కుళాయి కనెక్షన్లు మాకొద్దు

ప్రైవేటు నీటిశుద్ధి ప్లాంట్లలో నీళ్లకు అలవాటుపడిన ప్రజలు పట్టణ స్థానిక సంస్థలు అందించే తాగునీటి కుళాయి కనెక్షన్లంటే విముఖత చూపుతున్నారు. అమృత్‌-2 పథకం అమలు కోసం పట్టణాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో 3,78,790 కుటుంబాలు కుళాయి కనెక్షన్లు తీసుకోడానికి విముఖత చూపినట్లు వెల్లడైంది.

Updated : 17 Jan 2022 03:27 IST

శుద్ధి ప్లాంట్లలోని నీటి వినియోగమే ఎక్కువ
అమృత్‌-2 అమలు కోసం నిర్వహించిన సర్వేలో వెల్లడి

ఈనాడు, అమరావతి: ప్రైవేటు నీటిశుద్ధి ప్లాంట్లలో నీళ్లకు అలవాటుపడిన ప్రజలు పట్టణ స్థానిక సంస్థలు అందించే తాగునీటి కుళాయి కనెక్షన్లంటే విముఖత చూపుతున్నారు. అమృత్‌-2 పథకం అమలు కోసం పట్టణాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో 3,78,790 కుటుంబాలు కుళాయి కనెక్షన్లు తీసుకోడానికి విముఖత చూపినట్లు వెల్లడైంది. ఇప్పటికీ కుళాయి కనెక్షన్లు తీసుకోని వారిలో 75% ప్రైవేటు ప్లాంట్లలో నీళ్లు కొని తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మిగిలిన 25% అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్లలో బోరు నీటిని శుద్ధిచేసే వ్యవస్థలను సొంతంగా ఏర్పరుచుకున్నారు. విశాఖ రీజియన్‌లో 1,45,526, రాజమహేంద్రవరంలో 83,292, గుంటూరులో 60,324, అనంతపురం రీజియన్‌లో 89,648 కుటుంబాలు కొత్త కుళాయి కనెక్షన్లపై అనాసక్తత ప్రదర్శించాయని సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని 124 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో 43,37,614 నివాసాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 18,67,306 నివాసాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ అందించాలన్న లక్ష్యంతో కేంద్రం అమృత్‌ పథకాన్ని ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వంతో కలిసి అమృత్‌-1 కింద రాష్ట్రంలో రూ.3,700 కోట్లతో 32 పట్టణాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అమృత్‌-2 కింద మరో రూ.10వేల కోట్ల ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కుళాయి కనెక్షన్లపై ప్రజల్లో ఆసక్తిని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించినప్పుడు అత్యధికులు విముఖత చూపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ గత రెండేళ్లలో ప్రైవేటు నీటిశుద్ధి ప్లాంట్ల నుంచి నీటిని తెప్పించుకునే కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రకాశం, గుంటూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో నీటి సరఫరా తగినంత లేకపోవడంతోనూ.. ఎక్కువ మంది ప్రైవేటు ప్లాంట్లలో నీటికి అలవాటు పడ్డారు.

లెక్కల్లో లేని కనెక్షన్లు 57,963
పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 57,963 అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నాయన్న విషయమూ సర్వేలో వెల్లడైంది. పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 18,67,306 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 57,963 కుళాయిలకు రోజూ నీరు సరఫరా అవుతున్నా... అవి లెక్కల్లో లేవని నివేదించారు. పురపాలక మాజీ ఛైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్ల ఇళ్లు, ఇతర దుకాణాల్లో అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. నివేదికలో ఈ వివరాల జోలికి వెళ్లలేదు. అనంతపురం రీజియన్‌లో అత్యధికంగా 37,157, రాజమహేంద్రవరంలో 7,711, గుంటూరులో 6,721, విశాఖపట్నం రీజియన్‌లో 6,373 అక్రమ కనెక్షన్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని