948 కోట్ల మళ్లింపు?

ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రంలో అమలుకు నోచు కోవడం లేదు.

Updated : 03 Oct 2022 11:12 IST

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల జమలో నిర్లక్ష్యం

కేంద్ర ఆదేశాలు బేఖాతరు

ఈనాడు - అమరావతి

ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రంలో అమలుకు నోచు కోవడం లేదు. పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులు పంచాయతీలకు కేటాయించాలని అధికారపార్టీకి చెందిన సర్పంచులు పలువురు రోడ్లెక్కుతున్నా... భిక్షాటన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 15వ ఆర్థిక సంఘం 2021-22 సంవత్సరానికి రెండో విడతగా ఇటీవల విడుదల చేసిన దాదాపు రూ.948 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అయి 20-30 రోజులైనా పంచాయతీలకు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. ఏ పంచాయతీకి ఎన్ని నిధులు కేటాయించాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఆర్థికశాఖకు సమాచారం వెళ్లినా స్పందన లేదు. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద సర్దుబాటు చేసేలా ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరినట్లు ఇటీవల తనను కలిసిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన పలువురు సర్పంచులతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే ఇప్పటికీ ఉత్తర్వులు రద్దు కాలేదు. పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద మరోసారి మళ్లించిందా అనే అనుమానం కలుగుతోందని కొందరు సర్పంచులు అంటున్నారు. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు జమ చేయక
పోవడంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖల మంత్రి నారాయణస్వామి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామ పంచాయతీలకు నిధులు జమ అవుతున్నాయని... ఏపీలో ఎందుకు జమ చేయడం లేదో అధికారుల నుంచి నివేదిక కోరతాననని ఆయన తెలిపారు.


సిబ్బందికి జీతాల్లేవు...

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి తల కిందులైంది. పన్నుల కింద వసూలైన నిధులు సిబ్బంది జీతాలకే చాలాచోట్ల సరిపోవడం లేదు. దీంతో పలు పంచాయతీల్లో పొరుగు సేవల ఉద్యోగులకు సరిగా జీతాలు చెల్లించడం లేదు. అత్యవసర పనులకూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని, కోనసీమ జిల్లాల్లో పలువురు వైకాపా సర్పంచులే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు కేటాయించాలని భిక్షాటన చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని