సీఎం సర్‌.. న్యాయం చేయండి!

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో ఒక సెంటు ప్లాట్ల నిమిత్తం సమీకరించిన భూముల్లో కోర్టు కేసున్న చోట కూడా అధికారులు పనులు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.

Updated : 02 Jun 2023 07:47 IST

మండుటెండలో ఎస్సీ కుటుంబం ఆందోళన
కోర్టు కేసున్న భూముల్లో పనులపై అభ్యంతరం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో ఒక సెంటు ప్లాట్ల నిమిత్తం సమీకరించిన భూముల్లో కోర్టు కేసున్న చోట కూడా అధికారులు పనులు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆ భూముల్లో ఏరకమైన పనులు చేయకూడదని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోలేదని వారు వాపోయారు. ఎస్సీ కుటుంబానికి చెందిన చెన్నా రాములమ్మ, గీత, అప్పలరాజులకు ముదపాకలో రెండెకరాల స్థలం ఉంది. బుధవారం సాయంత్రం నుంచి వీరి భూములకు సమీపంలో చదును, బోర్ల తవ్వకం పనులు చేపట్టారు. తరువాత వీరి భూముల వైపు రావడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాలుంటే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ‘100’కు డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహాయ సర్వేయర్‌ గోవింద్‌ సదరు భూముల్లో పనులు చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారని బాధితులు వాపోయారు.

అనంతరం ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌కు బాధిత కుటుంబం ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పనులు చేయబోమని అక్కడి వారు చెప్పడంతో వెనుదిరిగారు. మళ్లీ గురువారం ఉదయం యంత్రాలతో పనులు ప్రారంభించడంతో బాధిత కుటుంబం నిరసనకు దిగింది. సీఎం చిత్రం ఉన్న ఫ్లెక్సీతో ‘సీఎం సార్‌.. ముదపాక ఎస్సీ రైతుల సాగుదారు భూములపై హక్కు కల్పించండి’ అంటూ నినదించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మండుటెండను లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. తహసీల్దారు శ్యామ్‌ సాయంత్రం అక్కడికి చేరుకొని, గుత్తేదారులతో పనులు ఆపించి యంత్రాలను అక్కడి నుంచి పంపించేశారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో పనులు చేపట్టబోమని తెలియజేశారు. దీంతో వారు నిరసన విరమించారు.

కోర్టు ఇస్తాదిలే ఉండంటూ..

సహాయ సర్వేయర్‌ తమను దుర్భాషలాడారంటూ పోలీసు కమిషనర్‌కు వాట్సప్‌ ద్వారా రాములమ్మ ఫిర్యాదు చేశారు. మా భూముల్లో పనులు చేయడాన్ని ప్రశ్నిస్తే ‘నీకు కోర్టు ఇస్తాది భూమి.. తీసుకుందువుగాని ఉండు’ అని ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ అన్నారని వాపోయారు. సహాయ సర్వేయర్‌ గోవింద్‌ ‘ఎస్సీ మహిళలమని చూడకుండా.. మా కులం పేరెత్తి నన్ను, నా కోడలు గీత, నా కుమార్తె ఎరికమ్మను దుర్భాషలాడారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆమె అందులో కోరారు.

పరిహారం ఇస్తే..

బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘మాకు పరిహారంగా ఇవ్వాల్సిన భూయాజమాన్య హక్కు సమీకరణ పత్రం(ఎల్‌వోపీసీ) కోసం తహసీల్దారు కార్యాలయంలో అడిగినా ఇవ్వలేదు. మా భూములను వేరొకరి పేరున రాయమంటున్నారు. దీన్ని వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించాం. నష్టపరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను మాకు ఇస్తే.. భూములివ్వడానికి అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని