Published : 21 Aug 2021 03:29 IST

క్లాస్‌మేట్సూ .. బ్యాచ్‌మేట్సూ ...

ఇది వాట్సాప్‌ యుగం. ఫొటో షేరింగ్‌ నుంచి పైసల మ్యాటర్‌ దాకా.. అడ్రెస్‌ అప్‌డేట్‌ నుంచి వీడియో కాలింగ్‌ దాకా అన్నింటికీ వాట్సాప్‌నే. మళ్లీ ఇందులో రకరకాల గ్రూప్‌లు. స్నేహితులకి, బంధువులకి, క్లాస్‌మేట్స్‌కి, బెంచ్‌మేట్స్‌కి, లంచ్‌మేట్స్‌కి, బస్‌మేట్స్‌కి ఆఖరికి గ్లాస్‌మేట్స్‌కి కూడా. కుప్పలుకుప్పలుగా సభ్యులున్న ఈ గ్రూపుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఫన్నీగా ఉండే కొందరి మనస్తత్వాలు...

పేరుకే పెద్దన్నలు: వీళ్లు గ్రూప్‌ అడ్మిన్లలో అదోరకం. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, బ్యాచ్‌మేట్లు.. అందరి నెంబర్లూ సేకరించి గ్రూపులు కట్టేస్తారు. ఆపై గప్‌చుప్‌. గ్రూప్‌ అడ్మిన్‌గా కాలర్‌ ఎగిరేయాలనే తపనే తప్ప మరే పోస్ట్‌, షేరింగ్‌లలో పాలు పంచుకోరు.

అంతా నేనే: వీళ్లు లేకుండా గ్రూప్‌ నిద్దరేపోదు. తాజాతాజా రాజకీయాలు.. వేడివేడి గాసిప్‌లు.. హోరెత్తించే సినిమా కబుర్లు.. వీళ్లకి తెలియని రంగం ఉండదు. పొద్దున లేచిన దగ్గర్నుంచి మూడు పోస్ట్‌లు.. ఆరు షేరింగ్‌ల చొప్పున వీళ్ల వాటా ఉండి తీరాల్సిందే.

ఛీర్‌ లీడర్లు: అందరి మొహాల్లో నవ్వులు పూయించడానికి వెలిసిన అవతార పురుషులన్నమాట. లోకల్‌ నుంచి గ్లోబల్‌దాకా.. నవ్వు తెప్పించే పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, సమాచారం ఏదైనా.. ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చి మరీ పోస్ట్‌ చేసి సభ్యుల్ని రంజింపజేస్తుంటారు.

షేరింగ్‌ఖాన్‌లు: విషయం మంచా? చెడా? జాన్తా నై. తమకొచ్చిన పోస్ట్‌ పూర్తిగా చదవకుండానే, వీడియో సాంతం చూడకుండానే ఫార్వర్డ్‌ చేసే బాపతు. గ్రూపు నియమాలు పట్టించుకోరు. తనకి నచ్చిందే లైకు.. తను పంపిందే రైటు అనుకునే రకం.

అపర శ్రీశ్రీలు: నా బాధ గ్రూపు అంతటికీ బాధ. నా సంతోషం సభ్యులందరికీ పండగ అనుకునే టైపు. షికారుకెళ్లినా, చిరాకుగా ఉన్నా, సినిమాకెళ్లినా, చిందులు వేస్తున్నా.. వ్యక్తిగత ఫొటోలు, పోస్టులతో రెచ్చిపోతుంటారు. దానికి అంతా స్పందించాలని పరితపిస్తుంటారు.

అతిగాళ్లు: గ్రూపులో అత్యంత చొరవగా ఉండేది వీళ్లే. ప్రతి పోస్ట్‌కీ స్పందిస్తారు. స్పందించడం అనే దానికన్నా వాదిస్తారు అనడం కరెక్ట్‌. ప్రతి చర్చనీ తమ కోణంలోకే లాక్కొస్తారు. నా వాదనే నెగ్గాలంటారు. లోలోపల తిట్టుకుంటున్నా.. ‘అబ్బా.. నువ్వు సూపరెహే’ అనేదాకా వదలరు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని