cm jagan: జగన్‌ మామ.. ఘాటు ప్రేమ

నా ఎస్సీ... నా ఎస్టీ...దాదాపుగా ప్రతీ సభలోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే పలికే మాట ఇది.

Updated : 28 Jun 2023 07:49 IST

ఎస్సీ, ఎస్టీ సాంకేతిక విద్యార్థులపై సర్కారు నిర్లక్ష్యం
జీఎంఆర్‌ కళాశాలల నిర్వీర్యం

నా ఎస్సీ... నా ఎస్టీ...

దాదాపుగా ప్రతీ సభలోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే పలికే మాట ఇది. పెదవుల్లోంచి వచ్చే పైపై మాటల ద్వారానే ఘాటు ప్రేమ చూపించడంలో ఆరితేరిపోయిన సీఎం జగన్‌... చేతల్లో వారి భవిష్యత్తుకు సమాధి కడుతున్నారన్నది నిష్ఠుర సత్యం.

ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్‌ కళాశాలలను చూడండి.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా ఆ వర్గాల విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేయడంలో జగన్‌ సర్కారు వందశాతం విజయం సాధించింది.


* ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్‌ మోడల్‌ రెసిడెన్షియల్‌ (జీఎంఆర్‌) పాలిటెక్నిక్‌ కళాశాలలు 7. అవి కేఆర్‌పురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, శ్రీశైలం, ఏటపాక, రంపచోడవరం, పాడేరు. ఇక్కడ 85శాతం సీట్లు ఎస్టీ విద్యార్థులకే.

* ఎస్సీల కోసం ఏర్పాటు చేసినవి 2. అవి మదనపల్లె, రాజమహేంద్రవరం. ఇక్కడ 70 శాతం సీట్లు వారితోనే భర్తీ చేయాలి.

* వీరికి అన్ని సదుపాయాలు కల్పించి, డిప్లమో విద్యను అందించాలి.

* జగన్‌ సర్కారు వచ్చాక నిర్వీర్యం చేసే దిశగానే అడుగులేసింది.


స్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గతంలో ఏర్పాటు చేసిన జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను జగన్‌ సర్కారు గాలికొదిలేసింది. నిధులివ్వకుండా.. అధ్యాపకులను నియమించకుండా.. వసతిగృహాలను పట్టించుకోకుండా.. సదుపాయాలను సమకూర్చకుండా.. కోర్సుల్లో మార్పులు చేయకుండా.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది.

* జీఎంఆర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు ఇవ్వడం మానేసింది.

* విద్యార్థుల భోజన ఖర్చుకు డబ్బులు అప్పుడప్పుడూ ఇస్తూ వారిని ఇబ్బంది పెడుతోంది.

* నాణ్యమైన విద్య అందకుండా.. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయడం లేదు.

* ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక నిధులనూ ఇవ్వటం లేదు.

* ఉచిత పుస్తకాల సరఫరా కూడా అంతంతమాత్రమే. గుర్తొచ్చినప్పుడు ఇవ్వటం, లేదంటే ఎగనామం పెట్టడం జగన్‌ సర్కారుకు అలవాటుగా మారిపోయింది.

* గతంలో విద్యాశాఖలో ఉన్న పాలిటెక్నిక్‌లను నైపుణ్యాభివృద్ధి శాఖలోకి తీసుకొచ్చినా. నిధులిస్తున్న దాఖలాల్లేవు.


అధ్యాపకుల్లేరు..  పాఠాలు ఎలా?

* రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలుండగా వీటిల్లో 11 కళాశాలలకు అధ్యాపక పోస్టులే లేవు. మరో 13 కళాశాలలకు అరకొరగానే మంజూరు చేశారు. 

* 11 కళాశాలల్లోనూ ప్రిన్సిపల్‌ లేదా హెచ్‌ఓడీని ఓఎస్‌డీగా నియమించి, ఒప్పంద అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తున్నారు..

* నిబంధనల ప్రకారం బ్రాంచికి హెచ్‌ఓడీ, సీనియర్‌ లెక్చరరు, ఐదుగురు లెక్చరర్లు ఉండాలి. 24 కళాశాలల్లో 223 పోస్టులకుగాను  65 మందే రెగ్యులర్‌ వాళ్లున్నారు.

* తాజాగా బేతంచర్ల, గుంతకల్‌, మైదుకూరుల్లో కొత్త పాలిటెక్నిక్‌లను మంజూరు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశాలు నిర్వహిస్తోంది. పోస్టులను మాత్రం ఇవ్వలేదు.

* అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఐదేళ్లలో తప్పనిసరిగా పోస్టులను మంజూరు చేయాలి. సాంకేతిక విద్యాశాఖ ఈ నిబంధనను పాటించడం లేదు. కొత్త పోస్టుల మంజూరు కోసం కమిషనరేట్‌ నుంచి ఆర్థిక శాఖకు దస్త్రం పంపినా పక్కన పడేస్తున్నారు. ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, రంపచోడవరం, కేఆర్‌ పురం పాలిటెక్నిక్‌లకు ఒక్క పోస్టూ ఇవ్వలేదు.

* అధ్యాపకుల కొరత కారణంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలువురు ఒప్పంద అధ్యాపకులు నెలలో సగం రోజులు ఒకచోట, మరో సగం రోజులు మరోచోట బోధన చేస్తున్నారు. ఏఐసీటీఈ ప్రకారం అధ్యాపకుడు వారానికి 18 గంటలు బోధించాలి. రెండుచోట్ల పని చేసే ఒప్పంద అధ్యాపకులు 36 గంటలు బోధిస్తే తప్ప పాఠాలు పూర్తి కాని పరిస్థితి.


ప్రవేశాలేవీ?

* ఏలూరు జిల్లా కేఆర్‌ పురం పాలిటెక్నిక్‌లో గతేడాది ఒక్కరూ చేరలేదు. ప్రస్తుతం విద్యార్థుల్లేరు. అధ్యాపకులూ లేరు. రికార్డుల్లో మాత్రం సివిల్‌, ఈఈఈల్లో 120 సీట్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు.

* అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం జీఎంఆర్‌లో మూడేళ్లలో కలిపి 10 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ మెకానికల్‌లో 60, ఈఈఈలోలో 30 చొప్పున సీట్లు ఉన్నాయి.

* పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌లో మూడేళ్లకు కలిపి కేవలం ఆరుగురే ఉన్నారు. గతేడాది ఒక్క విద్యార్థి మాత్రమే చేరారు. ఇక్కడ సివిల్‌, మెకానికల్‌లో 54 చొప్పున సీట్లు ఉన్నాయి.

* గుమ్మలక్ష్మీపురం కళాశాలలో గతేడాది ఒక్కరే చేరారు. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు చదువుతున్నారు. ఇక్కడ ఈఈఈ, ఎంఈసీల్లో 60 చొప్పున సీట్లున్నా పిల్లలు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.

* కాకినాడ జిల్లా అనపర్తి కళాశాలకు ఇంతవరకు భవనమే నిర్మించలేదు. అనకాపల్లి జిల్లా చోడవరంలో పాఠశాల భవనంలోనే కళాశాలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులోనూ ఇదే పరిస్థితి. ఆరు బయటే ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వసతిగృహం దూరంగా ఉండడం, సదుపాయాలు లేకపోవడంతో గతేడాది ఐదుగురు మాత్రమే చేరారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని