మన బంగారం నిఖత్‌ జైరీన్‌

అమ్మాయిలకు ఆటలా.. అందులోనూ బాక్సింగా.. శరీరం తట్టుకుంటుందా? ఆ అమ్మాయి చిన్నతనంలో ఆ కుటుంబానికి ఎదురైన ప్రశ్న ఇది!

Published : 20 May 2022 03:31 IST

చరిత్ర సృష్టించిన తెలుగు యువతి

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

అమ్మాయిలకు ఆటలా.. అందులోనూ బాక్సింగా.. శరీరం తట్టుకుంటుందా?
ఆ అమ్మాయి చిన్నతనంలో ఆ కుటుంబానికి ఎదురైన ప్రశ్న ఇది!
‘‘మన కట్టుబాట్లేంటి.. ఇంటిపట్టున ఉండకుండా ఈ ఆటలేంటి..’’
‘‘మగరాయుడిలా ఇలాంటి ఆటలాడితే.. పంచ్‌లకు ముఖం పచ్చడైతే పెళ్లెవరు చేసుకుంటారు?’’
‘‘ఛాంపియన్లు పెద్ద నగరాల నుంచే వస్తారండీ.. చిన్న పట్టణాల్లో సౌకర్యాలుండవు. సరైన గైడెన్స్‌ ఉండదు’’
‘‘ఆటల్లో రాజకీయాలు సహజం. కొన్నిసార్లు అన్యాయం కూడా జరగొచ్చు. వాటి గురించి ప్రశ్నించకూడదు’’
..ఇలా కెరీర్లో ఎన్నో ప్రశ్నలు, అభ్యంతరాలు, షరతులు..!

వీటన్నింటినీ దాటుకుని.. ఇప్పుడు ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబడింది తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌.
ఇప్పుడు తనొక ప్రపంచ ఛాంపియన్‌!
ఆటల్లో అడుగు వేయించిన తండ్రికి..
అండగా నిలిచిన కుటుంబానికి.. మెలకువలు నేర్పి ప్రోత్సాహం అందించిన కోచ్‌లకు.. ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్‌ రూపంలో  గొప్ప బహుమతి ఇచ్చింది నిఖత్‌ జరీన్‌.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్ఠాత్మక ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చిన నిఖత్‌.. గురువారం హోరాహోరీగా సాగిన 52 కేజీల విభాగం ఫైనల్లో 5-0తో జిట్‌పాంగ్‌ జటామస్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. మెరుపు పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ జరీన్‌.. రింగ్‌లో విజయనాదం చేసింది. మేరీకోమ్‌ పోటీ పడే విభాగంలోనే ఆడడం వల్ల ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన నిఖత్‌.. ఇప్పుడు ఆ విభాగంలోనే స్వర్ణం నెగ్గి ఈ దిగ్గజ క్రీడాకారిణికి సరైన వారసురాలిని తానే అని చాటింది.

మన జరీన్‌.. బాక్సింగ్‌ క్వీన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని