నిత్య నూతనం.. వరాహ నరహరి రూపం

లోకంలో ఏ గుడిని దర్శించినా మూల విరాట్టు ఏడాదంతా ఒకే రూపంలో దర్శనమిస్తుంది. ఆహార్యంలో వ్యత్యాసాలుంటాయి కానీ ఆకారంలో భేదాలుండవు. సింహాచలంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి ఇందుకు భిన్నం.

Published : 20 Apr 2023 00:42 IST

లోకంలో ఏ గుడిని దర్శించినా మూల విరాట్టు ఏడాదంతా ఒకే రూపంలో దర్శనమిస్తుంది. ఆహార్యంలో వ్యత్యాసాలుంటాయి కానీ ఆకారంలో భేదాలుండవు. సింహాచలంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి ఇందుకు భిన్నం.  ఏడాదిలో 364 రోజులు సుగంధ పరిమళ చందనంలో కొలువై ఉండే సింహాద్రి అప్పన్న వైశాఖ శుద్ధ తదియ అయిన అక్షయ తృతీయనాడు మాత్రం చందన ఆచ్ఛాదనాన్ని వీడి నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ రోజు వామనుడిని తలపించేలా ఉన్న వరాహ నరహరిని దర్శించుకున్న భక్తజనం తన్మయం చెందుతారు. అదేరోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామిని తిరిగి చందనంతో అలంకరిస్తారు. తొలి విడత చందన సమర్పణంతో స్వామి గుమ్మడిపండు ఆకారంలో కనిపిస్తాడు. దీన్నే ‘గుమ్మడిపండు దర్శనం’ అంటూ కీర్తిస్తారు. అనంతరం వైశాఖ పౌర్ణమినాడు రెండో విడతగా మూడు మణుగుల (సుమారు 120కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు. దీంతో స్వామి రూపం ద్విగుణీకృతమవుతుంది. దీని తర్వాత జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో రెండు విడతలుగా సుగంధ భరిత శ్రీగంధాన్ని ఆచ్ఛాదన చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు కరాళ చందనం అలంకరణతో చందన సమర్పణ పరిసమాప్తమవుతుంది. అంటే ప్రహ్లాద మందిరంలో కొలువైన అప్పన్నస్వామి చందనోత్సవాన్ని మొదలుకొని శ్రావణ పౌర్ణమి వరకు చందన లేపనంతో శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతాడు. ఇలా ఏడాదిలో నాలుగు మాసాలు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం నిజరూపంలో కనిపించడం ఇక్కడి విశిష్టత. కరాళ చందన సమర్పణ తర్వాత సంపూర్ణ నిత్య రూపంలోకి వచ్చిన స్వామికి ప్రతి గురువారం బంగారు శాంత నృసింహస్వామి కవచాన్ని అలంకరిస్తారు. మళ్లీ నిజరూప దర్శనం వరకు ఇది కొనసాగుతుంది. విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్న సింహాచలం క్షేత్రంలో ఏప్రిల్‌ 23న నిర్వహించే చందనోత్సవం తిలకించి భక్తులు పులకించనున్నారు.

అల్లు శ్రీధర్‌, న్యూస్‌టుడే, సింహాచలం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు