకు వినియోగించాడు. ఆ సమయంలోనే తొలి కీర్తన రాశాడు. 30 సంవత్సరాలు భగవంతుడి పట్ల నమ్మకం లేక కాలం వృథా చేస్తూ ప్రాపంచిక సుఖాలకోసం పాకులాడినందుకు చింతించాడు. భార్య ద్వారా జ్ఞానోదయం అయిన తర్వాత తన సర్వస్వాన్నీ పేదలకు పంచిపెట్టాడు. కట్టుబట్టలతో వెళ్లి, వ్యాసరాయలను ఆశ్రయించాడు. ఇక నిరంతరం హరినామ జపమే. దేశం నలుమూలలా తిరుగుతూ ఎన్నో క్షేత్రాలు, తీర్థాలు సందర్శించాడు. తత్త్వబోధలతో సంకీర్తనలు ఆలపించాడు. సత్యధర్మ తీర్థులు శ్రీనివాసుడి పేరును పురందర దాసుగా మార్చారు.

స్వర్ణ పాత్రలు విసిరేశాడు..

హంపిలో నివసించే రోజుల్లో పురందరదాసు తాను రచించిన పదాలను గానంచేసేవాడు. పాత స్నేహితులైన భాగ్యవంతులు వారిని చూసేందుకు వచ్చేవారు. అలా ఒకరోజు కొందరు ధనికులు వచ్చారు. వాళ్లకి మర్యాద చేయడం కోసం పొరుగింటావిణ్ణి ఏ వస్తువునైనా బంగారంగా మార్చే పరుసవేది రాయిని అరువడిగి తెచ్చింది సరస్వతి. కొన్ని పాత్రలను బంగారు పాత్రలుగా మార్చి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో విందు ఏర్పాట్లు చేసింది. అది తెలిసిన పురందరుడు తమ ఇంటికి వచ్చే అతిథులు ఎవరైనా తన తాహతుకు తగిన ఆతిథ్యం పొందాలే కానీ వారి తాహతు కోసం సువర్ణ సృష్టి చేయనవసరం లేదన్నాడు భార్యతో. అంతేకాదు.. పరుసవేదితో సహా స్వర్ణ పాత్రలన్నీ పుష్కరిణిలో పడేశాడు.

నారదుడి అంశతో జన్మించాడు పురందరదాసు. ఆయన సంగీతాన్ని క్రమ పద్ధతిలో బోధించడానికి వీలుగా స్వరావళులు, అలంకారాలు, గీతాలు, కీర్తనలు, దేవరనామాలు రచించి కర్ణాటక సంగీత అభివృద్ధికి పునాదులు వేశాడు. అన్నమాచార్యుల తర్వాత పురందరదాసు ద్వారా వ్యాప్తి చెందిన సంకీర్తనా రచన త్యాగరాజ స్వామి నాటికి పరిపక్వ రూపం పొందింది. అందుకే పురందరుని ‘కర్ణాటక సంగీత పితామహుడు’ అని పిలుచుకుంటారు. పురాణాలు, ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని తన రచనల్లో దర్శింపచేశాడు.

పురందరదాసు తిరుమల వేంకటేశ్వరుని కూడా కీర్తించి తరించాడు. ఆయన శ్రీనివాసునిపై రచించిన ‘వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం..’ కీర్తన బహుళ జనాదరణ పొందింది. 95 ఏళ్ల వయసులో 1564లో కాలధర్మం చెందాడు. పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కన్నడ భాషలో రచనలు చేసి, కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపాడు. అన్నమాచార్యులను తన గురువుగా భావించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పురందరుని సంగీత సాహిత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. అలిపిరిలో ఆ మహనీయుని విగ్రహం నెలకొల్పారు.

ఉషా కామేష్‌ డొక్కా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని