పర్యటన.. పారమార్థికత!

యోగుల్లో రెండు రకాలుంటారనేవారు రామకృష్ణ పరమహంస. మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం దేశం నలుమూలలా పర్యటించే యోగుల్ని ‘బహూదక’ వర్గానికి చెందిన యోగులని, ఒకే ప్రదేశంలో ఉంటూ మానసిక ప్రశాంతత, పారమార్థిక పురోగతి కోసం సాధనలు చేసేవారు ‘కుటీచక’ వర్గానికి చెందినవారని ఉద్ఘాటించేవారు.

Published : 21 Sep 2023 00:22 IST

యోగుల్లో రెండు రకాలుంటారనేవారు రామకృష్ణ పరమహంస. మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం దేశం నలుమూలలా పర్యటించే యోగుల్ని ‘బహూదక’ వర్గానికి చెందిన యోగులని, ఒకే ప్రదేశంలో ఉంటూ మానసిక ప్రశాంతత, పారమార్థిక పురోగతి కోసం సాధనలు చేసేవారు ‘కుటీచక’ వర్గానికి చెందినవారని ఉద్ఘాటించేవారు. ప్రతి సాధకుడూ మొదట బహూదకుడు అయ్యాకే కుటీచకుడుగా మారతాడనేవారు. ఆధ్యాత్మిక సాధనల్లో భాగంగా తాను సైతం కాశీ, బృందావనం తదితర పుణ్యక్షేత్రాల్లో పర్యటించారు. ఆయా దేవాలయాల్ని సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందారు. ‘పవిత్రక్షేత్రాల్లో తప్పక భగవదుద్దీపన కలుగుతుంది. అప్పుడప్పుడూ ఆ తీర్థాల్లో పర్యటించటం ఆధ్యాత్మిక స్ఫూర్తినిస్తుంది’ అని శిష్యులు, గృహస్థ భక్తులకు సూచించేవారు.
స్వామి వివేకానంద జీవనప్రస్థానంలో పర్యటనల ఘట్టం స్ఫూర్తిమంతమైంది. భారతావని ఔన్నత్యంపై అవగాహనకు ఆసేతు హిమాచలం అకుంఠిత దీక్షతో సంచరించి స్వామీజీ మహోన్నత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పశ్చిమదేశాల్లో పర్యటించి ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా పరిణమించటం జగమెరిగిన సత్యం.


సంచారంలో సాహితీమూర్తులు

బావిలో కప్పలా బతుకును సంకుచితం చేసుకోకుండా, విశాల ప్రపంచంలో విహరించటం జీవనశైలిలో భాగమైతే, మానసిక వికాసంతో పాటు మనసులో అలజడులూ సద్దుమణుగుతాయి. జ్ఞానమూ ఆర్జించవచ్చు- అనటానికి ఆ రంగంలో విశేషకృషి చేసిన సాహితీ మూర్తులే సాక్ష్యం. పర్యటనలు చేసి ఏనుగుల వీరాస్వామి ‘కాశీయాత్ర చరిత్ర’, తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పా దాక’ యాత్రా గ్రంథాలు వెలువరించారు. జిజ్ఞాస, సత్యాన్వేషణలతో తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యానికి ఎనలేని సేవచేశారు.


పర్యటిస్తే పరిణతి..

యస్తు సంచరతే దేశాన్‌ యస్తు సేవేత పండితాన్‌
తస్య విస్తారితా బుద్ధిః తైల బిందు రివాంభసి

ఎక్కువ ప్రదేశాలు సంచరించి, పండితులను సేవించేవారి బుద్ధి నీళ్లలో పడిన నూనెచుక్కలా విస్తరిస్తుంది- అంటుంది మన సనాతన ధర్మం. గౌతమ బుద్ధుడు గయలో జ్ఞానోదయమయ్యాక పరివ్రాజకులుగానే బౌద్ధధర్మాన్ని ప్రబోధించారు. అసంఖ్యాకమైన అభిమానుల ఆదరణను చూరగొని, ఎందరినో బౌద్ధసన్యాసులుగా మార్చారు. సుందర స్థలాలను దర్శించి ఆనందించటం నేర్చుకుంటే ప్రాపంచిక సమస్యల బరువులు చాలా తేలికవుతాయి. కేవలం భౌతిక ప్రయోజనాలకే విలువనిస్తూ, సుందర అనుభూతులకు దూరమైతే.. నిరాశతో, ఆందోళనతో కుంగిపోయే అవకాశముంది. విశ్వకవి రవీంద్రుడు తన పర్యటన అనుభూతిని తలచుకుంటూ ‘చిన్నప్పుడు ఒకసారి నాన్నతో గంగానదిపై గూటి పడవలో ప్రయాణించటం మరపురాని జ్ఞాపకం. నాన్న, నేను పడవలో ఎంతో దూరం ప్రయాణించే వాళ్లం. మాతో పుస్తకాలు కూడా వెంట తీసుకు వెళ్లేవాళ్లం. అలా నాన్న జయదేవుని ‘గీతగోవిందమ్‌’ పరిచయం చేశారు. అలాగే తొలిసారి నాన్నతో హిమాలయాల దర్శనం కూడా గొప్ప అనుభూతి. యాత్రలు, పర్యటనల్ని ఎలా మధురస్మృతులుగా మలచుకోవాలో అప్పుడే తెలుసుకున్నాను’ అన్నారు. ఇంగ్లండ్‌కి చెందిన పాల్‌ బ్రంటన్‌ ఆధ్యాత్మిక యాత్రికుడు. పాత్రికేయ వృత్తిని వదిలేసి ప్రాచ్య, పాశ్చాత్య దేశాలు పర్యటించారు. భారత్‌లో ఎందరో యోగులు, సన్యాసులను కలిసి.. నిగూఢ ఆధ్యాత్మిక సత్యాలను ఆకళింపు చేసుకున్నారు. అరుణాచలంలో రమణమహర్షి సన్నిధిలో తన సత్యాన్వేషణకు ముగింపు పలికారు.

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని