Asani Cyclone: తీరం దాటిన అసని

భారీ వర్షాలు, ఈదురు గాలులతో రెండు రోజులుగా కలవరపెట్టిన ‘అసని’ తీవ్ర తుపాను.. వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. రైతుల్ని నిలువునా ముంచేసింది. బుధవారం ఉదయానికి తుపానుగా

Updated : 12 May 2022 05:51 IST

మచిలీపట్నం-నరసాపురం మధ్య భూమ్మీదకు
యానాం, కాకినాడ తీరం వెంబడి కదులుతూ.. మళ్లీ బంగాళాఖాతంలోకి చేరే అవకాశం
నేటి ఉదయానికి వాయుగుండంగా బలహీనపడొచ్చు
కోస్తాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో వేల ఎకరాల్లో నేలవాలిన పంటలు
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

ఈనాడు, అమరావతి: భారీ వర్షాలు, ఈదురు గాలులతో రెండు రోజులుగా కలవరపెట్టిన ‘అసని’ తీవ్ర తుపాను.. వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. రైతుల్ని నిలువునా ముంచేసింది. బుధవారం ఉదయానికి తుపానుగా బలహీనపడింది. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి.. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తీవ్ర తుపాను, తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో 15.5 సెం.మీ, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది.

బుధవారం ఉదయం నుంచి తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఉప్పాడ-కొత్తపల్లి రహదారి కెరటాల ధాటికి ధ్వంసమైంది. మంగళవారం ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన బార్జి ఇసుకలో కూరుకుపోయింది. కెరటాల తీవ్రతకు అది కాకినాడ బీచ్‌కు చేరింది. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరంలో వరదకాలువపై అప్రోచ్‌వంతెన కూలిపోయింది.


ముగ్గురి మరణం

నకాపల్లి జిల్లాలో ఎస్‌.రాయవరం నుంచి ఉప్పరాపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎంపీటీసీ సభ్యుడు కాసులుపై కొబ్బరి చెట్టు విరిగిపడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అమలాపురం మండలం కామనగరువు ప్రాంతంలోని అప్పన్నపేటలో పూరిల్లు కూలి అందులో నిద్రిస్తున్న రోజు కూలీ వాకపల్లి శ్రీనివాసరావు (43) చనిపోయారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో పిడుగుపాటుతో ఒకరు మరణించారు.


వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం

సని తీవ్రతతో భారీవర్షాలు, అధిక వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి, కూరగాయల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాపట్ల ప్రాంతంలో ఉద్యాన పంటలు, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ఏలూరులో గాలుల ధాటికి మూడుచోట్ల విద్యుత్తు ఫీడర్లు దెబ్బతిన్నాయి. కోనసీమ జిల్లాలో ధాన్యానికి మొలకలు వస్తాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. కృష్ణా జిల్లాలో 900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. మామిడి పంటకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.


కళ్లాల్లో ధాన్యానికి మొలకలు

ఈనాడు-కాకినాడ, ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం: అసని తుపాను ప్రభావంతో కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో గాలులతోపాటు.. మోస్తరు వర్షాలు కురిశాయి. మూడు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈదురుగాలులతో పలు మండలాల్లో రెండు రోజులుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ప్రత్తిపాడు మండలం ఈ.గోకవరంలో వరద కాలువపై అప్రోచ్‌ వంతెన శిథిలమైంది. ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు దెబ్బతినడంతో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుటికే నూర్పిడి చేసిన 60 శాతం ధాన్యం కళ్లాల్లో ఉండిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నీటి చెమ్మతో చాలా కళ్లాల్లో మొలకలు వచ్చాయి. కోనసీమలో అరటి, దొండ పంటలు నేలకొరిగాయి.


ఏలూరు, పశ్చిమలో అలజడి

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. అక్కడక్కడా రహదార్లపైన, కల్లాల వద్ద ధాన్యాన్ని ఉంచిన రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు అక్కడక్కడా నేలకొరిగాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అలల పోటు ఎక్కువై.. పెదమైనవానిలంక, కేపీˆపాలెం సౌత్‌లో భూమి కోతకు గురైంది.


విమాన సర్వీసులు రద్దు

గన్నవరం గ్రామీణం, విశాఖపట్నం, న్యూస్‌టుడే: అసని తుపాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా నడిచే పలు విమాన సర్వీసులు బుధవారం రద్దయ్యాయి. రాత్రికి విజయవాడ చేరుకోవాల్సిన దిల్లీ, హైదరాబాద్‌ సర్వీసులను రద్దుచేసింది. ఇండిగో విమానయాన సంస్థ నడిపే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప లింక్‌ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేసింది. మొత్తంగా 16 సర్వీసులు రద్దయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చివెళ్లే విమానాలూ రద్దయ్యాయి. 22 ఇండిగో, 4 ఎయిర్‌ ఏషియా, 2 ఎయిర్‌ ఇండియా, కోల్‌కతా స్పైస్‌జెట్‌ విమానం పూర్తిగా రద్దుచేశామని విమానాశ్రయ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు.


బలహీనపడినా.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు

సని బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినా.. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీయొచ్చన్నారు. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. అత్యవసర సహాయానికి 1070, 18004250101 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని