ఏపీ సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానం విజయవాడ విమానాశ్రయం నుంచి పైకెగిరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్‌ అయింది.

Updated : 31 Jan 2023 04:47 IST

అత్యవసర ల్యాండింగ్‌
రాత్రి 9.30 గంటలకు మరో విమానంలో దిల్లీకి

ఈనాడు, అమరావతి - గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానం విజయవాడ విమానాశ్రయం నుంచి పైకెగిరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. తర్వాత మరో విమానంలో సీఎం దిల్లీ వెళ్లారు. మంగళవారం దిల్లీలోని లీలాప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరుగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సీఎం జగన్‌ బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి సాయంత్రం 5 గంటలకు రోడ్డుమార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఓఎస్డీలు కృష్ణమోహన్‌రెడ్డి, చిదానందరెడ్డిలతో కలిసి 5.03 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమయ్యారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే... ఏసీ వాల్వ్‌లో లీకేజీ సమస్య ఉన్నట్లు పైలట్‌ గుర్తించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని 5.27 గంటలకు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కొంతసేపు లాంజ్‌లో వేచి ఉన్న సీఎం... తన వాహనశ్రేణిలో తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. విమానం ఆగిపోవడంతో సీఎం మంగళవారం ఉదయం దిల్లీ బయల్దేరేందుకు వీలుగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు సీఎం కార్యాలయమూ సాయంత్రం 6 గంటలకు ప్రకటించింది. అయితే సోమవారం రాత్రి 9 గంటలకే వెళతారంటూ మరో గంటకే సీఎం కార్యాలయం మళ్లీ ప్రకటన జారీ చేసింది. అధికారులు హడావుడిగా హైదరాబాద్‌ నుంచి మరో ప్రత్యేక విమానాన్ని రప్పించి, సిద్ధం చేశారు. అందులో సీఎం, అధికారులు రాత్రి 9.30 గంటలకు దిల్లీ వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని