Fact Check: ఓలా రెస్ట్‌ రూమ్స్‌ వీడియో మీకూ వచ్చిందా? నిజమెంత?

Ola Restrooms: ఓలా రెస్ట్‌ రూమ్స్‌ అంటూ ఓ వీడియో తెగ సర్క్యులేట్‌ అవుతోంది. బుక్‌ చేసుకుంటే మీ చెంతకే మొబైల్‌ రెస్ట్‌రూమ్‌ తీసుకొస్తారన్నది దాని సారాంశం. మరి ఇందులో నిజమెంత?

Updated : 11 Jan 2023 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్యాబ్‌ సేవల సంస్థ ఓలాకు (Ola) సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ ఫార్వర్డ్‌ అవుతోంది. ఓలా కంపెనీ నుంచి త్వరలో ‘ఓలా రెస్ట్‌రూమ్స్‌’ (Ola Restrooms) పేరిట కొత్త సేవలు తీసుకురాబోతున్నది అనేది ఆ వీడియో సారాంశం. ఈ ఆధునిక యుగంలో ఇవీ సాధ్యమే కాబోలు అనుకుంటూ ఆ వీడియోను చాలా మంది తెలిసిన వారితో పంచుకుంటున్నారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అలా ఈ వీడియో మీకూ వచ్చిందా? మరి దీంట్లో నిజమెంత? 

‘ఓలా రెస్ట్‌రూమ్స్‌ని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఇందులో అనేక సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఉన్న చోటు నుంచే దీన్ని బుక్‌ చేసుకోవచ్చు’ అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీంతో ప్రజలు ఇది నిజమేనేమోనని అనుకుంటున్నారు. అయితే ఈ వీడియో ఓలానే విడుదల చేసింది. కాకపోతే ఇప్పుడు కాదు. నాలుగేళ్ల క్రితం నాటిది. 2019 మార్చి 29న ఈ వీడియోను ఓలా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకుంది. తర్వాత ఏప్రిల్‌ 1న ఇది నిజం కాదని అదే కంపెనీ పేర్కొంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వాలని సూచించింది. దీంతో ప్రాంక్‌లో భాగంగా ఈ వీడియోను విడుదల చేసినట్లు తేలింది. అప్పట్లో ఈ వీడియోను పెద్దగా ఎవరూ చూడలేదు. అయితే, అదే వీడియో ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. ఇదీ అసలు విషయం.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని