Twin sisters marriage: ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెల్లెళ్లు.. వరుడిపై కేసు నమోదు!

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కవలలైన అక్కాచెల్లెళ్లు(twin sisters wedding) ఒకే కల్యాణ వేదికపై ఒకే వ్యక్తిని పెళ్లాడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

Updated : 04 Dec 2022 18:52 IST

సోలాపూర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కవలలైన అక్కాచెల్లెళ్లు ఒకే కల్యాణ వేదికపై ఒకే వ్యక్తిని పెళ్లాడిన((twin sisters wedding) ఘటన చర్చనీయాంశంగా మారింది. వీరి పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వరుడిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పింకీ, రింకీ అనే కవలలు ముంబయిలోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తుండగా.. వరుడు అతుల్‌  ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతున్నట్టు సమాచారం. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలూ అంగీకరించడంతో శుక్రవారం వివాహం వైభవంగా జరిగింది. 

కొద్ది రోజుల క్రితం పింకీ, రింకీల తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా.. వారిద్దరూ తల్లితోనే ఉంటున్నారు. అయితే, ఇటీవల తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఈ సోదరీమణులిద్దరూ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అతుల్‌ కారును ఉపయోగించారు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.  చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన ఈ ట్విన్స్‌.. పెళ్లయ్యాక కూడా ఒకే ఇంటికి వెళ్లాలనుకున్నారు. దీంతో అతుల్‌తో పెళ్లికి వారు ఇష్టపడటం, కుటుంబాలూ అంగీకరించడంతో శుక్రవారం వీరి పెళ్లి వేడుక వైభవంగా జరింది. ఈ సందర్భంగా వరుడిపై ఈ సోదరీమణులిద్దరూ పూలదండలు వేసేందుకు పోటీపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ పెళ్లి చట్టబద్ధత, నైతికత గురించి పలువురు కామెంట్లు చేస్తున్నారు. అతుల్‌ అనే వ్యక్తి  కవల సోదరిలను పెళ్లి చేసుకున్నట్టుగా తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా వరుడిపై అక్లూజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 494ప్రకారం అతడిపై నాన్‌ కాగ్నిజబుల్‌ నేరం కింద కేసు నమోదైందన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు