అంతలోనే దూరమై..

ఒకరికి ఒకరు ఎందుకు స్నేహితులవుతారో? ఎప్పుడవుతారో? ఎలా అవుతారో? చెప్పలేం. అలాగే రామ్‌తో నా పరిచయం. బీఎడ్‌ పరీక్షలు జరుగుతున్న సమయంలో హాల్‌లోనే అతను తారసపడ్డాడు. అతని చెరగని...

Published : 13 Oct 2018 15:31 IST

అంతలోనే దూరమై..

ఒకరికి ఒకరు ఎందుకు స్నేహితులవుతారో? ఎప్పుడవుతారో? ఎలా అవుతారో? చెప్పలేం. అలాగే రామ్‌తో నా పరిచయం. బీఎడ్‌ పరీక్షలు జరుగుతున్న సమయంలో హాల్‌లోనే అతను తారసపడ్డాడు. అతని చెరగని చిరునవ్వు, ఏకాగ్రత నాకు నచ్చాయి. తనని ‘గురూ’ అంటూ సంబోధించేదాన్ని. వారం రోజులూ అతని కోసమే ఎదురుచూపులు. పరీక్ష రాస్తూ... అతనివైపు ఎన్నిసార్లు చూశానో... నాకే గుర్తులేదు. పరీక్షకు ముందు అన్ని జాగ్రత్తలూ చెప్పేవాడు. మార్కులు బాగా రావాలంటే.. ఎలా రాయాలో వివరించేవాడు. నా చొరవను ఆయన గుర్తించారనిపించింది. అయితే.. చివరి రోజు ఎలాంటి ఫీలింగ్‌ లేకుండా వెళ్లిపోయాడు. నాకు కొంచెం బాధగా అన్పించింది. నేనైతే ఆయన పేరు తెలుసుకోగలిగాను. తర్వాత నా ఫ్రెండ్‌ ద్వారా తెలిసిందేమిటంటే... అతను నా ఫోన్‌ నంబరు తీసుకున్నారని. రెక్కలొచ్చి నా మనసు వసంతంలోకి ఎగిరి పోయిందనిపించింది. ఎన్నిసార్లు ఫోన్‌ చెక్‌ చేసుకున్నానో... ఎక్కడి నుంచి మిస్డ్‌ కాల్‌ వచ్చినా తిరిగి చేశాను... ఫలితం లేకపోయింది. ఇంతలో నేను విజయనగరంలో డీఎస్సీ కోచింగ్‌కు చేరా. అదే కోచింగ్‌లో అతనూ. చూడగానే చాలా సంతోషమనిపించింది. దగ్గరికెళ్లి పలకరించాను. బాగా మాట్లాడారు. మూడు నెలలు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఎంత సరదాగా మాట్లాడేవాడో. సబ్జెక్టులో అనుమానాలు నివృత్తి చేసేవారు. ఏ పుస్తకాలు చదివితే ఎంత ప్రయోజనం ఉంటుందో చెప్పేవాడు. ఒత్తిడికి గురైనప్పుడు హాయిగా నవ్వించి నన్ను తేలికపరిచేవాడు. మంచి స్నేహితుడిలా నన్ను ప్రోత్సహించాడు. కోచింగ్‌ సెంటర్లో తప్ప మేం ఇంక ఎక్కడా బయట కలిసింది లేదు. మా మధ్య ఏదో బలమైన బంధం ఏర్పడిందనిపించింది. ఒక్కరోజు తను రాకపోయినా... నాకు తోచేది కాదు.

అంతలోనే దూరమై.. చెప్పే క్లాస్‌ చెవికెక్కేది కాదు. 2018 ఫిబ్రవరి నుంచి అతను కోచింగ్‌కు రాలేదు. నా మైండ్‌ పనిచేయడమే మానేసింది. నేను ఫోన్‌ చేశాను. సమాధానం లేదు. ఒకసారి ‘నీతో మాట్లాడుతుంటే... నేను డిస్ట్రబ్‌ అవుతున్నాను.’ అని ఫోన్‌ కట్‌ చేశాడు. తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నా స్నేహితురాలితో ఫోన్‌ చేయించాను. ‘ఏం సార్‌ కోచింగ్‌కు రావడం లేదు’ అని తను అడగగానే... ‘శ్రావ్య చేయమందా?’ అన్నాడు. ‘ఎందుకు సర్‌ అలా అంటున్నారు... నేనే చేశాను’ అంది నా ఫ్రెండ్‌. అప్పుడు ‘నాగురించి అక్కడ ఆలోచించేది ఒక్కరే.. శ్రావ్య’ అని ఫోన్‌ పెట్టేశాడు. నేను కాల్‌ చేస్తే మాత్రం లిఫ్ట్‌ చేయడం లేదు. ఈ ఎనిమిది నెలలు నాలో నేను లేను. నాలా నేను ఉండలేకపోతున్నా. అతనే...అతనే...అతనే... గుర్తొస్తున్నాడు. ఒకవేళ అతను నన్ను ప్రేమిస్తున్నాడా? అలా అయితే ధైర్యంగా చెప్పవచ్చు కదా! స్నేహమే అయితే మామూలుగానే ఉండొచ్చు కదా! ఎంతో ఆత్మీయుడిలా అన్పించి... ఇంతలో దూరం పెడితే ఎలా? నా మనసు విలవిలలాడిపోతోంది. గురూ ఇది మంచిది కాదు. నాతో మాట్లాడు. సమస్యేంటో చెప్పు. నిజంగా నేను మీకు ఇబ్బందిగా మారుతున్నానని అనిపిస్తే... ఇంకెప్పుడూ మీకు కన్పించను.

- శ్రావ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని