Droupadi Murmu: మీ ప్రస్థానం.. జాతికి స్ఫూర్తిదాయకం

‘దేశ అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించిన ఆదివాసీ మహిళగా జాతి మొత్తానికి మీరు స్ఫూర్తి నింపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎంత ఉన్నత స్థానానికైనా చేరొచ్చనడానికి మీరే ఉదాహరణ. మీ

Updated : 07 Aug 2022 04:08 IST

రాష్ట్రపతితో మర్యాదపూర్వక భేటీలో చంద్రబాబు ప్రశంస

ఈనాడు, దిల్లీ: ‘దేశ అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించిన ఆదివాసీ మహిళగా జాతి మొత్తానికి మీరు స్ఫూర్తి నింపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎంత ఉన్నత స్థానానికైనా చేరొచ్చనడానికి మీరే ఉదాహరణ. మీ విజయం మహిళలకు, అట్టడుగు వర్గాలకు మరింత స్ఫూర్తిదాయకం’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ద్రౌపదీముర్ముతో ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానించారు. ఆమెను అభినందిస్తూ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నూతన రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెదేపా ఏపీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీ నేతృత్వం సాధారణ ప్రజలకు మరింత ఉపయోగపడుతుంది. మీరు మా పొరుగు రాష్ట్రం వారు కావడం మరింత ఆనందకరం’ అని చంద్రబాబు రాష్ట్రపతితో పేర్కొన్నారు. ద్రౌపది స్పందిస్తూ ‘మనందరిపై గురుతర బాధ్యత ఉంది. రాజకీయాల్లోకి ఎందరో రావాలనుకుంటారు. కానీ అందరికీ అవకాశాలు రావు. మనకు వచ్చాయి. ఎప్పటికప్పుడు సమాజానికి మేలు చేయడానికి పునరంకితం కావాలి. మీ విషయాలు ఏమున్నా నా దగ్గర పంచుకోవచ్చు. నేను అందరికీ సంబంధించిన వ్యక్తిని’ అని బదులిచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఆహ్వానించిన తీరుపై తెదేపా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మలా ఆత్మీయంగా మాట్లాడారని పయ్యావుల కేశవ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని