నిలిచి.. గెలిచారు!

ఒకరిది క్రికెట్‌ ప్రయాణం.. మరొకరిది పరిశోధనల ప్రపంచం! ఇంట మొదలుపెట్టి.. రచ్చ గెలుస్తోంది ఒకరైతే... కష్టాల సంద్రం ఈది విజయాల తీరం చేరింది మరొకరు! ఇద్దరూ స్ఫూర్తి బావుటాలే! వారి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిందే.

Updated : 23 Dec 2023 13:28 IST

తెలుగోడు..నెదర్లాండ్స్‌ పరుగుల రేడు!

ఒకరిది క్రికెట్‌ ప్రయాణం.. మరొకరిది పరిశోధనల ప్రపంచం! ఇంట మొదలుపెట్టి.. రచ్చ గెలుస్తోంది ఒకరైతే... కష్టాల సంద్రం ఈది విజయాల తీరం చేరింది మరొకరు! ఇద్దరూ స్ఫూర్తి బావుటాలే! వారి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిందే.

బ్యాట్‌ పట్టిందేమో తెలుగు నేలపై.. బౌండరీలు బాదుతోంది విదేశీ జట్టు తరఫున. తాజాగా భారత్‌లో జరిగిన ప్రపంచ కప్‌లోనూ మెరిశాడు. నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆ తెలుగు తేజమే.. అనిల్‌ తేజ నిడమానూరు. విజయవాడలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన సందర్భంగా తన ప్రయాణాన్ని ఇలా పంచుకున్నాడు.

 నాకు క్రికెటర్‌గా ఓ గుర్తింపు రావడానికి అడుగులు పడింది విజయవాడలోనే. చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే ఉండేవాడిని. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆడటం మొదలు పెట్టా. ఎన్ని బ్యాట్‌లు విరగ్గొడుతున్నా.. బంతులు పోగొడుతున్నా విసుక్కోకుండా కొత్తవి కొనిచ్చేవారు. ఆ ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది.  

న్యూజీలాండ్‌ పయనం: అమ్మకు న్యూజీలాండ్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబమంతా అక్కడికెళ్లిపోయాం. అప్పటికీ ఆటపై మమకారం తగ్గకపోవడంతో, అక్కడే ఉన్న క్లబ్‌లలో ఆడేవాడిని. ఇక్కడ రంజీలు ఎలాగో అక్కడ క్లబ్స్‌ అలా. మంచి ప్రతిభ చూపించడంతో ఆ దేశ క్రికెట్‌ స్కాలర్‌షిప్‌ వచ్చింది. దాంతోనే స్కూలు విద్య పూర్తి చేశాను. డిగ్రీ అయ్యాక ఆటపై మరింత దృష్టి పెట్టా. ఆ సమయంలోనే ఓవర్సీస్‌ క్రికెట్‌ ఆడే అవకాశం వచ్చింది. అలా రెండుసార్లు ఇంగ్లాండ్‌ వెళ్లాను. అప్పుడే నెదర్లాండ్స్‌ జట్టుతో ఆరు నెలల ఒప్పందం దక్కింది. మరోవైపు చదువు పూర్తవగానే పెద్ద మార్కెటింగ్‌ కంపెనీలో ఉద్యోగం. మంచి జీతం. కానీ మనసంతా ఆటపైనే ఉండటంతో పొద్దునే లేచి ప్రాక్టీస్‌ చేసేవాడిని. రాత్రిదాకా ఉద్యోగం. ఏళ్లపాటు ఇదే దినచర్య.

నెదర్లాండ్స్‌కి ఎంపిక: కాంట్రాక్ట్‌పై వెళ్లిన నాకు తరచూ బ్యాట్‌ ఝుళిపించే అవకాశం రావడంతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డా. దాంతో మూడున్నరేళ్ల తర్వాత ఆ దేశ జాతీయ జట్టులోకి తీసుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో బ్యాట్‌ పట్టిన నేను 28ఏళ్ల వయసొచ్చేసరికి తొలి అంతర్జాతీయ సెంచరీ చేశా. ఈ స్థాయికి చేరడంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. కొన్నిసార్లు జట్టుకి ఎంపిక కాలేదు. గాయాలతో అర్ధాతరంగా వైదొలిగిన సందర్భాలున్నాయి. అయినా ఏనాడూ కుంగిపోలేదు. సానుకూలంగా ముందుకెళ్లడం.. మెరుగైన ఆట ప్రదర్శించడం.. ఇవే నా లక్ష్యాలు.

మర్చిపోలేను: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఏడో నెంబరు స్థానంలో బ్యాటింగ్‌కి దిగి సెంచరీ సాధించడం.. జట్టుని ఓటమి కోరల నుంచి గెలుపు తీరాలకు చేర్చడం.. నా కెరియర్‌లో మర్చిపోలేను. వెస్టిండీస్‌తో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి మా జట్టు ప్రపంచకప్‌కి అర్హత సాధించేలా చేయడం సంతోషాన్నిచ్చింది. అలాంటివి ఇంకొన్ని మ్యాచ్‌లూ ఉన్నాయి.

  •  తాతయ్య సచిన్‌ అభిమాని. ఆయనతోపాటు తెందుల్కర్‌ ఆడే ప్రతి మ్యాచ్‌నీ చూస్తూ నేనూ అభిమానిగా మారా.
  •  విరాట్‌ కోహ్లి అంటే చాలా ఇష్టం. ఆటే కాదు.. ఫిట్‌నెస్‌, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకునే విధానం నచ్చుతుంది.
  •  ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఎక్కడున్నా అమ్మమ్మతో తరచూ మాట్లాడుతుంటా. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తా.
  •  భారత్‌లో నేను మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు అమ్మమ్మ, తాతయ్య, చెల్లి మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా చూడటం మర్చిపోలేని అనుభూతి.
  •  ప్రపంచకప్‌లో ఆడాలనే కల నెరవేరింది. గొప్పగొప్ప క్రికెటర్లతో కలిసి ఐపీఎల్‌లో డ్రెస్సింగ్‌ రూం పంచుకోవాలనే కోరిక మిగిలే ఉంది.
  •  నాన్న మాకు చిన్నప్పుడే దూరమవడం.. మా కుటుంబానికి తీరని లోటు. నాకే కాదు.. ప్రతి విజేత వెనకా ఎన్నో    కష్టాలు, త్యాగాలుంటాయి. కానీ కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు.

ఏడువాక హరీష్‌ కుమార్‌, మచిలీపట్నం


సిరిపోతు శ్రీరంగం... నడవలేడు.. కానీ నలుగుర్నీ నడిపించే సత్తా ఉన్నవాడు... వైకల్యంతో పోరాడాడు.. ఆర్థిక కష్టాల్నీ అధిగమించాడు... ఊతకర్రలతో నడుస్తూనే ఉన్నత స్థానానికి ఎదిగాడు... చంద్రయాన్‌ ప్రాజెక్టులో ఇంజినీర్‌గా తనవంతు పాత్ర పోషించి.. ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌లోనూ తలమునకలై ఉన్నాడు.

శ్రీరంగంది నల్గొండ జిల్లా వల్లాల. తండ్రి చేనేత కార్మికుడు. పేరొందిన పోచంపల్లి పట్టుచీరలకు కేంద్రమైన పుట్టపాకలో స్థిరపడ్డారు. అంతకుముందు రెండేళ్ల వయసులో.. జ్వరం తగ్గేందుకు శ్రీరంగంకి ఓ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి, శరీరమంతా చచ్చుబడింది. ఏళ్లకేళ్లు చికిత్స చేయిస్తే.. తల, పొట్ట, చేతులు స్వాధీనంలోకి వచ్చినా, కాళ్లు పని చేయకుండా పోయాయి. దాంతో అన్నయ్య వీపుపై ఎక్కి రోజూ పాఠశాలకు వెళ్లేవాడు. పదో తరగతిలో మండలంలో ప్రథమ స్థానం సాధించాడు. ప్రైవేటు కాలేజీలో ఫీజు చెల్లించే శక్తి లేక, భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఎంపీసీలో చేరి ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. ఓ దాత సాయంతో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. హాస్టల్‌ ఫీజు చెల్లించలేని దీనస్థితిని గమనించి.. అదే విశ్వవిద్యాలయం అడ్మిన్‌ విభాగంలో పని చేసే ఉద్యోగి భరించడంతో చదువు కొనసాగింది. ఈ సమయంలో చంకలో కర్రల ఊతంతో స్కూలు, కాలేజీకి వెళ్లి చదువుకున్నాడు. తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఓ బయోడీజిల్‌ తయారీ సంస్థలో చేరాడు. ఇరవై మీటర్ల ఎత్తుకు మెట్ల మార్గంలో వెళ్లి తనిఖీలు చేసే ప్రమాదకరమైన ఉద్యోగం అది. అయినా ఏడాదిపాటు సమర్థంగా పని చేశాడు. తర్వాత కేరళ తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో ఇంజినీర్‌గా చేరాడు. ప్రస్తుతం డిప్యూటీ మేనేజర్‌ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టులో టెస్ట్‌ వెహికిల్‌ ధర్మో ప్రొటెక్షన్‌ సిస్టంలో పని చేస్తున్నాడు.

బయోడీజిల్‌ పరిశ్రమలో పని చేస్తున్న సమయంలోనే విక్రమ్‌ సారాభాయి అంతరిక్ష కేంద్రం, షార్‌లలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. ఎంతో మంది కలలు కనే సంస్థ అది. 2008లో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. చిన్నతనం నుంచి పరిశోధనలంటే ఇష్టపడే శ్రీరంగం.. ఇతర శాస్త్రవేత్తలతో కలిసి రాకెట్‌ థర్మల్‌ ప్రొడక్షన్‌ సిస్టం, రాకెట్‌ పాలిమర్‌ కాంపొజిట్‌ సిస్టం అభివృద్ధికి కృషి చేశాడు. గగన్‌యాన్‌ వ్యోమగాముల రక్షణ కోసం ధరించే దుస్తులను అభివృద్ది చేశాడు. క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో వాడే కోటింగ్‌ మెటీరియల్‌ను అభివృద్ధి చేశాడు. వీటికి మూడు పేటెంట్లు లభించాయి. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 లాంచ్‌ వెహికల్‌.. విక్రమ్‌ సారాభాయ్‌ కేంద్రంలోనే తయారైంది. అందులోనూ శ్రీరంగం భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం దేశం అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ధర్మో ప్రొటెక్షన్‌ సిస్టంలో పని చేస్తున్నాడు. ‘తన చదువు ఆపేసి మరీ నన్ను చదివించిన అన్నయ్య, అనుక్షణం చేయూతనిచ్చిన భార్య, కుటుంబం, నాకు సాయం చేసిన సమాజం.. అడుగడుగునా నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఏదైనా సాధించగలననే భరోసానిచ్చారు’ అంటున్నాడు శ్రీరంగం.

సూరపల్లి రఘుపతి, శ్రీనివాస్‌, చౌటుప్పల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని