వరద బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని నెలలో పూర్తి చేసి గుడారాల్లోని వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగిస్తామని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీష హామీనిచ్చారు.

Updated : 21 May 2023 05:42 IST

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీష హామీ
‘ఈనాడు, ఈటీవీ’ కథనాలకు స్పందన

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ: అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని నెలలో పూర్తి చేసి గుడారాల్లోని వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగిస్తామని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీష హామీనిచ్చారు. ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని భరోసానిచ్చారు. శనివారం ‘ఈనాడు, ఈటీవీ’లలో ‘హామీల గట్టుపై కన్నీటి వేదన’ శీర్షికన ప్రచురితమైన, ప్రసారమైన కథనాలపై కలెక్టర్‌ స్పందించారు. వివిధ ప్రభుత్వ విభాగాధిపతులను వెంటబెట్టుకుని అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత ప్రాంతాలను కలెక్టర్‌ పరిశీలించారు. ముందుగా పులపుత్తూరు గ్రామంలో గుడారాల్లో నివసిస్తున్న బాధితులను పలకరించారు. వారికి అత్యవసరంగా ఇళ్లను నిర్మించి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు నెల రోజుల గడువునిచ్చారు. బాధితులకు తాగునీటి కోసం మూడు రోజుల్లో వేర్వేరుచోట్ల రెండు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి నీటి సౌకర్యం కల్పనకు పైపులైన్ల పనులు వారంలో పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 58 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలివ్వాలని, విద్యుత్తు లైన్లు, వీధిదీపాల ఏర్పాటు, రెండు శ్మశానవాటికల నిర్మాణం, ఆటస్థలానికి భూకేటాయింపు, ఆలయాల నిర్మాణానికి స్థల గుర్తింపు పనులు వారంలో పూర్తి చేయాలని, వచ్చే శనివారం తాను మరోసారి స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, గుత్తేదారు పనులు నిలిపివేయడంపై గృహనిర్మాణ శాఖ అధికారులపై మండిపడ్డారు.  పొలాల్లో పూర్తి స్థాయిలో ఇసుక మేటలు తొలగించి రైతులకు సాగు సౌలభ్యం కల్పించాలని ఆదేశించారు. నిలిచిన రక్షణ గోడల పనులపై అధికారులను నివేదిక కోరారు. పనులన్నీ పూర్తయ్యేవరకు ప్రతివారం వరద బాధిత గ్రామాలను సందర్శిస్తానని కలెక్టరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని