Published : 20 Aug 2022 01:07 IST

నలుగురికీ నచ్చినదీ..మాకసలే నచ్చదురో!

* హోటళ్లు నేల మీదే కట్టాలా? భూమి, ఆకాశం మధ్యలో.. చెట్లపై ఎందుకు నిర్మించకూడదు? అనుకున్నాడు రాహుల్‌. దాన్ని చేతల్లో పెట్టి విజయం సాధించాడు.
* సైకిల్‌పై భారత్‌యాత్ర చేశాడు రంజిత్‌. స్నేహితుడో, ప్రేమికురాలితోనో కాదు.. పెంపుడు శునకంతో. వార్తల్లో నిలిచాడు.
* చదువైపోగానే కొలువులో కుదురుకోవాలనుకోలేదు అభిరాం రెడ్డి. ఆలస్యమైనా ఫరవాలేదు..  శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. అనుకున్నది సాధించి రూ.2 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. భిన్నదారిలో వెళ్లి, విజేతలుగా నిలిచిన ఈ స్ఫూర్తివీరులు తమ ప్రయాణాన్ని ‘ఈతరం’తో పంచుకున్నారు.


రూ.2 కోట్ల వేతనంతో పట్టం..

అయితే ఐటీ ఉద్యోగం.. లేదంటే సర్కారీ నౌకరీ.. పాతిక దాటకముందే వయసుకి మించి జీతం సాధించాలనేది ఈనాటి యువత పంతం. వీళ్లకి భిన్నంగా పరిశోధనల బాట పట్టాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతమీ    నగరానికి చెందిన ఏనుగు అభిరాం రెడ్డి. ఆ ప్రతిభని పలు అవార్డులు వరించడమే కాదు ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు.

అభిరాం నాన్న ఓ భారజల సంస్థలోని కెమికల్‌ ల్యాబ్‌లో పని చేసేవారు. సొంతంగా పరిశోధనలూ చేశారు. ఆ ప్రభావంతో అభిరాంకి సైన్స్‌పై మమకారం మొదలైంది. తను చదువులో మొదట్నుంచీ మెరిటే. జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో ర్యాంకు రావడంతో భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌లో ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌తో ప్రవేశం దక్కింది. అక్కడే ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ ఫిజిక్స్‌ కోర్సు చదివాడు. మరోవైపు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ సైన్సెస్‌, చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాడు. ఈ కోర్సులు అతడి ఆలోచనలకు మరింత పదును పెట్టాయి. పరిశోధక శాస్త్రవేత్త కావాలని దిశా నిర్దేశం చేశాయి. ఆపై అమెరికా వెళ్లి మసాచ్యుసెట్స్‌లోని ఇంజినీరింగ్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీలో పాలిమర్స్‌పై పీహెచ్‌డీ పూర్తి చేశాడు. తర్వాత నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్శిటీలోని మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ పొందాడు. ఈ సమయంలోనే ప్రతిష్ఠాత్మక ఫ్రాంక్‌ జె.పాడెన్‌ అవార్డు ఫైనలిస్టుగా నిలిచాడు. నానోస్కేల్‌ వద్ద పాలిమర్స్‌ సంక్లిష్ట ఆకారాల్లోకి ఎలా వ్యవస్థీకృతమవుతాయనే దానిపై అభిరాం పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధన.. కొత్త పాలిమర్‌ల ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడే అవకాశం ఉందంటున్నాడు. ఈ కృషికి గుర్తింపుగా 2021లో అమెరికన్‌ ఫిజికల్‌ సొసైటీ నుంచి పాలిమర్‌ ఫిజిక్స్‌ అవార్డు అందుకున్నాడు. అభిరాం పరిశోధక వ్యాసాలు ప్రతిష్ఠాత్మక సైన్స్‌ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. మొన్నటివరకూ ఓ సెమీ కండక్టర్‌ కంపెనీలో రీసెర్చ్‌ సైంటిస్టుగా పని చేసిన అభిరాం.. తాజాగా రూ.2 కోట్ల జీతంతో ‘ఇంటెల్‌’ సంస్థలో పరిశోధక శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు.

-వి.చంద్రశేఖరరావు, అశ్వాపురం


శునకమే నేస్తం..

స్నేహితులతో, ఒంటరిగా లేదా నచ్చినవాళ్లతో కలిసి యువత లాంగ్‌టూర్లకు వెళ్లడం ఈరోజుల్లో సహజం. వరంగల్‌ జిల్లా గిర్మాజీపేట కుర్రాడు రంజిత్‌కుమార్‌ వెరైటీగా తన పెంపుడు శునకంతో వెళ్లి దేశం చుట్టొచ్చాడు.

దేశవ్యాప్తంగా పర్యటించాలనేది రంజిత్‌ తండ్రి ఆశ. ఆ కోరిక తీరకుండానే కరోనాతో చనిపోయారు. నాన్న ఆశయం నెరవేర్చాలనుకున్నాడు రంజిత్‌. పర్యావరణానికి హాని కలిగించొద్దనే ఉద్దేశంతో మోటార్‌సైకిల్‌కి బదులు సైకిల్‌ని ఎంచుకున్నాడు. మొదటిసారి వరంగల్‌ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్‌ యాత్ర’ను పూర్తి చేసి, పేదలకు సేవ చేస్తున్న సినీ నటుడు సోనూసూద్‌కు అంకితమిచ్చాడు. రెండోసారి వరంగల్‌ నుంచి లద్దాక్‌ వరకు వెళ్లాడు. మూడోసారి హైదరాబాద్‌ నుంచి చైనా సరిహద్దు వరకు వెళ్లొచ్చాడు. ఈ ప్రయాణంలో తనకు తోడుగా తన పెంపుడు కుక్క భగీరాతో కలిసి ప్రయాణం చేశాడు. రాత్రివేళలో రోడ్డు పక్కన పెట్రోలు బంకులు, పాఠశాలలు, ఆలయాల్లో విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగేవాడు. మూడో విడతలో పర్యావరణం, వన్యప్రాణులు, జంతువుల సంరక్షణపై ప్రచారం చేయాలనుకున్నాడు. ఇది ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతో భగీరాని తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే జంతు ప్రేమికులను అలరించిన ‘777 చార్లీ’ చిత్రం సైతం తనకు స్ఫూర్తిగా నిలిచిందంటాడు రంజిత్‌. ఆంధ్ర, ఒడిశా, అస్సాం, మేఘాలయ, పశ్చిమ్‌బంగా, సిక్కిం మీదుగా నాథులాపాస్‌ వద్ద చైనా సరిహద్దును నాలుగు నెలల కాలంలో చేరుకున్నాడు. ఈ యాత్రలో ఎన్నో అనుభవాలు. కర్ణాటకలో ఒకచోట ముగ్గురు యువకులు సాయం చేస్తామని నమ్మించి సైకిల్‌తో పాటు ఇతర సామగ్రిని అపహరించారు. ‘చారాలాచ్‌లా’ వద్ద కొండ చరియలు విరిగి పడటంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. వెంట తీసుకెళ్లిన గ్యాస్‌ స్టౌ వెలిగించి మంచుగడ్డలు కరిగించుకుంటూ నీళ్లు తాగుతూ, రాత్రంతా గడిపి బయటపడ్డాడు. అత్యంత ఎత్తైన ‘ఖార్దూంగ్లా’కు చేరినప్పుడు తనే ఏకైక సైక్లిస్ట్‌. ఈ అనుభవాలన్నీ ‘రంజిత్‌ ఆన్‌ హీల్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

- బోగెం శ్రీనివాసులు, కడప


చెట్లకు డబ్బు కాయిస్తున్నాడు

‘డబ్బేమైనా చెట్లకు కాస్తుందా..’ అని సరదాగానో, వృథా ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతోనో అంటుంటారు. నిర్మల్‌ యువకుడు కొప్పుల రాహుల్‌ మాత్రం దాన్నే నిజం చేసి చూపిస్తున్నాడు. విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.
చదువైపోగానే మిత్రుడితో కలిసి ఓ స్టార్టప్‌ ప్రారంభించాడు రాహుల్‌. ఎనిమిది నెలలయ్యాక అందులోంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత దుస్తుల వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లైనా అదీ కలిసి రాలేదు. అయినా కుంగిపోకుండా సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. కొత్త ప్రదేశాలు సందర్శించడం, అక్కడి విశేషాలు తెలుసుకోవడమంటే రాహుల్‌కి ముందునుంచీ ఆసక్తి. ఈ క్రమంలో 2018లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘జిభీ’ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి పచ్చదనం, ప్రకృతి అందాలు, సరస్సులు, జలపాతాలు అతడిని మైమరిపించాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వందేళ్లకు పైన వయసున్న వృక్షాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇన్ని సానుకూల అంశాలున్నా హోటళ్లు, కాటేజీలేవీ అక్కడ అందుబాటులో లేవు. తనే ఓ హోటల్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించాడు. అదీ అందరినీ ఆకట్టుకునేలా కొత్తగా ఉండాలనుకున్నాడు. కొంతకాలం పరిశోధన చేసి, స్థానిక కళాకారులతో మాట్లాడిన తర్వాత భారీ వృక్షాలపై గదులు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాడు. స్థానికుల నుంచి స్థలం లీజుకు తీసుకొని, అక్కడి అడవుల్లో లభించే దియోదార్‌ సెడర్‌ అనే చెట్టు కాండాలను ఉపయోగించి ‘ది హిడెన్‌ బర్రో’ పేరుతో ఒక చెట్టుపై హోటల్‌ సిద్ధం చేశాడు. మంచి రుచులతో రెస్టరెంట్‌ సహా.. అన్నిరకాల వసతులు కల్పించాడు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. కింద భూమి, పైన ఆకాశం, చుట్టూ పచ్చని చెట్లు.. నేరుగా ప్రకృతి ఒడిలో ఉన్నామన్న ఫీలింగ్‌. పర్యాటకులు పరవశించిపోయారు. అప్పటివరకూ సిమ్లా, కులూలకే పరిమితమైన పర్యాటకులు జిభీకి వరుస కట్టారు. మూడు, నాలుగు నెలల ముందు బుక్‌ చేసుకుంటే తప్ప గది దొరకని పరిస్థితి ఏర్పడింది. తర్వాత రద్దీకి అనుగుణంగా హోటల్‌ను విస్తరించాడు. ‘మన ప్రాంతం కాదు.. భాష రాదు.. అంత రిస్కు తీసుకోవడం అవసరమా?’ అంటూ మొదట్లో చాలామంది తనని వెనక్కి లాగారు. అయినా ముందుకే వెళ్లాడు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రస్తుతం ఓ కాలనీ నిర్మించే దిశగా ప్రణాళికలు వేస్తున్నాడు.

- పెంటు రమేష్‌, నిర్మల్‌ పట్టణం


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts