Viral video: అడ్డడ్డే..! నూడుల్స్‌తో పాటూ గడ్డకట్టిపోయాడే..!

మంచు ప్రాంతంలో వేడి వేడి నూడుల్స్‌ తిందామని వెళ్లిన తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తినడం మాట అటుంచితే.. నూడుల్స్‌తో పాటు ఆ వ్యక్తి సైతం చలికి గడ్డకట్టుకుపోయాడు.

Published : 08 Jan 2023 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వర్షం పడుతుంటేనో... చల్ల గాలి వీస్తుంటేనో.. వేడివేడి పకోడి, మిర్చిబజ్జీని తినాలని దాదాపు అందరూ కోరుకుంటారు. చల్లదనాన్ని ఆస్వాదిస్తూ కనీసం ఓ టీ తాగినా మనసు గాల్లో తేలినట్లనిపిస్తుంది. అచ్చం అలాంటి అనుభూతిని పొందాలనుకున్నాడో వ్యక్తి. మంచు కురుస్తున్న ప్రదేశానికి వెళ్లి వేడివేడి నూడుల్స్‌ (జపనీస్‌ రామెన్‌) తినాలనుకున్నాడు. పొగలుకక్కుతున్న ఆ పదార్థాన్ని తీసుకొని తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తరవాత తనకు ఎదురైన అనుభూతిని వీడియో తీసి తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. అంతే ఆ వీడియో కాస్త వైరల్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?

జేక్ ఫిషర్‌ అనే వ్యక్తి స్వెటర్‌ ధరించి ప్రకృతిని ఆస్వాదిస్తూ పొగలుకక్కుతున్న నూడుల్స్‌ను తిందామనుకున్నాడు. ఆరు బయట తింటే ఇంకా బాగుంటుందని దాన్ని తీసుకొని ఇంటి బయటకు వెళ్లాడు. తీరా ఆ నూడుల్స్‌ని స్పూన్‌తో పట్టుకొని తినటానికి పైకెత్తగానే అవి అలాగే గాల్లో గడ్డకట్టపోయాయి. సెకన్ల వ్యవధిలోనే స్పూన్‌తోపాటు కదలకుండా గాల్లో ఉండిపోయాయి. నూడుల్స్‌తో పాటు వాటిని పట్టుకున్న జేక్‌ జుట్టు, గడ్డం సైతం గడ్డకట్టుకుపోయింది. దీన్నంతా జేక్‌ తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘నేనైతే ఆయన తింటున్న పదార్థంకంటే ఆయన గడ్డాన్నే ఎక్కువగా పరిశీలించాను’ అని ఓ వ్యక్తి కామెంట్‌ పెట్టాడు. ‘అట్టుంటాది కెనడాతోనీ’ అంటూ మరో వ్యక్తి కామెంట్‌ చేశాడు. ‘అంత మంచు కురుస్తుందని తెలిసీ నిన్నెవడు బయటకెళ్లమన్నాడు?’ అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. అయితే, గతేడాది ఇలానే ఓ వ్యక్తి చేసిన వీడియో చూసి తాను స్ఫూర్తి పొందినట్లు జేక్‌ చెప్పుకొచ్చాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని