జీవో1కి మద్దతుగా నాగార్జున వీసీ మీడియా సమావేశమా?

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో1కి మద్దతుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) రాజశేఖర్‌ మీడియా సమావేశం నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది.

Published : 28 Jan 2023 03:16 IST

ఉపకులపతి తీరును ఆక్షేపించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో1కి మద్దతుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) రాజశేఖర్‌ మీడియా సమావేశం నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. రాజకీయ విషయాలతో వీసీకి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. భావప్రకటన స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని, సమాజాన్ని ఎటు తీసుకెళుతున్నారని వ్యాఖ్యానించింది. ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లు తమ పాత్రేమిటో గుర్తెరిగి ప్రవర్తించాలంది. ఇలాంటి తీరును గతంలో ఎప్పుడైనా చూశామా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీఈడీ కౌన్సెలింగ్‌ జాబితాలో తమను చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ పలు బీఈడీ కళాశాలలు శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అదేసమయంలో ఈనెల 25 నుంచి కొనసాగుతున్న బీఈడీ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించాలని కోరుతూ విద్యార్థులు సైతం వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ తదితరులు వాదనలు వినిపించారు. జీరో అడ్మిషన్‌ పేరుతో తమ కళాశాలలను కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈనెల 24న తెలియజేసి, మరుసటి రోజు (25వ తేదీ) నుంచే కౌన్సెలింగ్‌ను ప్రారంభించారన్నారు. ప్రభుత్వమిచ్చిన ధ్రువపత్రాలకు భిన్నంగా వ్యవహరించారన్నారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన న్యాయమూర్తి... ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమిటని ప్రశ్నించారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ జీవో1పై విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. విద్యా విషయాలను పక్కనపెట్టి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ స్పందిస్తూ... వీసీ వ్యవహార శైలి దురదృష్టకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు