‘104’ టెండర్ల పరంపరకు చెక్‌!

సంచార వైద్యశాలల అంబులెన్సుల ఫ్యాబ్రికేషన్‌ పనుల అప్పగింత టెండరు ప్రక్రియలో రివర్స్‌ టెండరింగ్‌ను అనుసరించకపోవడం చర్చనీయాంశమైంది.

Published : 08 Oct 2022 02:32 IST

ఎట్టకేలకు వాహనాల కొనుగోలుకు సంస్థ ఎంపిక

రివర్స్‌ టెండరింగ్‌ను పక్కన పెట్టిన అధికారులు

ఈనాడు, అమరావతి: సంచార వైద్యశాలల అంబులెన్సుల ఫ్యాబ్రికేషన్‌ పనుల అప్పగింత టెండరు ప్రక్రియలో రివర్స్‌ టెండరింగ్‌ను అనుసరించకపోవడం చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు సంచార వైద్యశాల(104)ల కింద ఫోర్స్‌ కంపెనీకి చెందిన 432 అంబులెన్సులను కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నాలుగుసార్లు పిలిచిన టెండర్లు వృథా అయ్యాయి. చివరికి ఐదో విడత టెండర్‌లో ‘ఫోర్స్‌’ను ఎంపికయ్యేలా చేశారని చెబుతున్నారు. టెండరు పొందేందుకు రెండు సంస్థలు పోటీ పడ్డాయి. ఒక సంస్థ విడిగా టెండరు    దాఖలుచేయగా, మరో మూడు కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈ కన్సార్షియం సాంకేతిక అర్హత సాధించలేదు. దీంతో మరోసారి టెండరు పిలవాల్సి ఉన్నా... మిగిలిన ఒక సంస్థను నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌1గా ఎంపికచేశారు. వాహనాల కొనుగోలులో ఎడతెగని జాప్యం, పెరిగిన ఒత్తిడితో రివర్స్‌ టెండరింగ్‌ను పక్కనబెట్టారు. ఒక వాహనాన్ని రూ.13.33 లక్షలతో కొనుగోలు చేయనున్నారు. దాన్ని 104 పథకం అమలుకు అనుగుణంగా మార్పు(ఫ్యాబ్రికేషన్‌) చేసేందుకు రూ.9.18 లక్షల వరకు అదనంగా వ్యయంకానుంది. అంటే మొత్తంగా రూ.22.51 లక్షలు అవుతుంది.

ప్రణాళిక మారడంతో తగ్గిన వాహనాలు
గ్రామాల్లో ప్రస్తుతం 656 సంచార అంబులెన్సులు తిరుగుతున్నాయి. ఇవికాకుండా ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెప్ట్‌ కింద అదనంగా మరో 432 అంబులెన్సులను కొంటున్నారు. టెండరు ద్వారా సంస్థ ఎంపికై, వాహనాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చే సమయంలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం అమలు ప్రణాళికలో మార్పులు చేశారు. ఫలితంగా వాటి సంఖ్యను 432 నుంచి 221కు కుదించారు. మిగిలిన వాహనాలను ‘108 అంబులెన్సులు’గా మార్చేందుకు ఫోర్స్‌ సంస్థతో చర్చిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని