నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ప్రత్యేక చిత్రాలు

ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం దహెగామ, కోసాయి సమీపంలో రెండు కొండలు దట్టమైన చెట్లతో నిండి ఉంటాయి. చుట్టూ పచ్చదనం పర్చుకున్న వాటి మధ్య నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణికులకు ప్రకృతి ఒడిలో పయనించినట్లు ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా ఉన్న పల్సి(బి) తండా గుట్టలపై నుంచి రైళ్లను చూస్తూ పర్యాటకులు మురిసిపోతుంటారు. 

Updated : 19 Aug 2022 06:37 IST

ప్రకృతి ఒడిలో ప్రయాణం..

ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం దహెగామ, కోసాయి సమీపంలో రెండు కొండలు దట్టమైన చెట్లతో నిండి ఉంటాయి. చుట్టూ పచ్చదనం పర్చుకున్న వాటి మధ్య నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణికులకు ప్రకృతి ఒడిలో పయనించినట్లు ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా ఉన్న పల్సి(బి) తండా గుట్టలపై నుంచి రైళ్లను చూస్తూ పర్యాటకులు మురిసిపోతుంటారు. 

 - ఈనాడు, ఆదిలాబాద్‌


గంగాళంలా వ్యవసాయ బావులు!

చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బావులు ఇలా కనిపిస్తున్నాయని నీటి రంగ నిపుణులు తెలిపారు.  

  - ఈనాడు, హనుమకొండ


ఆహారం కోసం తలమునకలు!

ఆహారం కోసం చూస్తున్న ఒక కొంగకు అది కనపడగానే అందుకునేందుకు తన ముక్కును మొత్తం ఇలా చటుక్కున నీటిలోకి ముంచింది. దీంతో ఆ క్షణంలో నీరు ఎగురుతుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌ మనిపించింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ చెరువులో కనిపించింది.

-ఈనాడు, హైదరాబాద్‌


ఆదిమ వాయిద్యం.. మనసుకు ఆహ్లాదం..! 

డిజురీడూ అనేది ఆస్ట్రేలియాకు చెందిన 2500 ఏళ్ల కిందటి దేశీయ వాయిద్యం. హ్యాండ్‌పాన్‌ అనేది స్విట్జర్లాండ్‌లో హస్తకళా కళాకారులు తయారుచేసిన సంగీత పరికరం. వీటితో ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి లోతైన ప్రతిధ్వని, కంపనాలతో మనసును హత్తుకునేలా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. హైదరాబాద్‌కు చెందిన తేజ, సందీప్‌ దినకర్‌లు డిజురీడూ, హ్యాండ్‌పాన్‌లతో పలు కార్యక్రమాల్లో వీనులవిందైన సంగీతం అందిస్తున్నారు. 

-ఈనాడు, హైదరాబాద్‌


ఉసూరుమనిపించిన ఉల్లి!

ఇటీవలి వర్షాలు ఉల్లి రైతును ఊపిరి తీసుకోకుండా చేస్తే.. అంత కష్టపడి పండించిన పంటకు ధర లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బోదెపాడుకు చెందిన రైతు ఈశ్వరయ్య రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెల్లో ధర పడిపోవడంతో రవాణా ఖర్చులన్నా మిగులుతాయని పొలం వద్దే పంటను వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు తీసుకెళ్లినా క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.600 మాత్రమే పలుకుతోంది. కష్టపడి యార్డుకు తీసుకెళ్లి.. పడిగాపులు పడటం ఎందుకని పొలం వద్దే విక్రయిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లోకి మహారాష్ట్ర ఉల్లి రాకతో ఇక్కడి పంటకు గిట్టుబాటు దక్కడం లేదని రైతులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు 2,329 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. 

   - ఈనాడు, కర్నూలు


ఆకలి కాలుష్యమెరుగదు

కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎంతగానో ప్రచారం చేస్తున్నా ఫలితం లేదు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. హైదరాబాద్‌లోని హుసేన్‌సాగర్‌ ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారింది. ఇక్కడ నీరు నల్లని రంగులో కనిపిస్తుండగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తేలుతున్నాయి. ఈ క్రమంలోనే జలవిహార్‌ సమీపంలో తాబేలు నీటిలో నుంచి బయటకు వచ్చి ఓ చెక్కపైకి చేరింది. అదే సమయంలో ఆహారం కోసం పక్షులూ అక్కడికే చేరాయి.

- ఈనాడు, హైదరాబాద్‌


సన్నజాజి ఆకాశహర్మ్యం..!

న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ అనగానే ఆకాశహర్మ్యాలు గుర్తుకు రావడం సహజం. అలాంటి వాటిలో విభిన్నమైనది స్టైన్‌వే టవర్‌. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా ఇది గుర్తింపు పొందింది. 435 మీటర్ల (1,428 అడుగుల) ఎత్తున్న 84 అంతస్తుల ఈ టవర్‌ను న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్చర్‌ సంస్థ షాన్‌ ఆర్కిటెక్ట్స్‌ డిజైన్‌ చేసింది. ప్రచండ గాలుల సమయంలో ఈ భవనం పైభాగం స్వల్పంగా అటూఇటూ ఊగుతుంది. సాధారణంగా సన్నని భవనాల వెడల్పు, ఎత్తుల నిష్పత్తి 1: 10 ఉంటుంది. అలాంటిది స్టైన్‌వే  టవర్‌ నిర్మాణం నమ్మశక్యంకాని రీతిలో 1: 23.5 నిష్పత్తిలో పూర్తిచేయడం విశేషం.


పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా లో గురువారం జాతీయ జెండాలతో పడవల్లో ప్రయాణిస్తూ స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్న ప్రజలు. మ్యాప్‌ తయారీకి సంబంధించి బ్రిటిషర్లు చేసిన పొరపాటు కారణంగా ఇక్కడి కొన్ని ప్రాంతాలు తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌)లోకి వెళ్లిపోయాయి. అనంతరం ఆ తప్పులను సరిదిద్దడంతో ఆగస్టు 18, 1947న ఈ ప్రాంతాలు తిరిగి భారత్‌లో కలిసిపోయినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు. ఈ కారణంగానే నదియా జిల్లాలో బంగ్లాదేశ్‌ సరిహద్దుకు అనుకుని ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు 1947 నుంచి ఇప్పటివరకు ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని