CM Jagan: సీఎం నోట.. మళ్లీ అదే మాట!

‘‘గోదావరిలో కలిసిపోతున్న లంక భూములను కాపాడడానికి నిధులు మంజూరు చేశాం. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద లంక భూముల రక్షణకు రూ.79.76 కోట్లతో చేపట్టనున్న రాతి కట్టడం పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించాం.

Updated : 12 Aug 2023 09:57 IST

గోదావరి లంక భూముల రక్షణకు 44 నెలల క్రితమే హామీ
నేటికీ ప్రారంభంకాని పనులు
రూ.150 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తామంటూ తాజాగా ప్రకటన
మూడున్నరేళ్లు దాటినా పనుల ఊసేలేదు..

‘‘గోదావరిలో కలిసిపోతున్న లంక భూములను కాపాడడానికి నిధులు మంజూరు చేశాం. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద లంక భూముల రక్షణకు రూ.79.76 కోట్లతో చేపట్టనున్న రాతి కట్టడం పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించాం...’’

2019 నవంబరు 21న ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో నిర్వహించిన జాతీయ మత్స్యకార దినోత్సవ సభలో సీఎం జగన్‌ వ్యాఖ్యలివి.

  • నదీ కోత నివారణకు పోలవరం ఐలాండ్‌ ప్రాజెక్టు(పీఐపీ) ఏటిగట్టు 9వ కిలోమీటరు నుంచి 11వ కిలోమీటరు మధ్య రూ.79.76 కోట్లతో పిచ్చింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ పనులకు 44 నెలల క్రితం ఈ సభా ప్రాంగణం నుంచే సీఎం శిలాఫలకం ఆవిష్కరించారు. పనులు మంజూరై టెండర్లు ఖరారైనా నేటికీ ప్రారంభం కాలేదు.  

రెండు నెలల్లో పనులు సాధ్యమేనా..?

‘‘గోదావరి పరీవాహక పొట్టింక, రాణేలంక, కూనాలంక, గురజాపులంక, వివేకానంద వారధి ప్రాంతాల్లో కోత నివారణకు 3.5 కి.మీ మేర రక్షణ గోడ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. మరికొన్ని లంక గ్రామాలకు రక్షణ గోడ నిర్మించాల్సి వస్తే అదనంగా మరో రూ.50 కోట్లు అవసరమైనా మంజూరు చేస్తా. పది రోజుల్లో అంచనాలు రూపొందించి.. నెల రోజుల్లో టెండర్లు పిలిచి.. తర్వాత నెలలో పనులు మొదలయ్యేలా చూస్తా...’’

2023 ఆగస్టు 8న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వరద పీడిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇది.

గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ కళ్లెదుటే భూములు, అందులోని విలువైన పంటలు నదీ గర్భంలో కలిసిపోతుంటే.. నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఆ ప్రాంత రైతులది. కోత నివారణ చర్యలపై సర్కారు కాలక్షేపం చేస్తోందని.. మూడున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీకే దిక్కులేదు.. ఇప్పుడు కొత్త హామీని రెండు నెలల్లో ఎలా నిలబెట్టుకుంటారో చూద్దామనే చర్చ కోనసీమ ప్రాంతంలో నడుస్తోంది.


ఈనాడు, కాకినాడ- ముమ్మిడివరం, న్యూస్‌టుడే: లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేస్తున్న.. లక్షల మంది దాహార్తి తీరుస్తున్న గోదారమ్మకు ఆగ్రహం వస్తే వరదల రూపంలో అన్నదాతల కాళ్ల కింద భూమి కరిగిపోతోంది. వరద ఉద్ధృతి పెరిగినప్పుడల్లా లంక భూములు కోతకు గురవుతున్నాయి. మరోవైపు నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో గోదావరి గమనం మారి రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా సమస్యను ఎదుర్కొంటున్నా..వేల ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోతున్నా పాలకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. వరదల వేళ ఉత్తుత్తి హడావుడి తప్ప.. శాశ్వత పరిష్కారం చూపుతామన్న హామీలు అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా అడపాదడపా హామీలిస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లంకా ఆఫ్‌ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, సలాదివారిపాలెం, అయినాపురం, కొండుకుదురులంక, పొట్టిలంక, ఎరకల్లంక, కె.గంగవరం, కూళ్ల, శేరులంక, సుందరపల్లి, పి.గన్నవరం, లంకల గన్నవరం, మొండెపులంక, మానేపల్లి, కె.దొడ్డవరం, అప్పనపల్లి, కె.ముంజివరం, ముగ్గళ్ల, కటార్లంక, బొబ్బిల్లంక, వై.కొత్తపల్లి, రామరాజులంక, మేకలవారిపాలెం, ఎదుర్లంక, గుత్తెనదీవి, బూరుగులంక, బెల్లంపూడిలంక, రఘుదేవపురం తదితర ప్రాంతాలను నదీ కోత వేధిస్తోంది. విలువైన లంక భూములు కోతకు గురై రైతులు నష్టపోతున్నారు. ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని సలాదివారిపాలెంలో ప్రాథమిక పాఠశాల నదీగర్భంలో కలిసిపోతే పంచాయతీ కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడి రామాలయం సైతం గోదావరిలో కలిసిపోయింది.

లంక భూముల్లోని నదీ కోత ప్రాంతాలను 2016లో కేంద్ర బృందం పరిశీలించింది. నివారణ చర్యలకు రూ.811 కోట్లు అవసరమని జలవనరుల శాఖ  ప్రతిపాదనలు సమర్పించింది. ఈ పనులకు నేటికీ మోక్షంలేదు. 2020లో గోదావరి నదీకోత పరిశీలనకు ప్రభుత్వం సాంకేతిక సలహా మండలి(టీఏసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లంకల్లో పర్యటించి తక్షణం చేపట్టాల్సిన పనులను గుర్తించి రూ.500 కోట్లకు పైగా ప్రతిపాదనలు పంపింది. వీటిలోనూ కదలిక లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని