AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి మహబూబ్‌ సుభానీ షేక్‌!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం దేశంలోని మూడు హైకోర్టుల న్యాయమూర్తుల పదవులకు 15 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది.

Updated : 12 Oct 2022 12:35 IST

దిల్లీ హైకోర్టుకు తెలుగు న్యాయవాది తుషార్‌రావు గేదెల  
ప్రతిపాదించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం
మూడు హైకోర్టులకు 15 మంది న్యాయవాదుల పేర్లు సిఫారసు

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం దేశంలోని మూడు హైకోర్టుల న్యాయమూర్తుల పదవులకు 15 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్న మహబూబ్‌ సుభానీ షేక్‌ పేరును.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ప్రతిపాదించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో హాజీ షేక్‌ మీరాసాహెబ్‌, మస్తాన్‌బీ దంపతులకు ఈయన జన్మించారు. వేములూరిపాడులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు బత్తుల కమిటీ హైస్కూల్‌లో, ఇంటర్‌, డిగ్రీ విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో చదివారు. దిల్లీ జేఎన్‌యూలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివి, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. ఉమ్మడి హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న ఏరాసు అయ్యపురెడ్డి వద్ద న్యాయవాద వృత్తి మొదలుపెట్టారు. ఉమ్మడి హైకోర్టుతోపాటు, విభజన అనంతరం ఏర్పడిన ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా, వివిధ సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తూ 28 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.  ఈ నెల 4న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం సుబానీ షేక్‌ పేరును సిఫార్సు చేసింది.

పట్నా హైకోర్టుకు ఏడుగురు జ్యుడిషియల్‌ అధికారులు, దిల్లీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో తెలుగు వ్యక్తి తుషార్‌రావు గేదెల పేరు ఉంది. ఈయన తండ్రి జి.నారాయణరావు సుప్రీంకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌గా పనిచేశారు. 1976 నుంచి 1986 వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా సేవలందించారు. తుషార్‌రావు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ సిఫార్సులతో కలిపి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వివిధ హైకోర్టుల న్యాయమూర్తుల పదవులకు ఇప్పటి వరకు 195 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని