జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌ విచారణార్హమే

అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలని.....

Updated : 28 Apr 2021 07:52 IST

ఎంపీ రఘురామ వ్యాజ్యంపై సీబీఐ కోర్టు
త్వరలో ముఖ్యమంత్రికి నోటీసులు!

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు కార్యాలయ అభ్యంతరాలను సీబీఐ ప్రధాన కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు విచారణార్హత ఉందంటూ మంగళవారం స్పష్టంచేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందోలకు సంబంధించిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్‌ బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావు గత వారం విచారణ చేపట్టి వాదనలు విన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ విచారణార్హమేనని, దీనికి నంబరు కేటాయించి బెంచ్‌ ముందుంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నంబరు కేటాయించాక ఇందులో ప్రధాన నిందితుడైన జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. సాధారణంగా బెయిలు రద్దు కోసం కోర్టు తనంతటతానుగా కానీ, దర్యాప్తు సంస్థ, ఫిర్యాదుదారు, సామాన్యుడు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని, ఇదే విషయాన్ని రాతినాం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. మూడో వ్యక్తి దరఖాస్తు చేశారన్న కారణంగా తిరస్కరించరాదని, బెయిలుకు సంబంధించిన సబ్‌సెక్షన్‌లో కేవలం ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ మాత్రమే బెయిలు రద్దుకు దరఖాస్తు చేయాలని చెప్పలేదని ఇదే విషయాన్ని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయని న్యాయవాది చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తూ న్యాయ ప్రక్రియకు గండికొడుతున్నారని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిలు రద్దు విషయంలో కోర్టు మొదట కేసు ప్రత్యేకత, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితులకు కీలకమైన పదవులు కట్టబెడుతుండటంతో వారు బెదిరించి భయపెట్టడం ద్వారా సాక్షులను తారుమారు చేయడానికి అవకాశం ఉందన్నారు. సాక్షులుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులే ఉన్నారని, ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణను ఆశించలేమని, అందుకే బెయిలు రద్దు చేయాలని విన్నవించారు. జగన్‌కు న్యాయ ప్రక్రియపై ఎలాంటి గౌరవం లేదని,. స్వల్ప కారణాలను పేర్కొంటూ 317 దరఖాస్తులను దాఖలు చేయడం ద్వారా గత ఏడాది కాలంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావడంలేదన్నారు. బెయిలు నిమిత్తం చేసుకున్న దరఖాస్తులో దర్యాప్తునకు, విచారణకు సహకరిస్తానంటూ హామీ ఇచ్చారని, ఇప్పుడు స్వల్ప కారణాలను పేర్కొంటూ కోర్టు విచారణకు సహకరించడం లేదన్నారు. ఇది కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారని, ఈ కారణంగా బెయిలును రద్దు చేయవచ్చని న్యాయవాది వివరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts