కెమెరాతో కరోనాలక్షణాల్ని పట్టేస్తాం!

కరోనా వ్యాప్తిని ఎలాగైనా అడ్డుకోవాలి.. అందుకు లాక్‌డౌన్‌లు.. రెడ్‌జోన్లు.. కంటి మీద కనుకు లేకుండా డాక్టర్లు, నర్సులు, పోలీసులు..

Published : 11 Apr 2020 00:43 IST

ఎంఐటీ విద్యార్థుల వినూత్న ఆలోచన

థింక్‌ డిఫరెంట్‌

కరోనా వ్యాప్తిని ఎలాగైనా అడ్డుకోవాలి.. అందుకు లాక్‌డౌన్‌లు.. రెడ్‌జోన్లు.. కంటి మీద కనుకు లేకుండా డాక్టర్లు, నర్సులు, పోలీసులు.. మరెన్నో విభాగాలు పని చేస్తున్నాయి. అయినా.. అంతు చిక్కని కరోనా రోజు రోజుకీ కాటేస్తూ వెళ్తోంది. ఆసుపత్రుల ముందు వందల్లో.. వేలల్లో అనుమానితులు.. ఎవరికి ఎలాంటి చికిత్స ఇవ్వాలో తెలియని పరిస్థితి.. ఇలాంటి గడ్డు పరిస్థితులకు స్మార్ట్‌గా చెక్‌ పెట్టేందుకు భిన్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు ఎంఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు. అమెరికాలోని మసాచ్యుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన ‘బీట్‌ ది పాన్‌డెమిక్‌’ హ్యాకథాన్‌లో వీరి ఆలోచన మొదటి వరుసలో నిలిచింది. మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (ఎంఐటీ) ఇంజినీరింగ్‌ చదువుతున్న వారి పేర్లు అక్షతా కామత్‌, శుభమ్‌ రాటెరియా, అద్రి రాజారామన్‌.

75 దేశాలతో పోటీ..

ప్రపంచవ్యాప్తంగా 1500 మంది 75 దేశాల నుంచి కొవిడ్‌-19 హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. 250 మంది మెంటర్స్‌ కూడా ఉన్నారు. ఎక్కడి వారు అక్కడ ఉండి వర్చువల్‌గా నిర్వహించిన హ్యాకథాన్‌లో అందరి లక్ష్యం ఒక్కటే. కరోనాని కట్టడి చేయడమే. రెండు సెక్షన్‌లుగా జరిగిన ఈవెంట్‌లో రెండే ప్రధాన అంశాలు. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం... అలాగే, రోగులకు అందించే చికిత్సని మరింత బలోపేతం చేయడం. హ్యాకథాన్‌లో పాల్గొన్న బృందాలన్ని పంచుకున్న ఆలోచనల్లో ఎంఐటీ విద్యార్థుల ఐడియాకే విజయం దక్కింది. ప్రాథమిక దశలోనే ‘ఎవరికి, ఎప్పుడు పరీక్షలు చేయాలి?’ (హు టు టెస్ట్‌ అండ్‌ వెన్‌) అనే టెలీహెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ వీరిది. కరోనా అనుమానితుల్ని డిజిటల్‌గా గుర్తించే వ్యవస్థే ఈ టెలీహెల్త్‌ ప్లాట్‌ఫామ్‌. దీంతో అవసరం లేకుండా హాస్పటళ్లలో వచ్చి చేరుతున్న వారి సంఖ్యని తగ్గించొచ్చని ఈ విద్యార్థుల బృందం అభిప్రాయం.

కెమెరా కన్ను చాలు..

వ్యాధి లక్షణాల ఆధారంగా ఎక్కడి వారిని అక్కడ గుర్తించడమే ఈ టెలీహెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ లక్ష్యం. ఉదాహరణకు ఇంట్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా అనుమానం వస్తే టెలీహెల్త్‌ని సంప్రదించొచ్ఛు ఫోన్‌ కెమెరా లేదా వెబ్‌ కెమెరాతో వ్యాధి లక్షణాల్ని గమనించి ఓ అంచనాకి రావొచ్చనేది విద్యార్థి బృందం ప్రతిపాదన. ప్రస్తుతం వాషింగ్టన్‌ డీసీకి చెందిన శ్వాసకోశ వ్యాధి నిపుణులైన మెలియా వాట్సన్‌, ఇతర నిపుణులతో జట్టు కట్టి టెలీహెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ని మెరుగుపరిచేందుకు సిద్ధం అవుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని