రైల్వే ప్రాజెక్టులకు ఏపీ వాటా ఇవ్వట్లేదు

ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇది ఆయా ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు.

Published : 04 Dec 2021 04:19 IST

50% ఖర్చులో ఇస్తున్నది అంతంతమాత్రమే

రాజ్యసభలో వెల్లడించిన రైల్వే మంత్రి


అశ్వినీ వైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇది ఆయా ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు. శుక్రవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఖర్చు పంపిణీ విధానం కింద నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.15,846.35 కోట్లుకాగా, ఏపీ ప్రభుత్వం రూ.746.63 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.3,073.5 కోట్లు బకాయి ఉందన్నారు.

* నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్‌ నిర్మాణానికి రూ.2,643.35 కోట్లు ఖర్చవుతుందని, ఇందుకు భూమిని ఉచితంగా ఇవ్వడంతోపాటు, 50% ఖర్చును భరించడానికి గతంలో ఏపీ ప్రభుత్వం అంగీకరించి, రూ.6 కోట్లే ఇచ్చిందని, ఇంకా రూ.1,315.50 కోట్లు ఇవ్వాలని వివరించారు.
* రూ.2,155 కోట్ల ఖర్చయ్యే భద్రాచలం-కొవ్వూరు లైన్‌ ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉందని చెప్పారు. 50% ఖర్చు భరించేదీ లేనిదీ ఏపీ ప్రభుత్వం చెప్పాలన్నారు.
* విజయవాడ-గుడివాడ-భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నిడదవోలు (డబ్లింగ్‌, విద్యుదీకరణ) ప్రాజెక్టుకు రూ.3,377 కోట్ల అంచనా వ్యయంలో ఏపీ రూ.288కోట్లే చెల్లించిందన్నారు. 50% వాటా కింద ఇంకా రూ.1,400 కోట్లు ఇవ్వాలన్నారు.
* రూ.3,038 కోట్లతో తలపెట్టిన కడప-బెంగుళూరు కొత్త లైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.189.94 కోట్లే ఇచ్చినట్లు తెలిపారు.
* రూ.2,120 కోట్లతో తలపెట్టిన కోటిపల్లి-నరసాపురం లైన్‌కయ్యే ఖర్చులో ఏపీ 25% వాటా భరించాలని,  ఇప్పటివరకు రూ.2.69 కోట్లే ఇచ్చిందని, ఇంకా రూ.358 కోట్ల బకాయి ఉందని చెప్పారు.
* రూ.2,513 కోట్లతో తలపెట్టిన తుమకూరు-రాయదుర్గం లైన్‌ నిర్మాణానికి 50% వాటా భరించాల్సిన ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.260 కోట్లే ఇచ్చిందన్నారు.
* ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 5,706 కిలోమీటర్ల పొడవైన 16 కొత్తలైన్లు, 17 డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని, దీని అంచనా వ్యయం రూ.63,731 కోట్లని రైల్వేమంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని